cbi raids on secretariat
-
ఉప్పందించింది ఆమ్ ఆద్మీ పార్టీ మనిషే!
సీనియర్ ఐఏఎస్ అధికారి రాజేంద్రకుమార్ అవినీతి గురించి సీబీఐకి ఉప్పందించింది ఎవరో బయటివాళ్లు కారు.. స్వయానా ఆమ్ ఆద్మీ పార్టీ మనిషే. ఆయన పేరు ఆశిష్ జోషి. ఆప్ ప్రభుత్వం ఆయనను ఢిల్లీ డైలాగ్ కమిషన్ సభ్య కార్యదర్శిగా నియమించింది. ఇండియన్ పోస్ట్ అండ్ టెలికం అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్ అధికారి అయిన ఆశిష్.. రాజేంద్రకుమార్ అవినీతిపై తొలుత ఏసీబీ చీఫ్ ఎంకే మీనాకు ఫిర్యాదుచేశారు. ఆ ఫిర్యాదును చూసిన ఏసీబీ.. ఇది తమ స్థాయి కాదని సీబీఐకి పంపింది. దాంతో సీబీఐ వర్గాలు ఒక్కసారిగా రాష్ట్ర సచివాలయం మీదే దాడులు చేశాయి. కేంద్ర ప్రభుత్వోద్యోగి అయిన ఆశిష్‌ను ఆప్ ప్రభుత్వం తెచ్చుకున్నా.. తొలుత ఆయన గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. జోషి ఎంపిక వెనక ఉన్నది ఆశిష్ ఖేతాన్ అనే మరో వ్యక్తి. ఈయన ఆమ్ ఆద్మీ పార్టీ కోసం 70 పాయింట్ల ఎజెండాను సిద్ధం చేసిన కీలక వ్యక్తి. డీడీసీకి కేజ్రీవాల్ చైర్‌పర్సన్‌గా ఉండగా, జోషి సభ్యకార్యదర్శి గాను, ఖేతాన్ వైస్ చైర్మన్ గాను ఉండేవారు. కానీ కొన్నాళ్లకే పార్టీ వర్గాలు తీవ్రంగా అవమానిస్తున్నాయంటూ ఖేతాన్ బయటకు వచ్చేశారు. ఆయన ఆశిష్ జోషిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తర్వాత కొద్ది కాలానికి ఆశిష్ జోషిని కూడా ఆప్ సర్కారు డీడీసీ పదవి నుంచి తొలగించి ఆయన మాతృవిభాగానికి పంపేసింది. ఆ తర్వాతే రాజేంద్రకుమార్ మీద ఆశిష్ జోషి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. -
ఆర్థికమంత్రి కూడా అబద్ధాలాడారు
పార్లమెంటులో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా అబద్ధాలు ఆడారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. తన సొంత కార్యాలయంలో ఫైళ్లను చూస్తున్నారని, తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదించేందుకే ఇలా చేస్తున్నారని ట్వీట్ చేశారు. రాజేంద్ర కుమార్ అన్నది కేవలం ఒక సాకు మాత్రమేనన్నారు. ఇక సీఎం కార్యాలయాన్ని సీజ్ చేయడంపై తాను షాక్ తిన్నానని, ఇలాంటిది ఇంతకు ముందెప్పుడూ లేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతుగా ట్వీట్ చేయగా, దానికి సమాధానం ఇస్తూ.. ఇది అప్రకటిత ఎమర్జెన్సీలా ఉందని కేజ్రీ అన్నారు. ఒకవేళ రాజేంద్రకుమార్ తన కార్యదర్శి కాకపోతే ఈ దాడులు జరిగేవా అని ప్రశ్నించి.. జరిగేవి కాదని తానే సమాధానం ఇచ్చారు. అప్పుడు టార్గెట్ ఎవరు.. రాజేందరా తానా అని మరో ప్రశ్న సంధించారు. 2002 సంవత్సరంలో షీలా దీక్షిత్ అవినీతి వ్యవహారం జరిగితే 2015లో కేజ్రీవాల్ మీద సీబీఐ దాడులు జరిగాయని.. 'వహ్.. మోదీజీ' అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.