బీపీ.. రెండు చేతులకూ చూడాల్సిందే!!
మీరు ఎప్పుడైనా బీపీ చూపించుకున్నారా? వైద్యులు ఒక్క చేతికే చూశారా, లేక రెండు చేతులకూ చూశారా? ఇప్పటివరకు రెండు చేతులకూ బీపీ చూసినట్లు ఎక్కడా గుర్తు లేదు కదూ. కానీ, గుండె కవాటాలకు సంబంధించిన వ్యాధుల గురించి తెలుసుకోవాలంటే మాత్రం రెండు చేతులకూ బీపీ చూడాల్సిందేనని పరిశోధకులు చెబుతున్నారు. రెండు చేతులకు బీపీ చూసినప్పుడు సిస్టాలిక్ బీపీలో ఏమైనా తేడా ఉంటే.. దాన్ని బట్టే భవిష్యత్తులో గుండె కవాటాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయో లేదో తెలుసుకోచ్చట.
రెండు చేతులకు సిస్టాలిక్ బీపీలో పది పాయింట్ల కంటే ఎక్కువ తేడా ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందేనని చెబుతున్నారు. దాదాపు పది శాతం మందికి ఇలాంటి తేడా కనిపించిందని, వారికి మిగిలినవారి కంటే గుండెకవాటాలకు సంబంధించిన ముప్పు ఎక్కువగానే ఉందని పరిశోధనకు నేతృత్వం వహించిన ఇడో వైన్బెర్గ్ చెప్పారు. 40 ఏళ్లకంటే ఎక్కువ వయసున్న 3,390 మందిని పరిశీలించి మరీ వారీ నిర్ధారణకు వచ్చారు. ఈ పరిశోధన వివరాలు అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ప్రచురితమయ్యాయి.