
సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ నేత శిల్పాచక్రపాణిరెడ్డి
ఆత్మకూరు (కర్నూలు): సీఎం చంద్రబాబు నాయుడు పాలన అవినీతిమయంగా మారిందని వైఎస్‌ఆర్‌సీపీ శ్రీశైలం నియోజకవర్గ ఇన్‌చార్జ్, నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శిల్పాచక్రపాణిరెడ్డి విమర్శించారు. ఆత్మకూరులోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని , పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందన్నారు. వందల కోట్ల రూపాయల అవినీతి జరుగు తోందన్నారు. దీనిపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. లేకపోతే టీడీపీ మధ్య బీజేపీ మిత్రుత్వం కొనసాగు తోందని భావించాల్సి వస్తుందన్నారు. విభజన హామీల అమల్లో కేంద్ర, రాష్ట్ర పభుత్వాలు ప్రజలను మోసం చేశాయన్నారు.
ప్రత్యేక హోదాను అటకెక్కించాయని మండిపడ్డారు. ఏపీ అభివృద్ధికి హోదా ఎంతో అవసరమని..అందు కోసం వైఎస్‌ఆర్‌సీపీ నాలుగేళ్ల నుంచి అలుపెరగని పోరాటం కొనసాగిస్తోందన్నారు. ప్రత్యేక హోదా సజీవంగా ఉందంటే అది వైఎస్‌ఆర్‌సీపీ వల్లేనన్నారు. ఇప్పటికైనా టీడీపీ ఎంపీలు పదవులకు రాజీనామా చేసి తమపార్టీ ఎంపీలతో కలిసి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. హోదా విషయంలో కేంద్ర తీరుకు నిరసనగా నేడు చేపట్టే రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు.
దోపిడీదారుడెవరో ప్రజలకు తెలుసు
నీరు చెట్టు కార్యక్రమం కింద ఎలాంటి పనులు చేపట్టకుండా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డారాజశేఖరరెడ్డి కోట్లరూపాయలను వెనకేసుకున్నారని శిల్పాచక్రపాణిరెడ్డి అన్నారు. అలాంటి వ్యక్తికి తనపై ఆరోపణలు చే సే అర్హత లేదన్నారు. దోపిడీదారుడెవరో ప్రజలకు తెలుసన్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను సొంత డబ్బు ఖర్చు చేసి నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తున్నానని చెప్పారు. ఆరునెలల క్రితం మార్కెట్ యార్డ్‌లో రైతులు విక్రయించిన పంట ఉత్పత్తులకు ప్రభుత్వం ఇంతవరకు డబ్బులు చెల్లించలేదని, ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే దీనిపై పోరాడాలన్నారు.
సిద్ధాపురం ఎత్తిపోతల పథకం నుంచి పిల్ల కాల్వలు లేకపోవడంతో సాగు నీరు అందడం లేదు. ఈ సమస్య ఎమ్మెల్యేకు పట్టదా అని ప్రశ్నించారు. తాను సిద్దాపురం ఎత్తిపోతల కోసం ఎంతో కృషి చేశానని చెప్పారు. ముస్లింలు ఎప్పటికీ వైఎస్సార్‌సీపీ వెంటే ఉంటారని , దివంగత వైఎస్‌ఆర్ వారికి చేసిన మేలు మరచిపోరన్నారు.కార్యక్రమంలో పార్టీ నాయకులు చిట్యాల వెంకటరెడ్డి, కుందూరు శివారెడ్డి, రాజమోహన్‌రెడ్డి, స్వామి, రాజగోపాల్, తిమోతి, లాలూ, బాలన్న , బీవీఆర్ , అంజాద్ అలీ, హనుమంతరెడ్డి, పోట్ల నాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు.