caste clashes
-
‘మహా అల్లర్లకు వారే కారణం’
సాక్షి,న్యూఢిల్లీ : భీమా- కొరేగావ్ ఘర్షణలతో అట్టుడుకుతున్న మహారాష్ట్రలో ఆర్ఎస్ఎస్, హిందుత్వ శక్తులు హింసను ప్రేరేపిస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఘర్షణలపై సుప్రీం కోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. బుధవారం లోక్సభ జీరో అవర్లో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున కర్గే ఈ అంశాన్నిలేవనెత్తారు. మహారాష్ట్రలో హింస ప్రజ్వరిల్లినా ప్రధాని మౌనంగా ఉండటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. మహా అల్లర్ల వెనుక ఆర్ఎస్ఎస్ సహా హిందుత్వ శక్తులున్నాయని, మహారాష్ట్రలో దళితులు, మరాఠాల మధ్య చిచ్చు పెట్టేందుకు వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.ఆయన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు అభ్యంతరం చెబుతుండటంతో ఆగ్రహించిన కర్గే తన చేతిలోని పత్రాలను చించివేశారు. దళితులకు సంబంధించిన అంశాలపై ప్రధాని మోదీ నిత్యం మౌనం వహిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో దళితులపై హింసాకాండ సాగిస్తున్నారని ఆరోపించారు. -
అధికారులపై సీఎం యోగి కొరడా..!
షహరాన్పూర్లో సడలని ఉద్రిక్తత.. మొబైల్ ఇంటర్నెట్ బంద్! షహరాన్పూర్: దళితులు, రాజ్పుత్ వర్గాల మధ్య తలెత్తిన హింసాత్మక ఘర్షణలను అదుపు చేయడంలో విఫలమైన అధికారులపై ఉత్తరప్రదేశ్ సర్కారు కొరడా ఝళిపించింది. పశ్చిమ యూపీలోని షహరాన్పూర్కు చెందిన ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులను, ఓ ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేసింది. షహరాన్పూర్లో దళితులు, రాజ్పుత్ ఠాకూర్ల మధ్య కులవైరం తలెత్తి గత నెల రోజులుగా తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. జిల్లాలోని షబ్బీర్పూర్ గ్రామంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి సభ నిర్వహించగా.. ఆ సభలో పాల్గొన్న దళితుడు ఒకరు బుధవారం హత్యకు గురయ్యాడు. మరో 20 మంది గాయపడ్డారు. దీంతో ఇక్కడ ఉద్రిక్తత మరింత తీవ్రస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన సీనియర్ ఎస్పీ ఎస్సీ దుబేను, జిల్లా కలెక్టర్ ఎన్పీ సింగ్ను యోగి సర్కారు సస్పెండ్ చేసింది. అంతేకాకుండా జిల్లా డీఐజీ జేకే సాహిపై కూడా వేటు వేసింది. షహరాన్పూర్లో హింసకు కారణమైన ప్రతి ఒక్కరిపైనా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని యోగి సర్కారు హెచ్చరించింది. సోషల్ మీడియాలో, ఇంటర్నెట్లో ప్రచారమవుతున్న వదంతులు, విద్వేష ప్రసంగాలను ప్రజలు నమ్మవద్దని, సంయమనంతో వ్యవహరిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని సీఎం యోగి కోరారు. అంతేకాకుండా షహరాన్పూర్లో విద్వేష వదంతులను అడ్డుకునేందుకు మొబైల్ ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా రద్దుచేశారు. రాజ్పుత్ వంశస్తుడైన మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా ఈ నెల 5న ఠాకూర్లు షబ్బీర్పూర్లో నిర్వహించిన ఊరేగింపు పట్ల దళితులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఘర్షణ మొదలైంది. ఇక్కడ ఇరు వర్గాల మధ్య జరిగిన కొట్లాటలో ఓ వ్యక్తి మరణించగా, 15 మంది గాయపడ్డారు. అప్పటినుంచి జిల్లాలో ఇరువర్గాల మధ్య దాడులు, ఘర్షణలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
యూపీలో కుల సంఘర్షణ!
షహరాన్పూర్: ఠాకూర్, దళిత కులాల మధ్య ఘర్షణలతో ఉత్తరప్రదేశ్లోని షహరాన్పూర్ జిల్లా అట్టుడుకుతోంది. మతపరంగా సున్నితమైన ఈ జిల్లాలోని పలుచోట్ల మంగళవారం మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో ఒకరు మరణించగా, కనీసం 20 మంది గాయపడ్డారు. జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిస్థితిని సమీక్షించి.. శాంతిభద్రతలను కాపాడాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. పోలీసులకు తోడుగా సీనియర్ అధికారులను కూడా నియమించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి పర్యటన సందర్భంగా జిల్లాలోని షబ్బీర్పూర్లో దాదాపు 12 ఠాకూర్ ఇళ్లకు కొందరు దుండగులు నిప్పుపెట్టారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆ వర్గం వారిని శాంతింపజేశారు. ఆ గ్రామంలో మాయావతి పర్యటన ముగియగానే, కత్తులు,తుపాకులతో ఓ గుర్తుతెలియని మూక.. మాయావతి సభకు వచ్చిన బీఎస్పీ మద్దతుదారులపై దాడులకు తెగబడింది. బీఎస్పీ శ్రేణులు వెళుతున్న బోలేరో వాహనంపై మూక దాడి చేసి.. తుపాకులతో కాల్పులు కూడా జరపడంతో 24 ఏళ్ల ఆశిష్ ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. గత ఏప్రిల్ నెల నుంచి షహరాన్పూర్ జిల్లాలో కులపోరుతో హింస చోటుచేసుకుంటున్నది. రాజ్పుత్ వంశస్తుడైన మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా ఈ నెల 5న ఠాకూర్లు షబ్బీర్పూర్లో నిర్వహించిన ఊరేగింపు పట్ల ఓ దళితుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకొని.. ఓ వ్యక్తి మరణించగా, 15 మంది గాయపడ్డారు. అప్పటినుంచి జిల్లాలో ఇరువర్గాల మధ్య దాడులు, ఘర్షణలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.