central powers
-
కేంద్ర బలగాల వైఫల్యం వల్లే..
కొహిమా/న్యూఢిల్లీ: నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో రేప్ నిందితుడిని కొట్టి చంపిన ఘటన అస్సాం-కేంద్ర ప్రభుత్వం మధ్య చిచ్చుకు దారితీస్తోంది. జైలు కేంద్ర బలగాల అధీనంలో ఉందని, ఆందోళనకారులు కారాగారంపైకి దూసుకురాకుండా నిలువరించడంలో ఆ బలగాలు విఫలమయ్యాయని అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఆరోపించారు. ఈ ఘటనకు కేంద్ర బలగాలే కారణమని మండిపడ్డారు. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడినందుకు అస్సాంకు చెందిన సయ్యద్ ఫరీద్ ఖాన్‌ను గురువారం రాత్రి దిమాపూర్‌లో స్థానికులు సెంట్రల్ జైలు నుంచి బయటకు లాక్కొచ్చి కొట్టి చంపడం తెలిసిందే. 'ఆ జైల్లోని ఖైదీల రక్షణ కేంద్రం బాధ్యత. కానీ కేంద్ర బలగాలు విఫలమవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుంది. నాగాలాండ్‌లోని అస్సాం ప్రజలకు తగిన భద్రత కల్పించాలి' అని గొగోయ్ శనివారం పేర్కొన్నారు. నాగాలాండ్‌లో అస్సామీల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆ రాష్ట్ర సీఎం టీఆర్ జెలియాంగ్కు, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు లేఖలు రాశారు. అస్సాంలో నాగాలాండ్ వాసులపై ప్రతీకార దాడులు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అటు నాగాలాండ్‌లోనూ అస్సామీల భద్రత కోసం రాష్ట్ర సర్కారు పెద్దఎత్తున పారామిలటరీ బలగాలను మోహరించింది. దిమాపూర్‌లో పరిస్థితి అదుపులోనే ఉన్నా భద్రతా బలగాలు 144 సెక్షన్ కొనసాగిస్తున్నాయి. ఫరీద్‌ను కొట్టి చంపిన కేసులో పోలీసులు ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించి, దోషులను శిక్షించాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత విభాగం డిమాండ్ చేసింది. అస్సాం అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఈ ఘటనను ప్రస్తావిస్తూ.. నాగాలాండ్‌లో రాష్ట్రవాసుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. మరోవైపు రాజ్‌నాథ్‌సింగ్... నాగాలాండ్ సీఎం టీఆర్ జెలియాంగ్‌తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. నిందితుడిని కొట్టి చంపినవారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సొంతూరుకు నిందితుడి భౌతికకాయం దిమాపూర్‌లో స్థానికుల చేతిలో మరణించిన ఫరీద్ ఖాన్ మృతదే హాన్ని శనివారం అస్సాంలోని అతడి స్వస్థలం కరీంగంజ్‌కు తరలించారు. అస్సాం ప్రభుత్వం ప్రత్యేక హెలికాప్టర్లో మృతదేహాన్ని తీసుకువచ్చి ఆయన బంధువులకు అప్పగించింది. ఖాన్‌ను చంపేయడంపై నిరసన వ్యక్తం చేస్తూ కరీంగంజ్తోపాటు అస్సాంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ప్రదర్శనలు నిర్వహించారు. మేం బంగ్లాదేశ్ నుంచి వలస రాలేదు: ఫరీద్ సోదరుడు నాగాలాండ్‌కు వలస వచ్చినవారిని టార్గెట్ చేసిన గ్రూపులే ఫరీద్‌ను చంపేశాయని ఆయన సోదరుడు జమాలుద్దీన్ ఆరోపించారు. తన సోదరుడిని వారు జైలు నుంచి బయటకు తీసుకువచ్చిన సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారన్నారు. తాము బంగ్లాదేశ్ నుంచి వలస రాలేదని, తనతోపాటు మరో సోదరుడు కమాల్ ఖాన్ భారత సైన్యంలోని అస్సాం రెజిమెంట్‌లో పనిచేస్తున్నామని చెప్పారు. -
కేంద్ర బలగాలతో కలసి ఉమ్మడి చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బలగాలతో కలసి ఉమ్మడి చర్యలు తీసుకుంటున్నట్లు హోం శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. సచివాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మావోల ప్రభావిత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లా నుంచి కలిసిన ఏడు మండలాల్లో కేంద్ర నిధులతో రోడ్లు, పోలీసుస్టేషన్లు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. డిపాజిట్లు, మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో రాష్ట్రంలో అనేక సంస్థలు అక్రమ లావాదేవీలు జరుపుతున్నాయన్నారు. సినీ నటులు, ప్రముఖులు అలాంటి సంస్థల ప్రకటనల్లో నటించవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పోలీసు విభాగంలో 14 వేల ఖాళీలు పోలీసు విభాగంలో 200 ఎస్సై పోస్టులతో కలిపి మొత్తం 14 వేల ఖాళీలున్నాయని చినరాజప్ప చెప్పారు. భర్తీకి అనుమతివ్వాలని ఆర్థిక శాఖకు లేఖ రాసినట్లు తెలిపారు.