వనరులు గుర్తించండి..
ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వనరులను గుర్తించాలని టీఆర్ఎస్ పార్టీ సెక్రెటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అన్నారు. గురువారం ఆదిలాబాద్‌కు వచ్చిన ఆయన స్థానిక ఆర్అండ్బీ విశ్రాంతి భవనంలో మంత్రి జోగు రామన్న, కలెక్టర్ జగన్మోహన్తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న వనరులను గుర్తించి పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల నిరుద్యోగ సమస్య తీరుతుందని అన్నారు. సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ మూతపడడానికి గల కారణాలపై అడిగి తెలుసుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న ఎయిర్‌పోర్టుకు సంబంధించిన వివరాలు కలెక్టర్ ద్వారా తెలుసుకున్నారు. నేరడిగొండ మండలం కుంటాల జలపాతంపై విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే జిల్లాకు సరిపోయే విద్యుత్‌తోపాటు ఇతర జిల్లాలకు కూడా సరఫరా చేయవచ్చని అన్నారు. హైడల్ పవర్ ప్రాజెక్టు వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదని తెలిపారు. ఇళ్లస్థలాల క్రమబద్ధీకరణ సబంధించి కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారని, అర్హులైన వారికి న్యాయం చేయాలని అన్నారు. యాపల్‌గూడలో ఏర్పాటు చేయనున్న సిమెంట్ ఫ్యాక్టరీ వివరాలను మంత్రి రామన్న వివరించారు. అంతకుముందు కలెక్టర్ జగన్మోహన్, టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి స్వాగతం పలికారు.