cardiovascular
-
ఒక్క హూప్తో ఎన్నెన్నో ప్రయోజనాలు, మీరూ ట్రై చేస్తారా?
కాస్త సీరియస్‌గా ఎక్సర్సైజ్లు చేసే వాళ్లకు హూలాహూప్ గురించి తెలిసే ఉంటుంది. హూలాహూప్ అంటే రబ్బర్ లేదా స్టిఫ్ గ్రాస్ లేదా తేలికపాటి కొయ్యతో తయారైన ఒక పెద్ద రౌండ్ చక్రం. దీన్ని నడుము, పాదాలు లేదా మెడ చుట్టూ తిప్పుతూ బాలెన్స్ చేస్తారు. ఇది మనిషి మనుగడలో ఎప్పటినుంచో ఉంది. కానీ ఆధునిక హూలాను 1958లో ఆర్ధర్ కనుగొన్నాడు. పిల్లలు వాడే హూప్ వ్యాసం దాదాపు 28 అంగుళాలు, పెద్దలు వాడే దాని వ్యాసం 40 అంగుళాలు ఉంటుంది. హులా హూప్ అలవాటు కావటానికి కొంచెం సమయం పడుతుంది కానీ, ఒకసారి హులా హూప్ చేయటం ప్రారంభించాక మీ శరీర కండరాలు బలపడి, మంచి శరీర ఆకృతి మీ సొంతం అవుతుంది. హులా హూప్ ద్వారా చేతులు, కాళ్ళు, తొడలు, పిరుదులు, ఉదరభాగం, వెన్నుభాగం కూడా మంచి ఆకృతిని సంతరించుకుంటాయి. ప్రయోజనాలు... 1 కార్డియో కండరాలకు బలం: హూప్తో చేసే ఎక్సర్సైజ్లు కార్డియో విభాగం కిందకు వస్తాయి. ఇవి గుండె, ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరఫరా మెరుగుపరిచేందుకు దోహదం చేస్తాయి. దీనివల్ల గుండెజబ్బులు, డయాబెటిక్స్, కొలెస్ట్రాల్ పెరుగుదల లాంటి రిస్కులు తగ్గుతాయి. బ్రెయిన్ సెల్స్ చురుగ్గా తయారవుతాయి. స్ట్రెస్ తగ్గుతుంది. హూప్తో ఒక క్రమబద్ధమైన రిధమ్ సాధించగలిగితే రక్తప్రసరణ మెరుగవుతుంది, కేలరీ లు కరిగిపోతాయి. 2 ఆబ్స్ కోసం: హులా వ్యాయామం శరీర ఉదరభాగంలోని కండరాలను ప్రభావితం చేస్తుంది. హూప్‌కు అనుగుణం గా మీ శరీరాన్ని తిప్పటం వలన కండరాలు స్ట్రెచ్ అవుతాయి. దీంతో బలమైన ఆబ్స్ వస్తాయి. నడుము షేప్ బాగా రావాలంటే రోజులో కనీసం 5 – 7 నిమిషాల పాటూ 3 సెట్లుగా హులా హూప్ వ్యాయామం చేయాలి. ఇందుకు కనీసం పావుగంట సమయం వెచ్చించాలి. 3 నిస్సత్తువను పారదోలడానికి: హులా హూప్ సులభంగా కనపిస్తుంది, కానీ అంత వీజీకాదు. అదే సమయంలో ఇది నేర్చుకోవడం మంచి వినోదాన్నిస్తుంది. దీనిని ఒక వ్యాయామంగా కాకుండా ఒక ఆటగా ఆస్వాదించే వారు ఎక్కువ సమయం పాటూ హులా హూప్ చేస్తుంటారు. దీనివల్ల మన ఒంట్లో సత్తువ (స్టామినా) పెరిగి, బద్దకం వదులుతుంది. 4 పెరిగే ఏకాగ్రత: హులా హూప్ చేయటానికి వివిధ కండరాల మధ్య సమన్వయం అవసరం. శరీర కండరాలను సరైన సమయంలో సరైన విధంగా కదపగలిగితేనే హులా హూప్ తిరుగుతుంది. ఇందుకు మంచి సాధన అవసరం. హులా హూప్ తిప్పడం మన ఏకాగ్రత స్థాయిలను పెంచుతుంది. 5 ఖర్చు తక్కువ: దీన్ని ఇంటివద్దే చేసుకోవచ్చు. ఫీజులు కట్టి జిమ్‌లో చేరక్కర్లేదు. క్లాసులకు వెళ్లక్కర్లేదు. జిమ్‌లో మిషన్లు వాడేందుకు వేచిచూడక్కర్లేదు. పైగా దీన్ని ఎక్కడైనా చేసుకోవచ్చు. ఎలా? ఎలా? ముందుగా మీకు తగిన సైజు హూప్‌ను ఎంచుకోండి. ఈ వ్యాయామం విజయవంతం కావాలంటే హూప్ సైజ్ కరెక్ట్‌గా ఉండడం ముఖ్యం. కొత్తగా ఆరంభించేవాళ్లు కాస్త పెద్ద సైజు హూప్ తీసుకోవాలి. అలాగే హూప్ వెయిట్ మీకు అనుగుణంగా ఉండాలి. మరీ బరువైతే తిప్పలేరు. కొత్తవాళ్లు కనీసం ఒక కేజీ వెయిట్ ఉన్న హూప్ ఎంచుకోవాలి. హూప్ ఆరంభించేముందు నెట్లో బిగినర్స్ కోసం ఉన్న వీడియోలు శ్రద్ధగా చూడండి. లోకల్ జిమ్‌లో గైడ్ ఉంటే సాయం తీసుకోండి. బేసిక్స్ వచ్చాక తేలికపాటి వర్కవుట్స్ ఆరంభించాలి. అనుభవం పెరిగే కొద్దీ సమయం పెంచుకోవచ్చు. ప్రతిరోజూ రెండు మూడు సెట్లు ఒక్కోటి పదినిమిషాలుండేలా చూసుకోండి. ఈ జాగ్రత్తలు అవసరం సరైన పోశ్చర్ మెయిన్ టెయిన్ చేయడం హూప్కి అవసరం. హూపింగ్ చేసేటప్పుడు వెన్నుముక నిటారుగా ఉండాలి, నడుం దగ్గర ఒంచడం చేయవద్దు. టైట్‌గా ఉండే దుస్తులు వేసుకోవడం వల్ల హూప్ గమనానికి అడ్డం రాకుండా ఉంటాయి. వెన్నునొప్పి ఉన్నవాళ్లు తేలికపాటి హూపింగ్ చేయాలి. సరైన రీతిలో, సరైన విధంగా చేస్తే హూలా హూప్ మీకు మంచి షేప్ ఇవ్వడమే కాకుండా స్ట్రెస్ రిలీజ్ చేస్తుంది. హూప్ డాన్స్ నడుం చుట్టూ హూప్‌ను తిప్పుతూ మ్యూజిక్కు అనుగుణంగా డాన్స్ చేయడమే హూప్ డాన్స్. ఇది హూపింగ్ ఎక్సర్సైజ్కు తర్వాత స్థాయి. హూలా హూప్తో బాగా ప్రాక్టీస్ వస్తే హూప్డాన్స్ సాధ్యమవుతుంది. క్రీ.పూ.1000 సంవత్సరంలో ఈజిప్ట్‌లో ఈ తరహా డాన్స్లున్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఆధునిక ప్రపంచంలో హూప్ డాన్స్ బాగా ప్రాచుర్యం పొందింది. ఇందులో నిష్ణాతులు తమను తాము హూపర్స్’’ అని పిలుచుకుంటారు. సాధారణ హూప్ మాత్రమే కాకుండా నిప్పు అంటించిన హూప్స్‌తో కూడా కొందరు డాన్స్ ప్రదర్శనలు ఇస్తారు. ఇక వీధుల్లో హూప్ డాన్స్ ప్రదర్శన ఇచ్చేవాళ్లను ‘‘హూప్ బస్కర్స్’’ అంటారు. ప్రపంచ వ్యాప్తంగా హూపర్స్, హూప్ బస్కర్స్ కలిసి ప్రపంచ హూప్ డాన్స్ ఫెస్టివల్, వరల్డ్ బస్కర్స్ ఫెస్టివల్ లాంటివి జరుపుకుంటారు. ఇందులో ప్రపంచ నలుమూలల నుంచి హూపర్స్ వచ్చి పాల్గొంటారు. ఇక వీరిలో వీరికి పోటీలు నిర్వహించుకొని టాప్ హూపర్స్ను గుర్తించేందుకు వరల్డ్ హూప్ డాన్స్ చాంపియన్ షిప్ పోటీలు సైతం నిర్వహిస్తారు. – డి. శాయి ప్రమోద్ -
నిద్రలేమితో గుండెకు ముప్పు
వాషింగ్టన్ : ఇటీవలి కాలంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో నిద్రలేమి ఒకటి. కొన్నేళ్ల క్రితం అసలు ఇది ఒక ఆరోగ్య సమస్యగా మారుతుందని ఎవరూ ఊహించి కూడా ఉండరు. మారుతోన్న జీవన విధానాలు, విపరీతమైన మొబైల్ ఫోన్ వాడకంతో పట్టణాలతోపాటు పల్లెలోనూ ఎంతోమంది నిద్రకు దూరమవుతున్నారు. అయితే సరిపడా నిద్రలేకపోతే మాత్రం ప్రమాదమనే హెచ్చరిస్తున్నారు నిపుణులు. రోజులో కనీసం ఆరు గంటల నిద్రలేకపోతే గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. తక్కువ నిద్రపోయే వారి రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోయే అవకాశం 27 శాతం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీకి చెందిన పరిశోధకులు సుమారు 4వేల మంది ఉద్యోగుల అలవాట్లు, వారికున్న వ్యాధులను పరిశీలించారు. వీరిలో నిద్రలేమితో బాధపడుతున్నవారు గుండె జబ్బులు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. -
గుండెజబ్బుకు మరింత మెరుగైన చికిత్స
గుండెజబ్బులు వచ్చిన వారు తరువాతి కాలంలో గుండె పనిచేయకపోవడం వల్ల మరణించే అవకాశాలను గణనీయంగా తగ్గించేందుకు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి సరికొత్త విధానాన్ని ఆవిష్కరించింది. ఇదేంటో తెలుసుకోవాలంటే ముందుగా గుండెపోటు తరువాత శరీరంలో జరిగే పరిణామాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. గుండెపోటు వచ్చిన తరువాత రక్తనాళాలు పూడుకుపోయిన చోట గుండె కణజాలం దెబ్బతింటుంది. ఈ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు గుండె తన ఆకారాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది కాస్తా చాలా సందర్భాల్లో గుండెలోని ఒక వాల్వ్ పనిచేయకుండా పోయేందుకు కారణమవుతుంది. ఈ సమస్యలను అధిగమించేందుకు ఎంఐటీ, హార్వర్డ్, రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (ఐర్లాండ్), కొన్ని ఇతర సంస్థలు కలిసి థెరిపీ పేరుతో ఓ పరికరాన్ని అభివృద్ధి చేశాయి. శస్త్రచికిత్స ద్వారా దీన్ని గుండెపైభాగంలో అతికిస్తే.. ఆ తరువాత దాని ద్వారా మందులను నేరుగా కణజాలం దెబ్బతిన్న ప్రాంతానికి అందివ్వవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఎల్లెన్ రోష్ తెలిపారు. పోటు కారణంగా గుండె దెబ్బతిన్నప్పటికీ ఈ పరికరం ద్వారా పరిస్థితి మరింత చేజారకుండా చూడవచ్చునని చెప్పారు. ఈ పని కోసం ప్రస్తుతం ఉపయోగిస్తున్న పద్ధతుల వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయని.. థెరపీ ద్వారా వీటిని అధిగమించవచ్చునని వివరించారు. -
కార్డియో వాస్కులర్‌కు సూదిమందు
మన శాస్త్రవేత్తలు కనుగొన్నారన్న కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి హర్షవర్థన్ బ్యాక్టీరియాను తట్టుకునే వరి వంగడాన్ని సీసీఎంబీ తయారు చేసినట్లు వెల్లడి సీఎస్ఐఆర్ శాస్త్రవేత్తల కృషితో డీజిల్‌తో నడిచే చిన్న ట్రాక్టర్ తయారీ రాష్ట్రాల పాత్రికేయులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ప్రెస్‌మీట్ సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతకమైన కార్డియో వాస్కులర్ వ్యాధులకు సూదిమందు రూపంలో ప్రొటీన్ అందించి ప్రాణాలు కాపాడే ఔషధాన్ని మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారని కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి డాక్టర్ హర్షవర్థన్ వెల్లడించారు. సీఎస్ఐఆర్కు చెందిన శాస్త్రవేత్తలు గుండె నాళాల్లోని రక్తపు గడ్డలను తొలగించే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి(క్లాట్లను తొలగించే స్ట్రెప్టోకినేస్) రూపకల్పన చేశారని తెలిపారు. క్లాట్ల ఆధారిత త్రాండోలిటిక్ ఔషధానికి ఇప్పటికే డ్రగ్ కంట్రోలర్ అనుమతి లభించిందని, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయన్నారు. క్లాట్లను కరిగించే కొత్త తరానికి చెందిన ఔషధాలనూ తయారుచేశారన్నారు. దేశీయం గా తయారైన ఈ స్ట్రెప్టోకినేస్ అందరికీ అందుబాటు ధరలో ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పాత్రికేయులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ఢిల్లీ నుంచి మాట్లాడారు. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిన సందర్భంగా తన మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలను హర్షవర్థన్ వెల్లడించారు. మధుమేహ చికిత్స కోసం వనమూలికలతో తయారైన బీజీఆర్-34 ఫార్ములేషన్‌కు ఆయుష్ శాఖ అనుమతి లభించిందని, దీన్ని వాణిజ్యపరంగా తయారుచేసేందుకు ఢిల్లీకి చెందిన ఒక కంపెనీకి లెసైన్స్ ఇచ్చామన్నారు. ఒక్కోటి రూ.5 ఉండే ఈ మూలికా ఔషధంతో తయారైన మాత్రలను ఇప్పటికే ఉత్తర భారతంలో కొన్నిచోట్ల విడుదల చేశామన్నారు. అతిసారను నిరోధించి పిల్లల జీవితాలను కాపాడే మరో కీలక ఔషధం రోటావైరస్ వ్యాక్సిన్ దేశీయంగానే తయారైందన్నారు. దీనివల్ల ఏటా ఐదు లక్షల మంది పిల్లల ప్రాణాలు అతిసారానికి బలికాకుండా కాపాడవ చ్చన్నారు. బ్యాక్టీరియాను తట్టుకునే సాంబమసూరి.. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ(సీసీఎంబీ), వరి పరిశోధన డెరైక్టరేట్(డీఆర్ఆర్) శాస్త్రవేత్తలు ఉమ్మడిగా బ్యాక్టీరియాను తట్టుకునే వరి వంగడం ‘సాంబమసూరి’ని అభివృద్ధి చేశారని హర్షవర్థన్ తెలిపారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటక, తమిళనాడుల్లో 90 వేల హెక్టార్లలో పండిస్తున్నారన్నారు. వివేక్ 9 పేరిట అధిక ప్రొటీన్, అధిక ప్రో విటమిన్ ఏ ఉన్న హైబ్రీడ్ మొక్కజొన్న వంగడాన్ని విడుదల చేశామన్నారు. రూ.2 లక్షల ధరలోనే అందుబాటులో ఉండే 11.2 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన చిన్న డీజిల్ ట్రాక్టర్‌ను సీఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు రూపొందించారన్నారు. వచ్చే మూడేళ్ల కాలాన్ని జనవిజ్ఞాన్ యుగంగా మంత్రి అభివర్ణించారు. ప్రధాని నాయకత్వంలో పలు ప్రాజెక్టులను రూపొందించామన్నారు. దేశంలో 15 వ్యవసాయ వాతావరణ జోన్లలో దశలవారీగా ‘బయోటెక్-కిసాన్’ అమలు చేయబోతున్నామన్నారు. చిన్నసన్నకారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉన్న శాస్త్ర, సాంకేతిక అంశాలను అనుసంధానం చేస్తూ చేపడుతోన్న ప్రాజెక్టు ఇదన్నారు. 2015 మార్చిలో రూ.4,500 కోట్లతో కేంద్రం సూపర్ కంప్యూటింగ్ మిషన్‌కు అనుమతిచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా 70 అత్యున్నత సామర్థ్యం కలిగిన కంప్యూటింగ్ వసతులు ఏర్పాటు చేయడం ద్వారా విస్తృత కంప్యూటింగ్ గ్రిడ్‌ను ఏర్పాటు చేయడం దీని లక్ష్యమన్నారు. రెండేళ్లుగా వాతావరణం, తుపాన్ల గుర్తింపు నైపుణ్యాల్లో గణనీయమైన పురోగతి సాధించామన్నారు. హుద్‌హుద్ తుఫాన్ సమయంలో ఇచ్చిన ప్రమాద హెచ్చరికల వల్ల వర్షపాతం సాంద్రత, తుఫాన్ తీరాన్ని తాకే సమయాన్ని చక్కగా గుర్తించడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా ప్రజల ప్రాణాలు కాపాడగలిగారని హర్షవర్థన్ పేర్కొన్నారు.