జీవీఎంసీ ఎన్నికల్లో గుణపాఠం చెబుతాం
సమైక్య ప్రజారైతు సంక్షేమ సంఘం నాయకుల హెచ్చరిక
పంచగ్రామాల సమస్య పరిష్కారంపై ఎమ్మెల్యే నిలదీత
సింహాచలం : ఎన్నికల సమ యంలో పంచగ్రామాల సమస్యను ఆరునెలల్లో పరిష్కరిస్తామని చెప్పి న నేతలకు వచ్చే జీవీఎంసీ ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని సమైక్య ప్రజారైతు సం క్షేమ సంఘం నాయకు లు హెచ్చరించారు. జీవీఎంసీ 69వ వార్డు పరిధి వేపగుంట హై స్కూల్ మైదానంలో మం గళవారం నిర్వహించిన జన్మభూమి–మా ఊరు సభా ప్రాంగణం వద్ద సంఘం నాయ కులు టి.వి.కృష్ణంరాజు, రమణి తదితరులు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరించడంలో ఎమ్మెల్యే బండారు విఫలమయ్యారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పరిష్కరిస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు.
రెండున్నరేళ్లు గడిచినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. భూసమస్యపై ఇప్పటికి మూడు కేబినెట్ సమావేశాల్లో నిర్ణయాలు చేసినా ఎలాంటి పరిష్కారం చూపలేదేమని ప్రశ్నించారు. నిర్మాణాల క్రమబద్ధీకరణ కోసం అధికంగా నగదు వసూలు చేసేందుకు పూనుకున్నారన్నారు. రైతుల భూములను, ఖాళీ స్థలాలను దేవస్థానానికి అప్పగించేందుకు పూనుకున్నారని దుయ్యపట్టారు.
భూ సమస్యకు కమ్యూనిస్టులే కారణం : ఎమ్మెల్యే
పంచగ్రామాల భూసమస్య రావడానికి కారణం కమ్యూనిస్టులే అని బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. జన్మభూమి సభలో సమైక్య ప్రజారైతు సంక్షేమ సంఘం నాయకులు భూసమస్యపై ప్రశ్నించడంతో ఆయన ఆగ్రహంతో మాట్లాడారు. భూసమస్య కోర్టులో ఉందని, హైకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ప్రభుత్వ నిర్ణయం అయిపోయిందని, దమ్ముంటే కోర్టు జడ్జిని ప్రశ్నించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.