పోలింగ్‌కు ముందు రోజు అమెరికాపై దాడులు!
వాషింగ్టన్: ఎన్నికల వేళ అమెరికాపై ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఉందటూ ప్రముఖ మీడియా సంస్థ శుక్రవారం బాంబు పేల్చింది. అధికారులంతా ఎన్నికల నిర్వహణలో తనమునకలైనవేళ అల్ కాయిదా ఉగ్రవాదులు దాడులకు దిగబోతున్నారని కొలంబియా బ్రాడ్ కాస్టింగ్ సిస్టం(సీబీఎస్) శుక్రవారం ఒక రిపోర్టును ప్రచురిచంది. దీంతో అగ్రరాజ్యం ఉలిక్కిపడ్డట్లైంది.
విశ్వసనీయ సమాచారం మేరకు పోలింగ్ జరగడానికి ఒక రోజు ముందు (సోమవారం) అల్ కాయిదా దాడులకు దిగనుందని, కీలకమైన న్యూయార్క్ టెక్సాస్, వర్జీనియా రాష్ట్రాల్లో ముష్కరులు విరుచుపడే అవకాశాలున్నాయని సీబీఎస్ తన రిపోర్టులో పేర్కొంది. ఈమేరకు అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు ఇప్పటికే స్థానిక అధికారులకు హెచ్చరికలు జారీచేశారని కూడా సీబీఎస్ పేర్కొంది. అయితే ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఎఫ్‌బీఐ) మాత్రం ఈ వార్తలను ధృవీకరించలేదు. అలాగని తిరస్కరించనూలేదు.
ఉగ్రవాద నిరోదక విభాగం, దేశీ భద్రతా బలగాలు, ఇంటెలిజెన్స్ వర్గాలు పూర్తి సమన్వయంతో వ్యవహరిస్తున్నాయని, అనుకోని ఉపద్రవం ఎదురైతే ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఎఫ్ బీఐ సమాధానం ఇచ్చినట్లు సీబీఎస్ రిపోర్టులో పేర్కొన్నారు. మరోవైపు ఎన్నికల్లో రిగ్గింగ్, ఎన్నికల సరళికి సంబంధించిన వెబ్ సైట్ల హ్యాకింగ్ తదితర రూపాల్లోనూ దాడులు జరిగే అవకాశాలున్నట్లు సీబీఎస్ అభిప్రాయపడింది.