మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన
న్యూఢిల్లీ: వచ్చే నెల 15న శాసనసభ ఎన్నికలు జరగవలసి ఉన్న మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధింపునకు కేంద్ర మంత్రివర్గం శనివారం సిఫార్సు చేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా చేసిన మరుసటి రోజునే ఢి ల్లీలో కేంద్ర మంత్రివర్గం సమావేశమై, ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో మంత్రివర్గ సమావేశానికి కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. పదిహేనేళ్ల పొత్తుకు స్వస్తి చెబుతూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పృథ్వీరాజ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో చవాన్ శుక్రవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు శనివారం ఆమోదించారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ తన నివేదిక పంపుతూ, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు తెలిసింది. కాగా, నామినేషన్ల పర్వం శనివారంతో ముగిసింది.