స్మార్ట్‌ఫోన్ యూజర్లకు స్వీట్‌న్యూస్
స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ఇజ్రాయెల్ స్టార్టప్ ‘స్టోర్ డాట్’ తీపి కబురు అందించింది. ఐదు నిమిషాల్లోనే ఫుల్‌చార్జింగ్ కాగల ఫ్లాష్ బ్యాటరీలను త్వరలో అందుబాటులోకి తేనున్నట్టు వెల్లడించింది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ బ్యాటరీలు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని స్టోర్ డాట్ సీఈవో డొరొన్ మియర్స్‌డార్ఫ్ ‘బీబీసీ’తో చెప్పారు. వీటిని మార్కెట్లోకి తీసుకు రావడానికి ఏర్పాట్లు పూర్తయినట్టు చెప్పారు. ఫ్లాష్ బ్యాటరీలు ఐదు నిమిషాల్లోనే చార్జ్ అవుతాయని తెలిపారు. వీటిని తయారు చేసేందుకు ఏ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారో చెప్పేందుకు ఆయన నిరాకరించారు. తాము అందించిన సాంకేతిక పరిజ్ఞానంతో ఆసియా ఖండానికి చెందిన రెండు బ్యాటరీ తయారీ సంస్థలు పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టాయని, వచ్చే మొదటి త్రైమాసికంలో పెద్ద ఎత్తున ఫ్లాష్ బ్యాటరీలు తయారయ్యే అకాశముందని వివరించారు.
అత్యంత వేగంగా బ్యాటరీ చార్జింగ్ చేయగల సాంకేతిక పరిజ్ఞానం గురించి 2015లో స్టోర్ డాట్ వెల్లడించింది. లాస్ వెగాస్‌లోని జరిగిన సీఈఎస్ టెక్ షోలో ఫ్లాష్ బ్యాటరీలను ప్రదర్శించింది. సాంప్రదాయేతర చర్యలను ప్రేరేపించే పదార్థాలతో ఈ బ్యాటరీలను తయారు చేసినట్టు డొరొన్ తెలిపారు. యానోడ్ నుంచి కాథోడ్‌కు అయాన్లను పంపించే ఎలక్ట్రిక్ ప్రక్రియను వేగవంతం చేసే పదార్థాలను ఇందులో పొందుపరిచినట్టు చెప్పారు. అతి సూక్ష్మమైన నానో మెటీరియల్స్, ఆర్గానిక్ కాంపౌడ్స్ వినియోగించి వీటిని తయారు చేశారు. వీటి పనితీరుపై సాంకేతిక విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వేగంగా చార్జ్ అయ్యే బ్యాటరీలను తయారు చేసేందుకు చాలా కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి.