చిల్లర అడిగితే చితకబాదారు.. ఆపై దారుణం!
హైదరాబాద్: హయత్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. కేవలం నాలుగు రూపాయల చిల్లర విషయమై ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. హయత్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి... వర్డ్ అండ్ డీడ్ స్కూలు సమీపంలోని పాన్‌షాపులో రాజేష్ అనే వ్యక్తి సిగరెట్ కొన్నాడు. సిగరెట్ కోసం కొంత డబ్బు ఇవ్వగా షాపతను వినియోగదారుడు రాజేష్‌కు నాలుగు రూపాయలు తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. దీంతో షాపు ఓనర్‌తో రాజేష్‌కు వివాదం తలెత్తింది.
షాపు యాజమని, అతని స్నేహితులు కలిసి రాజేష్‌పై దాడిచేసి అతడిని విపరీతంగా కొట్టారు. దెబ్బలు తాళలేక రాజేష్ రోడ్డుమీదకు పరుగుతీశాడు. రోడ్డు దాటే ప్రయత్నం చేయగా వేగంగా వచ్చిన ఓ లారీ అతడిని ఢీకొట్టింది. దీంతో రాజేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు సీసీఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసుకుని, ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.