యూపీలో కుల సంఘర్షణ!
షహరాన్‌పూర్: ఠాకూర్, దళిత కులాల మధ్య ఘర్షణలతో ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్ జిల్లా అట్టుడుకుతోంది. మతపరంగా సున్నితమైన ఈ జిల్లాలోని పలుచోట్ల మంగళవారం మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో ఒకరు మరణించగా, కనీసం 20 మంది గాయపడ్డారు.
జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిస్థితిని సమీక్షించి.. శాంతిభద్రతలను కాపాడాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. పోలీసులకు తోడుగా సీనియర్ అధికారులను కూడా నియమించారు.
బీఎస్పీ అధినేత్రి మాయావతి పర్యటన సందర్భంగా జిల్లాలోని షబ్బీర్‌పూర్‌లో దాదాపు 12 ఠాకూర్ ఇళ్లకు కొందరు దుండగులు నిప్పుపెట్టారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆ వర్గం వారిని శాంతింపజేశారు. ఆ గ్రామంలో మాయావతి పర్యటన ముగియగానే, కత్తులు,తుపాకులతో ఓ గుర్తుతెలియని మూక.. మాయావతి సభకు వచ్చిన బీఎస్పీ మద్దతుదారులపై దాడులకు తెగబడింది. బీఎస్పీ శ్రేణులు వెళుతున్న బోలేరో వాహనంపై మూక దాడి చేసి.. తుపాకులతో కాల్పులు కూడా జరపడంతో 24 ఏళ్ల ఆశిష్ ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు.
గత ఏప్రిల్ నెల నుంచి షహరాన్‌పూర్ జిల్లాలో కులపోరుతో హింస చోటుచేసుకుంటున్నది. రాజ్‌పుత్ వంశస్తుడైన మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా ఈ నెల 5న ఠాకూర్లు షబ్బీర్‌పూర్‌లో నిర్వహించిన ఊరేగింపు పట్ల ఓ దళితుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకొని.. ఓ వ్యక్తి మరణించగా, 15 మంది గాయపడ్డారు. అప్పటినుంచి జిల్లాలో ఇరువర్గాల మధ్య దాడులు, ఘర్షణలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.