గుడికి వెడుతున్న దళిత వృద్ధుడి సజీవదహనం
లక్నో: ఉత్తరప్రదేశ్లో గుడికి వెళుతున్న ఓ దళిత వృద్ధుడిపై దాడిచేసి సజీవదహనం చేసిన ఘటన కలకలం రేపింది. జలౌన్ జిల్లా హమీర్పూర్ సమీపంలో బిల్గాం గ్రామంలో మైదాని బాబా గుడిలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో చిమ్మ (90) అనే వృద్ధుడు సజీవ దహనమయ్యాడు.
చిమ్మ.. తన భార్య, కొడుకుతో కలిసి స్థానిక మైదాని బాబా గుడికి వెళ్లేందుకు బయలుదేరాడు. గుళ్లోకి వెళ్లడానికి వీల్లేదంటూ సంజయ్ తివారీ అనే వ్యక్తి అడ్డుకున్నాడు. అయితే సంజయ్ మాటలను లెక్కచేయని చిమ్మా ముందుకు కదిలాడు. దీంతో రెచ్చిపోయిన సంజయ్ గొడ్డలితో నరికి, ఆపై నిప్పంటించాడు. మిగతా భక్తులందరూ చూస్తుండగానే ఈ దారుణం జరిగింది. కొంతమంది భక్తులు సంజయ్ తివారిని బంధించి పోలీసులకు సమాచారం అందించారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మద్యం మత్తులో ఉన్న తివారీ చిమ్మాతో పాటు ఇంకా చాలామంది భక్తులను గుడిలోకి వెళ్లొద్దంటూ వారించాడు. అయితే వారందరూ తిరస్కరించారు. దీంతో అప్పటికే కోపంతో ఉన్న తివారీ.. చివరకు వృద్ధుడు కూడా తనను లెక్కచేయలేదని అతడిపై గొడ్డలితో దాడిచేశాడు. అతని భార్య సహాయం కేకలు పెట్టింది. అయినా సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీన్ని అవకాశంగా తీసుకున్న తివారీ.. మరింత రెచ్చిపోయి, చిమ్మపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసి సంజయ్ తివారీని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.