మొక్కలు పెంచకపోతే అనర్హత వేటే
* సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ముఖ్యమంత్రి హెచ్చరిక
* ఏపీకి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే
* ‘చేనేతల రుణ విముక్తి’ సభలో చంద్రబాబు వెల్లడి
సాక్షి ప్రతినిధి, అనంతపురం/అనంతపురం టౌన్: ‘‘అందరూ మొక్కలు నాటండి. మొక్కలు నాటని సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలపై అనర్హత వేటు వేస్తాం. మొక్కలు నాటే విద్యార్థులకు అదనంగా మార్కులు వేస్తాం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఇస్తాం. రెవెన్యూ శాఖలో 50 రకాల సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు.
వీటిని కుదిస్తాం. కొందరు అధికారులు తప్పులు చేస్తున్నారు. వారి కథ చూస్తా. డబ్బులు వసూలు చేసే అవినీతి అధికారులపై ప్రజలు తిరగబడాలి’’ అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆయన శనివారం అనంతపురం జిల్లా ధర్మవరంలో ‘చేనేతకు చంద్రన్న చేయూత’ పేరుతో సభ నిర్వహించారు. తర్వాత శింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రంలో రైతులతో సమావేశమయ్యారు. ఈ రెండు కార్యక్రమాల్లోబాబు ప్రసంగించారు.
చేనేత కార్మికులను ఆదుకుంటాం
విభజన చట్టంలోని హామీలన్నింటినీ కేంద్రం నెరవేర్చాలన్నారు. ఏపీకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఎన్డీయే ప్రభుత్వంపై, బీజేపీపై ఉందన్నారు. చేనేత కార్మికుల కోసం రూ.110 కోట్లు విడుదల చేసి, రుణమాఫీ చేశామన్నారు. వెంకటగిరిలో ఐహెచ్టీ ఉంది. కొత్త కోర్సుల కోసం రూ.9.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడికి, రాబడికి మధ్య తేడా ఎక్కువగా ఉంటుండడం వల్లే రైతులత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు.
దీన్ని సరిదిద్దేందుకు తమ ప్రభుత్వం రైతులను ఆదుకునే చర్యలు చేపడుతుందని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో 100 ఎకరాల్లో పారిశ్రామికవాడ ఏర్పాటు చేస్తామన్నారు.పరిశ్రమలు పెట్టుకోవాలనుకుంటే పరికరాలు అందిస్తామనీ వారు తయారు చేసిన వస్తువులను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిసామనీ బాబు చెప్పారు. హెచ్చరించారు. కాగా, ‘సాక్షి’ పత్రికపై సీఎం చంద్రబాబు మరోసారి అక్కసు వెలగక్కారు. ధర్మవరం సభలో ఆయన మాట్లాడుతూ... సాక్షి పత్రిక కు శిక్ష వేయాలని వ్యాఖ్యానించారు. ఆ పత్రికను చదవొద్దని సూచించారు.