chakrapani reddy
-
అభిమానుల ‘ఆత్మీయ’ వరద
సాక్షి, నంద్యాల: సామాజిక సాధికార యాత్రకు ప్రజలు పోటెత్తారు. ఆత్మకూరు పట్టణం జనసంద్రాన్ని తలపించింది. కనుచూపు మేర ఎటుచూసినా, ఇసుకేస్తే రాలనంతలా జనం తరలివచ్చారు. సుమారు 500 బైక్‌లతో నిర్వహించిన బైక్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సభ గ్రాండ్ సక్సెస్ అయింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. గజ మాలలు, డప్పు వాయిద్యాలు, బాణసంచా పేలుళ్లతో తమ అభిమాన నాయకులకు అపూర్వ స్వాగతం పలికారు. కరోనాలోనూ సంక్షేమ పథకాలు ఆపలేదు: డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా కరోనా కాటేసినా, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆపకుండా అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా ప్రశంసించారు. నమ్మించి మోసం చేయడం చంద్రబాబు నైజమైతే.. నమ్మిన వ్యక్తిని గుండెల్లో పెట్టుకునే వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశాం కాబట్టే.. తామంతా కాలర్ ఎగరేసి ఓట్లడుగుతున్నట్టు తెలిపారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలను నమ్మించి నట్టేట ముంచిన చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని వారిని ఓట్లడుగుతారని ఎద్దేవా చేశారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించి అమలు చేశారు: మంత్రి కారుమూరి బీసీ డిక్లరేషన్ సభలో చెప్పిన ప్రతి మాటనూ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్ అమలు చేశారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం యాదవులకు పదవులు ఇవ్వలేదని, కేవలం సీఎం జగన్ మాత్రమే యాదవులకు సముచిత గౌరవం ఇచ్చారని చెప్పారు. మూడుసార్లు సీఎంగా చేసిన చంద్రబాబు.. తన కులం వారికి కాకుండా బీసీ, ఎస్సీ, మైనార్టీలకు ఏనాడూ రాజ్యసభ టికెట్ ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ఆర్.కృష్ణయ్యను రాజ్యసభకు పంపి బీసీల గళాన్ని దేశవ్యాప్తంగా వినిపించేలా సీఎం జగన్ కృషి చేశారని ప్రశంసించారు. ఈ సందర్భంగా తాను అమెరికా వెళ్లినప్పుడు ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తనతో మాట్లాడిన మాటలను కారుమూరి గుర్తు చేసుకున్నారు. ‘మా నాన్న ఓ రిక్షా కార్మికుడు.. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్‌తో నేను చదువుకుని అమెరికాకు రాగలిగా.. మా కుటుంబమంతా వైఎస్సార్ కుటుంబానికి రుణపడి ఉంటుంది’.. అంటూ కళ్లనీళ్లు పెట్టుకున్నాడని చెప్పారు. దళితుల పట్ల నిబద్దతను చాటుకున్న సీఎం జగన్ : మంత్రి ఆదిమూలపు పూర్వకాలంలో దళితులు చదువుకుంటే నాలుక కోసేవారని, చెవుల్లో సీసం పోసేవారని.. కానీ, సీఎం జగన్ తన కేబినెట్లో ఓ దళితుడిని విద్యాశాఖ మంత్రిగా చేసి దళితుల పట్ల తనకున్న నిబద్ధతను నిరూపించుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. 2019లో 151 కి.మీ వేగంతో ఫ్యాన్‌ను తిప్పారని, 2024 ఎన్నికల్లో 175 కి.మీ వేగంతో ఫ్యాన్‌ను తిప్పాలని పిలుపునిచ్చారు. ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీలు పోతుల సునీత, ఇసాక్ బాషా, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, తొగురు ఆర్థర్, కర్నూలు మేయర్ రామయ్య పాల్గొన్నారు. -
ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్‌గా భూమన
సాక్షి, అమరావతి: అసెంబ్లీ ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నియమితులయ్యారు. పలు అసెంబ్లీ కమిటీలు, జాయింట్ కమిటీలను ఏర్పాటు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి సోమవారం రెండు బులెటిన్లు విడుదల చేశారు. ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్‌గా ఉన్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి మంత్రివర్గంలో చేరడంతో ఆయన స్థానంలో కరుణాకర్‌రెడ్డిని నియమించారు. సభ్యులుగా ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, కోన రఘుపతి, అబ్బయ్యచౌదరి, సుధాకర్‌బాబు, వెంకట చినఅప్పలనాయుడు, అనగాని సత్యప్రసాద్‌ను నియమించారు. రూల్స్ కమిటీ చైర్మన్‌గా స్పీకర్ తమ్మినేని సీతారాం, పిటిషన్స్ కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, హామీల కమిటీ చైర్మన్‌గా కైలే అనిల్‌కుమార్, ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా శిల్పా చక్రపాణిరెడ్డిని నియమించారు. అసెంబ్లీ, కౌన్సిల్‌కు పలు జాయింట్ కమిటీలను కూడా నియమించారు. ఎమినిటీస్, వన్యప్రాణి–పర్యావరణ పరిరక్షణ కమిటీల చైర్మన్‌గా తమ్మినేని, ఎస్సీల సంక్షేమ కమిటీ చైర్మన్‌గా గొల్ల బాబూరావు, ఎస్టీల సంక్షేమ కమిటీ చైర్మన్‌గా బాలరాజు, మైనారిటీల సంక్షేమ కమిటీ చైర్మన్‌గా ముస్తఫా, మహిళ, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్‌గా జొన్నలగడ్డ పద్మావతి, సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్‌గా మర్రి రాజశేఖర్, బీసీల సంక్షేమ కమిటీ చైర్మన్‌గా రమే‹Ùయాదవ్, లైబ్రరీ కమిటీ చైర్మన్‌గా పి.రామసుబ్బారెడ్డిని నియమించారు. -
నైతిక విలువలకు పట్టం.. ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయం
సాక్షి, అమరావతి: రాజకీయ విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణ, నైతికత వంటి నీతి సూత్రాలను వల్లె వేయడమే గానీ ఆచరణలో వాటికి కట్టుబడి ఉండే రాజకీయ నాయకులు కరువవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నైతిక విలువలకు పెద్దపీట వేస్తూ ఆదర్శవంతమైన రాజకీయాలకు చిరునామాగా మారారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారు. ఎవరైనా పార్టీలోకి రావాలంటే.. అప్పటిదాకా అనుభవిస్తున్న పదవులకు రాజీనామా చేశాకే రావాలని జగన్ గట్టిగా సూచిస్తున్నారు. అలా పదవులు వదులుకుని వచ్చిన వారినే వైఎస్సార్సీపీలో చేర్చుకుంటున్నారు. రాష్ట్రంలో నిస్సిగ్గుగా ఎమ్మెల్యేల కొనుగోళ్లు ఓ పార్టీ గుర్తుపై గెలుపొంది, మరో పార్టీలోకి ఫిరాయించడం ఏపీ రాజకీయాల్లో సర్వసాధారణంగా మారిపోయింది. స్వీయ ప్రయోజనాల కోసం, ప్రలోభాలకు లొంగి అధికారంలో ఉన్న పార్టీలోకి ఫిరాయిస్తున్నారు. వైఎస్సార్సీపీ టికెట్‌పై నంద్యాల నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఎస్పీవై రెడ్డి ఓట్ల లెక్కింపు పూర్తి కాక ముందే చంద్రబాబు పంచన చేరిపోయారు. తరువాత మరో ఇద్దరు ఎంపీలు అదేబాట పట్టారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలనే కుట్రతో చంద్రబాబు ఎమ్మెల్యేల కొనుగోళ్లకు తెర లేపారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు నుంచి రూ.40 కోట్లు, ఇతర ప్రయోజనాలను ఎర చూపి వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనేశారు. సొంత పార్టీలో చేర్చుకున్నారు. కొనుగోలు చేసిన వారిలో నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. చంద్రబాబు సాగిస్తున్న అనైతిక, అప్రజాస్వామిక రాజకీయాలపై ప్రజాస్వామ్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేసినా ఆయన లెక్కచేయలేదు. ఓవైపు ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూనే.. మరోవైపు ప్రజాస్వామ్య పరిరక్షణ, విలువలు, నైతికత, హుందా రాజకీయాలు అంటూ నీతిపాఠాలు చెప్పడం చంద్రబాబుకే సాధ్యమైంది. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్లోకి ఫిరాయించినపుడు కూడా సంతలో పశువులు కొన్నట్లు కొంటున్నారని చంద్రబాబు గగ్గోలు పెట్టారు. ఏపీలో పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు పడకుండా జాగ్రత్తపడ్డారు. స్పీకర్ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. జగన్ తీరుపట్ల ప్రజాస్వామ్యవాదుల హర్షం ప్రజాస్వామ్య విలువలకు సాక్షాత్తూ పాలకులే తూట్లు పొడుస్తున్న ఏపీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నీతికి, నిజాయతీకి, నైతిక విలువలకు, విశ్వసనీయతకే కట్టుబడి ఉన్నారు. 2017లో నంద్యాల అసెంబ్లీకి ఉప ఎన్నికల సందర్భంగా.. పదవికి రాజీనామా చేయనిదే వైఎస్సార్సీపీలో చేరడానికి వీల్లేదని అప్పటి టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డికి షరతు విధించారు. అప్పటికి చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికై మూడు నెలలు కూడా కాలేదు. ఇంకా దాదాపు ఆరేళ్ల పదవీ కాలం ఉంది. అయినా ఒక పార్టీ తరపున ఎన్నికై మరో పార్టీలో చేరాలంటే అంతకు ముందు సంక్రమించిన పదవి నుంచి కచ్చితంగా నిష్క్రమించాలనే విధానానికే జగన్ విలువనిచ్చారు. వైఎస్సార్సీపీలోకి వచ్చే ముందు టీడీపీ తరపున సంక్రమించిన (ఎన్నికైన) ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సిందేనని చక్రపాణిరెడ్డిని జగన్ కోరారు. ఆ ప్రకారమే చక్రపాణిరెడ్డి తన ఎమ్మెల్సీ పదవిని తృణప్రాయంగా వదిలేశారు. నంద్యాల బహిరంగ సభా వేదికపైనే తన రాజీనామా లేఖను జగన్‌కు సమర్పించారు. తాజాగా వైఎస్సార్ జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరాలన్న తన అభీష్టాన్ని వెల్లడించారు. టీడీపీ పార్టీతో సంక్రమించిన ఎమ్మెల్యే పదవిని వీడిన తర్వాతే తమ పార్టీలోకి రావాలని జగన్మోహన్రెడ్డి సూచించారు. ఆ మేరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తరువాతే వైఎస్సార్సీపీలో చేరేందుకు మేడా మల్లికార్జునరెడ్డి సన్నద్ధమవుతున్నారు. అనైతిక రాజకీయాలతో సంఖ్యాబలం పెంచుకోవడం కాదు, నైతిక విలువలకు కట్టుబడి, ప్రజాస్వామ్యం నిలబడాలనే ఉదాత్తమైన ఆశయం కోసం కృషి చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపట్ల ప్రజాస్వామ్యవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
బాబు పాలన అవినీతిమయం
ఆత్మకూరు (కర్నూలు): సీఎం చంద్రబాబు నాయుడు పాలన అవినీతిమయంగా మారిందని వైఎస్ఆర్సీపీ శ్రీశైలం నియోజకవర్గ ఇన్చార్జ్, నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శిల్పాచక్రపాణిరెడ్డి విమర్శించారు. ఆత్మకూరులోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని , పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందన్నారు. వందల కోట్ల రూపాయల అవినీతి జరుగు తోందన్నారు. దీనిపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. లేకపోతే టీడీపీ మధ్య బీజేపీ మిత్రుత్వం కొనసాగు తోందని భావించాల్సి వస్తుందన్నారు. విభజన హామీల అమల్లో కేంద్ర, రాష్ట్ర పభుత్వాలు ప్రజలను మోసం చేశాయన్నారు. ప్రత్యేక హోదాను అటకెక్కించాయని మండిపడ్డారు. ఏపీ అభివృద్ధికి హోదా ఎంతో అవసరమని..అందు కోసం వైఎస్ఆర్సీపీ నాలుగేళ్ల నుంచి అలుపెరగని పోరాటం కొనసాగిస్తోందన్నారు. ప్రత్యేక హోదా సజీవంగా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ వల్లేనన్నారు. ఇప్పటికైనా టీడీపీ ఎంపీలు పదవులకు రాజీనామా చేసి తమపార్టీ ఎంపీలతో కలిసి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. హోదా విషయంలో కేంద్ర తీరుకు నిరసనగా నేడు చేపట్టే రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. దోపిడీదారుడెవరో ప్రజలకు తెలుసు నీరు చెట్టు కార్యక్రమం కింద ఎలాంటి పనులు చేపట్టకుండా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డారాజశేఖరరెడ్డి కోట్లరూపాయలను వెనకేసుకున్నారని శిల్పాచక్రపాణిరెడ్డి అన్నారు. అలాంటి వ్యక్తికి తనపై ఆరోపణలు చే సే అర్హత లేదన్నారు. దోపిడీదారుడెవరో ప్రజలకు తెలుసన్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను సొంత డబ్బు ఖర్చు చేసి నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తున్నానని చెప్పారు. ఆరునెలల క్రితం మార్కెట్ యార్డ్‌లో రైతులు విక్రయించిన పంట ఉత్పత్తులకు ప్రభుత్వం ఇంతవరకు డబ్బులు చెల్లించలేదని, ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే దీనిపై పోరాడాలన్నారు. సిద్ధాపురం ఎత్తిపోతల పథకం నుంచి పిల్ల కాల్వలు లేకపోవడంతో సాగు నీరు అందడం లేదు. ఈ సమస్య ఎమ్మెల్యేకు పట్టదా అని ప్రశ్నించారు. తాను సిద్దాపురం ఎత్తిపోతల కోసం ఎంతో కృషి చేశానని చెప్పారు. ముస్లింలు ఎప్పటికీ వైఎస్సార్సీపీ వెంటే ఉంటారని , దివంగత వైఎస్ఆర్ వారికి చేసిన మేలు మరచిపోరన్నారు.కార్యక్రమంలో పార్టీ నాయకులు చిట్యాల వెంకటరెడ్డి, కుందూరు శివారెడ్డి, రాజమోహన్‌రెడ్డి, స్వామి, రాజగోపాల్, తిమోతి, లాలూ, బాలన్న , బీవీఆర్ , అంజాద్ అలీ, హనుమంతరెడ్డి, పోట్ల నాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు. -
వారితో రాజీనామా చేయించే దమ్ము సీఎంకు లేదు..
కొలిమిగుండ్ల : కాపులను బీసీలో, వాల్మీకులను ఎస్టీలో చేరుస్తామని కులాల మధ్య సీఎం చంద్రబాబు చిచ్చుపెట్టారని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. ఆదివారం అంకిరెడ్డిపల్లెకు చెందిన అన్నెం జయరామిరెడ్డి సోదరులతోపాటు సర్పంచ్ రాముడు, వెయ్యి మందికి పైగా కార్యకర్తలు, కనకాద్రిపల్లెకు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు దస్తగిరి.. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జ్ కాటసాని రామిరెడ్డి, నియోజకవర్గ నేత ఎర్రబోతుల వెంకటరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈసందర్భంగా నిర్వహించిన బహిరంగ సభనుద్దేశించి శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడారు. ఎన్నికల కంటే ముందు రూ. 87 వేల కోట్ల రుణ మాఫీ చేస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక రూ. 13,500 కోట్లు మాత్రమే మాఫీ చేస్తామని రైతులను నిలువునా ముంచారన్నారు. పొదుపు మహిళల రుణాలు మాఫీ చేయకుండా రూ.10వేలు ఇస్తామని మోసం చేశారన్నారు. నిరుద్యోగ భృతి రూ.2వేలు ఇస్తామని యువతకు భరోసా కల్పించి..తీరా ఎన్నికలు సమీపిస్తుండటంతో వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తామని ప్రకటించడం విడ్డూరమన్నారు. దళితులకు ఏఒక్కరికైనా రెండెకరాల భూమి ఇచ్చారా అని ప్రశ్నించారు. ఎక్కడా చూసినా ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు. హబ్‌లు ఏమయ్యాయి? సీఎంగా చంద్రబాబు నాయుడు మొదటి సారిగా జిల్లాకు వచ్చిన సమయంలో ప్రతి ప్రాంతాన్ని హబ్‌లుగా మార్చుతామని హామీ ఇచ్చారని.. ఇంత వరకు అతీగతీ లేదని చక్రపాణి రెడ్డి అన్నారు. బీజెపీతో నాలుగేళ్లు సంసారం చేసి, ప్రత్యేక హోదాతో ఏమి రాదని ప్రత్యేక ప్యాకేజి తీసుకొన్నారన్నారు. దేశంలో ఏరాష్ట్రానికి ఇవ్వనంతగా కేంద్రం ఏపీకి ఇచ్చిందని అసెంబ్లీలో తీర్మానం చేసి స్వీట్లు పంచుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు బీజేపీతో తెగతెంపులు చేసుకొని దొంగ నాటకాలు ఆడుతున్నారన్నారు. రైతుల పరిస్థితి దయనీయం.. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందని చక్రపాణి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు పోలవరం ప్రాజెక్ట్‌పై ఉన్న దృష్టి రైతాంగాన్ని ఆదుకోవడంలో లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని మట్టికరిపించి వైఎస్సార్సీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధపడుతున్నారన్నారు. తాను 91 రోజులకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే 15 రోజుల్లోనే ఆమోదించారని, వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరానని, వారి చేత రాజీనామా చేయించే దమ్ము సీఎంకు లేదా అని ప్రశ్నించారు. నాలుగేళ్లగా బీజెపీని ఏమాత్రం ప్రశ్నించకుండా.. ఇప్పడు ధర్మపోరాటం పేరుతో అబద్ధాలను కప్పిపుచ్చుకునేందుకు జిల్లాల పర్యటన చేస్తున్నారన్నారు. మండలాధ్యక్షుడు అంబటి గుర్విరెడ్డి, నాయకులు కేపీ రామ్మోహన్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కర్రా హర్షవర్ధన్‌రెడ్డి, అంబటి రామ్మోహన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నంద్యాల్లో రౌడీ రాజ్యం
-
నంద్యాల్లోరౌడీ రాజ్యం
-
రౌడీ రాజ్యం
నంద్యాల్లో మాజీ ఎమ్మెల్సీ చక్రపాణి రెడ్డిపై హత్యాయత్నం - నడిరోడ్డుపై వేట కొడవలితో అధికార పార్టీ నేత అభిరుచి మధు వీరంగం - రెండు రౌండ్లు కాల్పులు జరిపిన గన్‌మ్యాన్ - కనీసం అదుపులోకి తీసుకోని పోలీసులు నంద్యాల పట్టణంలోని సూరజ్ గ్రాండ్ హోటల్ ప్రాంతం.. గురువారం మిట్ట మధ్యాహ్నం ఒంటి గంట కావస్తోంది.. దారికి అడ్డంగా ఓ వాహనం ఉండటంతో మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి వాహనం అక్కడికొచ్చి ఆగింది.. వాహనాన్ని పక్కకు తీయండని డ్రైవర్ చెబుతుండగానే ఎదుటి వైపు నుంచి రాళ్ల దాడి మొదలైంది.. టీడీపీ నేత మధు చేత్తో వేట కత్తి పట్టుకుని ఊగిపోతూ ఆవేశంతో రంకెలేస్తున్నాడు.. అంతలోనే ఆయన పక్కనున్న మరో వ్యక్తి చేతిలో రివాల్వర్ ప్రత్యక్షమైంది.. చేయి పైకెత్తి టపా..టపా.. మని కాల్పులు జరిపాడు.. ఫ్యాక్షన్ సినిమాలోని సీన్‌ను తలదన్నేలా సాగిన ఈ సన్నివేశం సాక్షాత్తూ పోలీసుల కళ్లెదుటే జరిగింది.. స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో ఓటమి భయంతో అధికార పార్టీ అరాచకాలకు తెరలేపింది. పోలింగ్ రోజున పోలింగ్ శాతం పెరిగే కొద్దీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతూ నియోజకవర్గం మొత్తం కలియదిరుగుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. తాజాగా పోలింగ్ ముగిసిన మరుసటి రోజే గురువారం మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డిపై అధికార పార్టీకి చెందిన అభిరుచి మధు ఏకంగా వేట కొడవలితో హత్యాయత్నం చేశాడు. మధు గన్‌మ్యాన్ శిల్పాను లక్ష్యంగా చేసుకుని రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. నంద్యాల నడిరోడ్డులో కార్లతో అటకాయించి మరీ.. చక్రపాణి రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన వైనం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయిం ది. ఈ తతంగమంతా పోలీసుల కళ్లెదుటే జరిగింది. అయినప్పటికీ బాధితులు శిల్పా చక్రపాణి రెడ్డి, ఆయన అనుచరులపైనే తొలు త కేసు నమోదు చేశారు. పోలీసుల కళ్లెదుటే టీడీపీ నేత మధు వేట కత్తి పట్టుకుని వీరంగం సృష్టిస్తుంటే కనీసం దానిని లాక్కొని అదుపు లోకి తీసుకునే ప్రయత్నం చేయలేదు. రౌడీషీటర్‌గా ఉన్న అధికార పార్టీకి చెందిన అభిరుచి మధును పోలీసులు కనీసం వారించే ప్రయత్నం జరగకపోవడం.. నిందితులను వెనకేసు కొస్తూ మంత్రి అఖిలప్రియ మాట్లాడటాన్ని గమనిస్తే అంతా స్కెచ్ ప్రకారమే వ్యవహారం నడిచిందన్న అనుమానాలు బలపడుతున్నా యి. మధుపై రౌడీషీట్ ఎత్తివేయడంతో పాటు ఉప ఎన్నికకు ముందు హడావుడిగా గన్‌మ్యాన్ ను కేటాయించడం చర్చనీయాంశమైంది. అంటే ఉప ఎన్నికకు ముందు అధికార పార్టీ.. ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులకు వ్యూహాత్మ కంగా రంగం సిద్ధం చేసిందని తెలుస్తోంది. జరిగింది ఇదీ... నంద్యాలలోని సలీంనగర్లో నివాసం ఉంటు న్న వైఎస్సార్సీపీ మైనార్టీ నాయకుడు చింపిం గ్ బాషా బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డితో పాటు నలుగురు కౌన్సిలర్లు పరామర్శించి తిరిగి వస్తున్నారు. అధికార పార్టీకి కేంద్రంగా ఉన్న సూరజ్ హోటల్ సెంటర్లో టీడీపీ నేత అభిరుచి మధుతో పాటు మరికొందరు కార్యకర్తలు తమ కార్లను అడ్డంగా నిలిపి ఉంచి చక్రపాణి రెడ్డి కారును అటకాయించారు. దీంతో సైడ్ ఇవ్వమని చక్రపాణిరెడ్డి కారు డ్రైవర్ పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ ఏ మాత్రం వారు స్పందించలేదు. అనంతరం నానాబూతులు తిడుతూ చక్రపాణి రెడ్డి కారువైపు అభిరుచి మధుతో పాటు మరికొందరు రాళ్లు రువ్వుతూ వేట కొడవళ్లతో దూసుకొచ్చారు. దీంతో చక్రపాణిరెడ్డి వెంట ఉన్న వారు ప్రతిఘటించేందుకు యత్నించా రు. ఈ సందర్భంగా మధు గన్‌మ్యాన్ సోమ భూపాల్ (నం.1681) రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ తతంగం జరుగుతుండగా అక్కడ పోలీసులు కూడా ఉన్నారు. అయితే వారు మధు చేతిలోని వేట కొడవలిని లాక్కునేందుకు కానీ, అతన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం కానీ చేయలేదు. కొంత సేపటి తర్వాత చక్రపాణిని ఇంటికి పంపించా రు. అభిరుచి మధును బుజ్జగిస్తూ అతన్ని కూడా కారు ఎక్కించి మరీ సాగనం పారు. కనీసం ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా అతన్ని అదుపులోకి తీసుకునే యత్నం కూడా చేయకపోవడం విమర్శలకు తావిచ్చింది. బాధితులపైనే కేసులు ఏదైనా సంఘటన జరిగితే మొదటగా ఎవరైతే బాధితులో వారి పక్షాన పోలీసులు నిలవాలి. అయితే ఇక్కడ మాత్రం పోలీసు యంత్రాంగం మొత్తం అధికార పార్టీకి కొమ్ముకాసే విధంగానే వ్యవహరించిందన్న అభిప్రాయం వ్యక్తమవు తోంది. నడిరోడ్డుపై వేట కొడవలి పట్టుకుని వీరంగం సృష్టించడంతో పాటు గీత గీసి మరీ సవాల్ విసిరిన మధును కనీసం ముందస్తు జాగ్రత్తలో భాగంగా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయలేదు. పైగా ఒకడుగు ముం దుకు వేసి మధు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చక్రపాణి రెడ్డితో పాటు ఇతర నేతలపై కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ నేత జగదీశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధుతో పాటు మున్నా అలియాస్ ఖాదర్, షేక్ చిన్ను, వేణు, గన్‌మ్యాన్ సోమభూపాల్‌పై కేసు నమోదు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొంటున్నారు. రౌడీషీట్ ఎత్తేసి ప్రోత్సహించారు.. వాస్తవానికి టీడీపీ నేత అభిరుచి మధు వ్యవహారంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా అనేక మందిపై నడిరోడ్డుపై దాడి చేయడంతో పాటు పలు బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆయనపై 2009లో నంద్యాల టూటౌన్ పోలీసు స్టేషన్లో రౌడీ షీటు నమోదైంది. వరుస దాడులతో జిల్లా ఉపాధ్యక్షుడి పదవి కూడా పోయింది. అయితే తిరిగి బాబు, లోకేశ్‌లను కలసి పదవి సంపా దించుకున్నారు. 2014లో చంద్రబాబు వచ్చాక రౌడీషీటర్‌ను కూడా ఎత్తివేశారు. ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేసేందుకు వీలుగా ఏకంగా గన్మ్యాన్లను ప్రభు త్వం కేటాయించింది. జరిగిన సంఘట నలను విశ్లేషిస్తే పక్కా స్కెచ్ ప్రకారమే వ్యవ హారం నడిచిందని అర్థమవుతోంది. రౌడీషీట ర్గా రికార్డు ఉన్న మధుకు గన్మ్యాన్లను (1+1)ఎలా కేటాయిస్తారన్న ప్రశ్న ఇప్పుడు ఎదురవుతోంది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో నే భద్రత కల్పించారన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో మారణాయుధాలతో నడిరోడ్డుపై ఎలా తిరిగారన్న ప్రశ్న ఎదురవుతోంది. -
ఎమ్మెల్సీగా శిల్పా చక్రపాణిరెడ్డి ప్రమాణ స్వీకారం
కర్నూలు: కర్నూలు స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన శిల్పా చక్రపాణిరెడ్డి సోమవారం శాసనమండలి చైర్మన్ చక్రపాణి యాదవ్ సమక్షంలో ఆయన చాంబర్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఏడాది మార్చి 17న జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున చక్రపాణిరెడ్డి పోటీ చేసి 62 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్, మాజీ మంత్రి కె.ఇ.ప్రభాకర్, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ మల్లికార్జునరెడ్డి తదితరులు హాజరై శిల్పాకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.