వీడెవడండీ బాబూ!
ఫేమస్ టూన్
ఇండోనేషియన్లకు ఏదైనా కార్టూన్ నచ్చితే చాలు... నవ్వడమే కాదు, గుండెలో గుడి కట్టేసి ఆ కార్టూన్‌ను అందులో పెట్టుకుంటారు. అయిదు సంవత్సరాల క్రితం ఈ దేశంలో కార్టూన్ మ్యూజియం ఏర్పడటమే అందుకు సాక్ష్యం. ఈ మ్యూజియమ్‌లో ఇండోనేషియాకు చెందిన ప్రసిద్ధ కార్టూన్లన్నీ కొలువుతీరి ఉన్నాయి. ‘బాలి’లోని ఈ మ్యూజియానికి ప్రారంభోత్సవం చేసిన ఇండోనేషియాకు చెందిన సీనియర్ కార్టూనిస్ట్ ప్రియంటో... ‘‘ఇదో నవ్వుల ఖజానా’’ అని వ్యాఖ్యానించారు.
ఇండోనేషియన్ కార్టూనిస్ట్ డిడియై సా కార్టూన్లను టోకుగా ఒక దగ్గర చూసినప్పుడు కూడా ‘నవ్వుల ఖాజానా’ అన్న మాట మన నోటి వరకు వస్తుంది. డిడిైయెు సా మంచి ఇలస్ట్రేటర్, కార్టూనిస్ట్, డిజైనర్‌గా రకరకాల పత్రికలు, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలలో తన ప్రతిభను చాటుకున్నాడు.
కాలుష్య భూతం, మహానగరాల్లోని ఇరుకు జీవితం, డిజిటల్ జీవితంలోని గందరగోళం... ఇలా ఎన్నో సామాజిక సమస్యలను ఆయన కుంచె ప్రపంచం ముందు పెట్టింది. ఆయన వేసిన ‘డ్రైల్యాండ్’ కార్టూన్ అయితే ఒక మౌన కావ్యం అనిపిస్తుంది. అయితే అంత వేడి వేడి కార్టూన్లు మనకు ఎందుకు అనుకుంటే... ఆయన వేసిన ఈ కార్టూన్ని చూసి కాసేపు చల్లగా నవ్వుకుందాం రండి!