కల చెదిరింది !
- వర్షాలు లేక అడుగంటిపోయిన సీజీ ప్రాజెక్టు
- మూడేళ్లుగా బీళ్లుగా మారిన 909 ఎకరాలు
- వలసలే శరణ్యమంటున్న రైతన్నలు
కదిరి: తనకల్లు మండల పరిధిలోని సీజీ ప్రాజెక్టు పూర్తిగా అడుగంటిపోయింది. దీంతో ఆయకట్టుకు మూడేళ్లుగా నీటి విడుదల బంద్ అయ్యాయి. ఈ ప్రాజెక్టు నిండితే 909 ఎకరాలు కుడి, ఎడమ కాలువల ద్వారా సాగవుతుంది. తవళం, టీ.చదుం, బాలసముద్రం, ముండ్లవారిపల్లి పంచాయితీల పరిధిలోని 60 గ్రామాల రైతులు సీజీ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందుతూ వచ్చారు. మూడేళ్లుగా వర్షాలు సరిగా లేకపోవడంతో ప్రాజెక్టులో నీరు కరువైంది. 1927 అడుగుల నీటి మట్టం ఉండాల్సిన ప్రాజెక్టు ఇప్పుడు 15 అడుగులకు పడిపోయింది. ఆ› ప్రాంతంలో సరాసరి వర్షపాతం 18 మిల్లీ మీటర్లు గతంలో నమోదయ్యేది. మూడేళ్లుగా చినుకు జాడలేక కనీస వర్షపాతం కూడా న మోదు కాకపోవడంతో ప్రాజెక్టు కళతప్పింది.
కరవుకు అద్దం
సాగు సందడితో కళకళలాడాల్సిన భూములు నేడు బీడుగా దర్శనమిస్తున్నాయి. ‘అయ్యా..ఇంతటి కరవు మేమెప్పుడూ చూడలేదు. రైతుకు ఎంత కష్టమొచ్చిందయ్యా..బోర్లన్నీ ఎండిపోయాయి. గతంలో ఎన్ని కరువులొచ్చినా ఎండిపోని బోర్లు ఈ మూడేళ్లలో ఎండిపోయాయి. ఇట్లే ఉంటే ఏం తినాలి..ఎట్లా బతకాలి’ అని కొక్కంటి క్రాస్కు చెందిన రైతు ఆదినారాయణ వాపోయాడు. ‘ప్రాజెక్టులో నీళ్లుంటే మండలమంతా పనులుండేవి. ఎవరింట్లో చూసినా ధాన్యానికి కొదవుండేది కాదు. ప్రాజెక్టు గేట్లెత్తి సరిగ్గా మూడేళ్లు దాటిపోయింది. ఈసారి కూడా వాన రాకపోతే గంజి నీళ్లే గతి’ అని టీ. సదుంకు చెందిన రైతు వెంకటరమణ తన గోడు వెల్లబోసుకున్నాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏ రైతును కదిపినా, రైతు కూలీని పలకరించినా కన్నీటి గాథలే విన్పిస్తున్నాయి.
నీరు చేరేది ఇలా...
పాపాఘ్ని నది కర్ణాటకలోని కోలార్ జిల్లా నందికొండ వద్ద పుట్టి వివిధ ప్రాంతాల్లో ప్రవహిస్తుంది. అందులో ఒక చీలిక మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా కందుకూరు చెరువులో కలుస్తుంది. అక్కడి మిగులు జలాలు అనంతపురం జిల్లా తనకల్లు మండలంలో ఉన్న సీజీ ప్రాజెక్టులో కలుస్తాయి. ఈ మిగులు జలాల ఆధారంగానే ఎన్పీ కుంట మండలంలో పెడబల్లి ప్రాజెక్టు నిర్మించారు. ఆ మిగులు జలాలు వైఎస్సార్ జిల్లాలోని వెలిగల్లు ప్రాజెక్టుకు చేరతాయి.
టీడీపీ నేతల స్వార్థం
చిత్తూరు జిల్లా కందుకూరు నుండి వచ్చే జలాలు సీజీ ప్రాజెక్టుకు రాకుండా చిత్తూరు జిల్లాకే పరిమితమయ్యే విధంగా అక్కడి అధికార టీడీపీ నాయకులు చర్యలు తీసుకున్నారు. ఆ జిల్లాలోని కమ్మచెరువుతో పాటు మరో 6 చెరువులకు ఆ నీటిని మళ్లించారు. ప్రస్తుతం కర్ణాటకలోని వందమానేరు నుండి వచ్చే మిగులు జలాలు మాత్రమే సీజీ ప్రాజెక్టుకు చేరుతున్నాయి. అక్కడ భారీ వర్షాలు కురిస్తేగాని సీజీ ప్రాజెక్టుకు నీరు చేరే పరిస్థితి లేదు.
మూడేళ్లుగా బీడే – వెంకటనారాయణ, రైతు, బాలసముద్రం
ప్రాజెక్టుకింద ఉన్న నా మూడెకరాల పొలం మూడేళ్లుగా బీడుగానే ఉంది. ఒకసారి ప్రాజెక్టులో నీళ్లున్నాయని వరి పంట సాగుచేస్తే తీరా పంట చేతికొచ్చేసరికి ప్రాజెక్టులో నీళ్లు అయిపోయి పంట అంతా ఎండిపోయింది. ఆ తర్వాత ప్రాజెక్టులోకి నీళ్లు రాలేదు. నేనే కాదు సుమారు వెయ్యి ఎకరాలు బీళ్లుగా ఉన్నాయి.
శని పట్టుకుంది – రైతు బాషుసా»Œ , కొక్కంటి క్రాస్
సీజీ ప్రాజెక్టును 1954లో కట్టారు. 1994 తర్వాత వచ్చిన ఏడేళ్ల వరుస కరవుల్లో తప్ప ప్రాజెక్టులో ఎప్పుడూ నీళ్లుండేవి. ఆ కరవు మళ్లీ ఇప్పుడొచ్చింది. మూడేళ్లుగా మాకే కాదు.. రాష్ట్రమంతా శని పట్టుకుంది. నాకు ప్రాజెక్టు కింద రెండున్నర ఎకరాలు ఉంది. ఇంతకు ముందు బాగా వరి పండేది. ఇప్పుడు అది బీడుగా మారింది.