ధర్మమే గెలిచింది: జయ
కుట్రలు తాత్కాలికంగా గెలవొచ్చు.. తుది విజయం మాత్రం ధర్మానిదే
చెన్నై: హైకోర్టు తనను నిర్దోషిగా ప్రకటించడాన్ని వ్యక్తిగత విజయంగా భావించడం లేదని, ఈ తీర్పుతో ధర్మం గెలిచిందని అన్నాడీఎంకే అధినేత జయలలిత పేర్కొన్నారు. తనపై రాజకీయ శత్రువులు వేసిన నింద దీనితో తొలగిపోయిందన్నారు. తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈరోజు తీర్పు నాకెంతో సంతృప్తినిచ్చింది. నేను ఏ తప్పూ చేయలేదని నిరూపితమైంది. రాష్ట్ర ప్రజలు ఇన్నాళ్లుగా చేసిన పూజలకు దేవుడిచ్చిన వరం ఈ తీర్పు. దీన్ని నా విజయంగా అనుకోవడం లేదు. న్యాయం, ధర్మం నెగ్గాయి. కుట్రలు తాత్కాలికంగా నెగ్గవచ్చు. కానీ నిజాయతీ, ధర్మానిదే తుది విజయం’’ అని ఆమె పేర్కొన్నారు. డీఎంకే కుట్రపూరితంగా తనపై ఈ కేసు మోపిందని జయ మండిపడ్డారు. కక్షపూరిత రాజకీయాలను ఇప్పటికైనా విడనాడాలని ఆ పార్టీకి హితవు పలికారు. రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలన్నదే తన ఆశ అని పేర్కొన్నారు. కిందికోర్టులో తనకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పును తట్టుకోలేక కొన్ని నెలల వ్యవధిలో 233 మంది కార్యకర్తలు బలవన్మరణాలకు పాల్పడడం కలచి వేసిందని జయ ఆవేదన వ్యక్తం చేశారు. వారు కాస్త ఓపిక పట్టి ఉంటే ఇప్పుడు అందరితో కలసి ఆనందం పంచుకునేవారన్నారు.
ఇదే తుది తీర్పు కాదు: కరుణానిధి
చెన్నై: జయ కేసులో కర్ణాటక హైకోర్టు వెలువరించిందే తుది తీర్పు కాదని డీఎంకే చీఫ్ ఎం.కరుణానిధి వ్యాఖ్యానించారు. ‘అన్ని కోర్టులకు మించి మనస్సాక్షి అనే కోర్టు ఉంటుందని మహత్మాగాంధీ అన్న మాటలను గుర్తుచేస్తున్నా. ఈ తీర్పే అంతిమం కాదు. కిందికోర్టు లేవనెత్తిన అనేక అంశాలను తప్పని నిరూపిస్తూ ఆధారాలు చూపాలని జస్టిస్ కుమారస్వామి అన్నాడీఎంకే న్యాయవాదిని విచారణలో కోరారు. వాటన్నింటికీ ఆ పార్టీ న్యాయవాది ఆధారాలు చూపారా?’ అని ఒక ప్రకటనలో ప్రశ్నించారు.