Centre for the Study of Developing Societies: ఒపీనియన్లు వేరువేరయా!
ఎన్నికలగానే ముందుగా ఒపీనియన్ పోల్స్ వెలువడుతుంటాయి. ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంచనాలు వెల్లువెత్తుతుంటాయి. ఇవి ఓటర్ల అభిప్రాయాలపై ఎంతో కొంత ప్రభావం చూపుతాయి. ఇలాంటి ఒపీనియన్ పోల్స్ ఫలితాల్లో కచి్చతత్వం ఎంతంటే చెప్పడం కష్టమే. ఈసారి ఎన్డీఏ కూటమి 400 పైచిలుకు లోక్‌సభ స్థానాలు సాధిస్తామని చెబుతుండటం తెలిసిందే. ఎన్డీఏ కూటమికి 372 స్థానాలు రావచ్చని ఎన్డీటీవీ పోల్ ఆఫ్ ఒపీనియన్స్ పోల్స్ సర్వే పేర్కొంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమికి 122 దాకా వస్తాయని అంచనా కట్టింది. కానీ, ఒపీనియన్ పోల్స్ ఫలితాలు కొన్నిసార్లు నిజమైనా, బెడిసికొట్టిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్) కూడా ఇదే చెబుతోంది. 1998 నుంచి 2009 ఎన్నికల దాకా వెలువడ్డ పలు ఒపీనియన్ పోల్స్‌ను సీఎస్డీఎస్ విశ్లేషించగా ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి... అంచనాలు ఇలా.. 1998 లోక్‌సభ ముందస్తు ఎన్నికల తరుణంలో వచ్చిన ఒపీనియన్ పోల్స్ ఫలితాలకు దగ్గరగానే ఉన్నాయి. కానీ 1999 లోక్‌సభ ఎన్నికలపై వచ్చిన అంచనాలు అంత కచి్చతంగా లేవు. నాడు బీజేపీ సాధించబోయే స్థానాలను ఒపీనియన్ పోల్స్ ఎక్కువ చేసి చూపాయి. అలాగే 2004 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఒపీనియన్ పోల్స్ జ్యోతిష్యం ఏమాత్రం పండలేదు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూపీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని పోల్స్ అసలే అంచనా వేయలేకపోయాయి. దాదాపు అన్ని ఒపీనియన్ పోల్స్ ఎన్డీఏ అధికారం నిలబెట్టుకుందనే చెప్పాయి. అలాగే 2009 లోక్‌సభ ఎన్నికల ముందు వేసిన అంచనాలు కూడా తప్పాయి. యూపీఏ అధికారాన్ని నిలుపుకుంటుందని మెజారిటీ ఒపీనియన్ పోల్స్ అంచనా వేయలేకపోయాయి. కానీ యూపీఏ కూటమికి 2004లో 222 లోక్‌సభ స్థానాలు రాగా 2009 ఎన్నికల్లో 262కు పెరిగాయి! 2014 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఎన్డీఏ కూటమి 257 నుంచి 340 సీట్ల వరకు గెలుచుకోవచ్చని ఒపీనియన్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. ఎన్డీఏకు 336 స్థానాలొచ్చాయి. కాంగ్రెస్ బలం బాగా పడిపోతుందన్న అంచనాలకు అనుగుణంగా 44 స్థానాలకే పరిమితమైంది. మళ్లీ 2019 ఎన్నికల్లో ఒపీనియన్ పోల్స్ అంచనాలు తప్పాయి. ఎన్డీఏకు 285 స్థానాలకు మించి రావని మెజారిటీ పోల్స్ పేర్కొనగా 353 స్థానాలు వచ్చాయి. బీజేపీ ఒంటరిగానే 303 స్థానాలు సాధించడం తెలిసిందే.ఎగ్జిట్ పోల్స్ కూడా అంతే! ప్రీ పోల్ సర్వేలకు, ఎగ్జిట్ పోల్ అంచనాలకు పెద్ద వ్యత్యాసం కనిపించదు. 2003 చివర్లో జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూల ఫలితాలు రావడంతో ఇండియా షైనింగ్ నినాదంతో 2004 కేంద్రంలో బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి 240–250 నుంచి స్థానాలు సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించగా ఫలితాలు రివర్సయ్యాయి. ఎన్డీఏ 187కే పరిమితమైంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీజేపీ సొంతంగా స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయలేకపోయాయి. 2016 చివర్లో మోదీ సర్కారు పెద్ద నోట్లను రద్దు చేశాక జరిగిన 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ తుస్సుమన్నాయి. హంగ్ వస్తుందన్న వాటి అంచనాలకు భిన్నంగా బీజేపీ ఏకంగా 300 సీట్లతో ఘన విజయం సాధించింది.నిబంధనలు ఇలా... ఎన్నికల్లో ఎవరికి ఓటేసే అవకాశం ఉందంటూ ఓటర్ల అభిప్రాయాలను తెలుసుకుని రూపొందించేవి ఒపీనియన్ పోల్స్. ఓటేసి పోలింగ్ బూత్‌ల నుంచి తిరిగి వెళ్లే ఓటర్లను ప్రశ్నించి వేసే అంచనాలే ఎగ్జిట్ పోల్స్. ఒపీనియన్ పోల్స్ ఫలితాలను ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందు వరకు ప్రకటించవచ్చు. తుది దశ పోలింగ్ ముగిశాక ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చు.తప్పడానికి కారణమేమిటి? ఒపీనియన్ పోల్స్ అంచనాలు చాలా వరకు తారుమారు కావడానికి ఎన్నో కారణాలున్నాయి. అంచనాల్లో తప్పులు ఎంత తక్కువగా ఉంటే ఫలితాలు కచి్చతత్వానికి అంత దగ్గరగా ఉంటాయి. → 1999 లోక్‌సభ ఎన్నికల్లో ఒపీనియన్ పోల్స్ అంచనాలు, వాస్తవ ఫలితాల మధ్య 20 సీట్ల దాకా తేడా ఉంది. → 2009 ఎన్నికల్లో ఈ అంతరం 25–60 స్థానాలకు పెరిగింది. 2014లోనైతే ఏకంగా 50–100 స్థానాల తేడా వచి్చంది. → ఓటర్ల అభిప్రాయాలు తెలుసుకుని తదనుగుణంగా ఈ సంస్థలు అంచనాలు వేస్తుంటాయి. అలా ఒక్కో పార్టీ/కూటమికి వచ్చే స్థానాలను లెక్కగడుతుంటాయి. → ఇది కాలం చెల్లిన పాత విధానమని నిపుణులు అంటున్నారు. → పోలింగ్ ఏజెన్సీలు సర్వేకు కావాల్సిన బలమైన వసతులు లేకపోవడం కూడా అంచనాల్లో తప్పులు పెరగడానికి కారణం. → ప్రతి నియోజకవర్గం నుంచి శాంపిల్ సైజు వీలైనంత ఎక్కువగా ఉండాలి. ఇందుకు భారీగా సిబ్బంది, నిధులు, సమయం కావాలి. → కానీ మన దగ్గర పోల్ ఏజెన్సీలకు ఈ వనరుల్లేవు. → పారీ్టల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే, ఫలితాల అంచనాలు అంత కష్టమవుతాయని సీఎస్డీఎస్ సైతం చెబుతోంది. → 2014 ఎన్నికల్లో 464 రాజకీయ పారీ్టలు పోటీ చేశాయి. 1998తో పోలిస్తే ఇది రెట్టింపు! → పోలింగ్ ఏజెన్సీలు పోటాపోటీగా పెరుగుతున్నాయి. దాంతో చాలా శాస్త్రీయంగా పోల్ సర్వేలు నిర్వహించకుండానే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. → సర్వే అంచనాలు ఎందుకు తప్పాయని చాలా పోలింగ్ ఏజెన్సీలు విశ్లేషణను చేసుకోవడం లేదు. → పైగా సర్వే ఫలితాలను ఎలా రూపొందించారో ఆధారాలను కూడా వెల్లడించడం లేదు. → ప్రీ పోల్ అంచనాలకు సంబంధించి జవాబుదారీ లేకపోవడం కూడా సమస్యకు కారణమే. – సాక్షి, నేషనల్ డెస్క్