మరింత ఆసక్తిగా టైటాన్‌పై జీవాన్వేషణ
వాషింగ్టన్: విశ్వంలో ఇప్పటివరకూ కనుగొన్న గ్రహాలు, ఉపగ్రహాల్లో అత్యంత ఎక్కువగా భూమిని పోలిన లక్షణాలున్నదిగా శనిగ్రహానికి చెందిన ఉపగ్రహం టైటాన్ ను భావిస్తారు. ద్రవరూప మీథేన్ ప్రవహించిన ఆనవాళ్లు ఉపరితలంలో కలిగి ఉండటం టైటాన్ ప్రత్యేకత. భూమిని పోలిన టైటాన్‌పై జీవం ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో భావిస్తున్నారు. ఇప్పుడు దానికి మరింత బలం చేకూర్చేలా భూమిపై మాదిరిగానే టైటాన్‌పై అసాధారణంగా మేఘాలు కనిపించాయి. అక్కడి వాతావరణ మార్పుల్లో భాగంగా ఈ మేఘాలు ఏర్పడి ఉండొచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
శనిగ్రహం, దాని ఉపగ్రహాలపై పరిశోధనల కోసం నాసా పంపిన కాసినీ ఆర్బిటర్ ద్వారా టైటాన్‌పై మేఘాలు ఏర్పడటాన్ని గుర్తించారు. టైటాన్ స్ట్రాటో స్పియర్‌లో ఈ మేఘాలు ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే దశాబ్దం క్రితం నాసా ప్రయోగించిన వయేజర్ 1 స్పేస్ క్రాఫ్ట్ సైతం టైటాన్‌పై మేఘాలను గుర్తించింది. తాజాగా కనిపించిన మేఘాలు టైటాన్‌పై జీవాన్వేషణలో మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.