Chandy
-
నేను వెళ్లిపోతా.. ఓ జడ్జి ఆవేదన
తిరువనంతపురం: సోలార్ స్కాంపై కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఆవేదన చెందిన విజిలెన్స్ కోర్టు జడ్జి జస్టిస్ వాసన్ వాలంటరీ రిటైర్మెంట్ (స్వచ్ఛంద పదవీ విరమణ) వైపు మొగ్గు చూపుతున్నారు. కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సిందిగా విజిలెన్సు కోర్టు ఇచ్చిన తీర్పుపై కేరళ హైకోర్టు రెండు నెలల స్టే విధించిన కొన్ని గంటల్లోనే వాసన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రి అరయదాన్ మహ్మద్‌పై సోలార్ స్కాంలో ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విజిలెన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సస్పెండ్ చేసింది. విజిలెన్స్ కోర్టు తన అధికారాల విస్తృతి, కేసు తీరు గురించి తెలుసుకోకుండా మెకానికల్‌గా ప్రవర్తించిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలతో కలత చెందడం వల్లే జడ్జి వాసన్ వాలంటరీ రిటైర్మెంట్ అంటున్నారని తెలుస్తోంది. ప్రైవేటు సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతించేందుకు సీఎం ఊమెన్ చాందీకి తాము భారీ మొత్తంలో లంచాలు ఇచ్చినట్లు సరితా నాయర్ తదితరులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ కేసులోనే సీఎంపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని కేరళ విజిలెన్స్ కోర్టు ఆదేశించింది. -
మా నర్సులను వెనక్కి రప్పించండి..
తిరువనంతపురం: యెమెన్‌లో చిక్కుకుపోయిన కేరళ నర్సులు, పారా మెడికల్ సిబ్బందిని తిరిగి స్వదేశానికి రప్పించాలని కేరళ సీఎం ఊమెన్ చాందీ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. దీనిపై తక్షణమే స్పందించి , తగిన చర్యలు చేపట్టాలని కోరుతూ ప్రధానికి ఆయనో లేఖ రాశారు. తమను వెనక్కి రప్పించాలని కోరుతూ అనేకమంది నర్సులు భయంతో వణికిపోతూ ఫోన్లు చేస్తున్నారనీ... కన్నీళ్లతో వేడుకుంటున్నారని చాందీ చెప్పారు. సానా మిలిటరీ ఆసుపత్రి యాజమాన్యం సహా కొన్ని ఆసుపత్రులు తమ దేశాన్ని వీడిచి వెళ్లేందుకు నర్సులకు, ఇతర సిబ్బందికి అనుమతి నిరాకరిస్తున్నారని తెలిపారు. వారి పాస్‌పోర్టులను తమ దగ్గర పెట్టుకొని నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. దీనికి సంబంధించి భారత రాయబార కార్యాలయం ఆయా ఆసుపత్రులతో మాట్లాడి, తగిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కోరారు. కేరళ ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 600 మంది కేరళీయులు సానా విమానాశ్రయంలో ఎదురుతెన్నులు చూస్తున్నట్టు సమాచారం. యెమన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడి భారతీయులను ఇండియాకు రప్పించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. వీలైన అన్ని మార్గాల ద్వారా స్వదేశానికి వచ్చేయాలని కూడా భారత ప్రభుత్వం అక్కడున్న మనవారికి అడ్వైజరీ ఇచ్చింది. -
‘చండీ’గా ప్రియమణి విజృంభణ
‘‘ఇప్పటివరకూ ప్రియమణి చేసిన సినిమాలు ఒకెత్తు. ఈ సినిమా మరొక ఎత్తు. ‘చండీ’గా ప్రియమణి విజృంభించి నటించింది. తన డైలాగ్ డెలివరీ అద్భుతంగా కుదిరింది’’ అని సముద్ర తెలిపారు. ఆయన దర్శకత్వంలో ప్రియమణి టైటిల్ రోల్ పోషించిన చిత్రం ‘చండీ’. కృష్ణంరాజు, శరత్‌కుమార్ కీలకపాత్రలు పోషించారు. జి.జగన్నాథనాయుడు సమర్పణలో డా.జి.శ్రీనుబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ప్లాటినమ్ డిస్క్ వేడుకలో కృష్ణంరాజు మాట్లాడుతూ -‘‘సంగీత దర్శకుడు ఎస్.ఆర్.శంకర్‌కి తొలి చిత్రమైనా మంచి పాటలిచ్చారు. అల్లూరి సీతారామరాజు పాటకు మంచి స్పందన వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. దర్శకుడు అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించారని ప్రియమణి పేర్కొన్నారు. సినిమా మొత్తం పూర్తయిందని, త్వరలోనే విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా రంగనాథ్, రెజీనా, ఎస్సార్ శంకర్, జీవీ, బేబి ఆని తదితరులు మాట్లాడారు.