china lunar orbiter
-
చంద్రుని ఆవలి వైపుకు చాంగే6
బీజింగ్: చంద్రుని ఆవలివైపు చైనా చాంగే6 ల్యాండర్ విజయవంతంగా దిగింది. అక్కడి మట్టిని సేకరించి తిరిగి భూమికి చేరుకోనుంది. చంద్రుని దక్షిణ ధృవ అయిట్కెన్(ఎస్పీఏ) బేసిన్ వద్ద బీజింగ్ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6.23 గంటలకు విజయవంతంగా అది దిగిందని చైనా నేషనల్ స్పేస్ అడ్మిని్రస్టేషన్(సీఎన్ఎస్ఏ) ప్రకటించింది. చాంగే6లో ఒక ఆర్బిటార్, ఒక రిటర్నర్, ఒక ల్యాండర్, ఒక అసెండర్ ఉన్నాయి. మే మూడో తేదీన చాంగే6ను చైనా ప్రయోగకేంద్రం నుంచి ప్రయోగించారు. అది తొలుత భూస్థిర కక్ష్యలో, తర్వాత చంద్ర కక్ష్యలో తిరిగింది. చాంగే6లో ఆర్బిటార్–రిటర్నర్, ల్యాండర్–అసెండర్ జతలు ఉన్నాయి. ఆర్బిటార్–రిటర్నర్ జత నుంచి ల్యాండర్–అసెండర్ జత మే 30వ తేదీన విడిపోయింది. ఆర్బిటార్–రిటర్నర్ జత చంద్రుని కక్ష్యలోనే తిరుగుతోంది. కీలకమైన ల్యాండింగ్ ల్యాండర్–అసెండర్ జత చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్ అవడమే ఈ మొత్తం మిషన్‌లో అత్యంత కీలకమైన దశ. దిగేటపుడు మార్గమధ్యంలో ఏమైనా అవాంతరాలు ఉంటే వాటిని గుర్తించేందుకు స్వయంచాలిత అవాంతరాల నిరోధక వ్యవస్థ, కాంతి కెమెరాను వినియోగించారు. వీటి సాయంతో సురక్షితమైన ల్యాండింగ్ ప్రదేశాన్ని ఎంచుకుని ల్యాండర్–అసెండర్ అక్కడే దిగిందని చైనా అధికారి జిన్హువా వార్తాసంస్థ పేర్కొంది. ఎస్పీఏ బేసిన్‌లోని అపోలో బేసిన్లో ఇది దిగింది. భూమి వైపు కంటే ఆవలి వైపు చంద్రుడి ఉపరితలం కాస్తంత గట్టిగా ఉందని సీఏఎస్‌సీ అంతరిక్ష నిపుణుడు హుయాంగ్ హావో చెప్పారు. అక్కడ దిగిన ల్యాండర్ 14 గంటల్లోపు రెండు రకాలుగా మట్టిని సేకరిస్తుంది. డ్రిల్లింగ్ చేసి కొంత, రోబోటిక్ చేయితో మరికొంత ఇలా మొత్తంగా 2 కేజీల మట్టిని సేకరిస్తుంది. ల్యాండర్ చంద్రునికి ఆవలివైపు ఉపరితలంపై ఉన్న నేపథ్యంలో భూమి నుంచి నేరుగా దానిని కమాండ్ ఇవ్వడం అసాధ్యం. అందుకే కమ్యూనికేషన్‌కు వారధిగా ఇప్పటికే చైనా క్వికియానో–2 రిలే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఆ శాటిలైట్ ద్వారా చాంగే–6 ల్యాండర్‌కు ఆదేశాలు ఇవ్వొచ్చు.మళ్లీ భూమి మీదకు సేకరించిన మట్టిని ల్యాండర్ అసెండర్‌లోకి చేరుస్తుంది. అసెండర్ రాకెట్లా నింగిలోకి దూసుకెళ్లి ఆర్బిటార్–రిటర్నర్ జతతో అనుసంధానమవుతుంది. రిటర్నర్ మాడ్యూల్‌లోకి మట్టిని మార్చాక రిటర్నర్ అక్కడి నుంచి భూమి దిశగా బయల్దేరుతుంది. అంతా అనుకున్నది అనుకున్నట్లు సవ్యంగా జరిగితే జూన్ 25వ తేదీన రిటర్నర్ భూమి మీదకు చేరుకుంటుంది. చంద్రుని ఆవలివైపు మట్టిని తీసుకొచ్చిన దేశంగా చైనా చరిత్రలో నిలిచిపోనుంది. -
చంద్రుడి కక్ష్యను చేరి.. తిరిగి భూమికి!
విజయవంతంగా తిరిగొచ్చిన చైనా ఆర్బిటర్ అమెరికా, రష్యాల తర్వాత చైనాదే ఈ ఘనత బీజింగ్: చందమామ కక్ష్యను చేరి చుట్టూ తిరిగిన చైనా వ్యోమనౌక వారం రోజుల తర్వాత విజయవంతంగా భూమికి తిరిగి వచ్చింది. చైనాలోని సిజివాంగ్ బ్యానర్ ప్రాంతంలో శనివారం ఉదయం చైనా లూనార్ ఆర్బిటర్ విజయవంతంగా దిగినట్లు ఆ దేశ వార్తాసంస్థ ‘జినువా’ వెల్లడించింది. బీజింగ్‌కు 500 కి.మీ. దూరంలో నేలపై దిగిన ఆర్బిటర్‌ను అన్వేషక బృందాలు స్వాధీన చేసుకున్నాయంది. దీంతో చంద్రుడి కక్ష్యకు వ్యోమనౌకను పంపడంతో పాటు దానిని తిరిగి భూమికి క్షేమంగా తీసుకువచ్చిన మూడో దేశంగా చైనా అరుదైన రికార్డు సృష్టించింది. అమెరికా, రష్యాల తర్వాత ఈ ఘనత సాధించిన దేశంగా నిలిచింది. ఇలాంటి ప్రయోగాన్ని చివరిసారిగా 1970లలో రష్యా, అమెరికాలు విజయవంతంగా చేపట్టాయి. చంద్రుడిపైకి తొలిదశలో ఉపగ్రహాలను, రెండోదశలో ల్యాండర్, రోవర్లను పంపిన చైనా మూడోదశ ప్రయోగంలో భాగంగా చంద్రుడి కక్ష్యను చేరి తిరిగి భూమికి వచ్చే వ్యోమనౌకను ప్రయోగించింది. ‘జియావోఫెయ్’ అని ముద్దుపేరుతో పిలుచుకుంటున్న ఈ వ్యోమనౌకను అక్టోబర్ 24న లాంగ్‌మార్చ్ రాకెట్ ద్వారా నింగికి ప్రయోగించారు. 8.40 లక్షల కి.మీ ప్రయాణించిన ఈ ఆర్బిటర్ భూమి, చంద్రుడిని ఫొటోలు తీసి పంపింది. ఇది విజయవంతంగా తిరిగి రావడంతో రీ-ఎంట్రీ టెక్నాలజీని నిరూపించుకున్నామని, 2017లో చంద్రుడిపై దిగి, అక్కడి మట్టిని భూమికి తీసుకొచ్చే ‘చాంగ్-5’ వ్యోమనౌక ప్రయోగానికి మార్గం సుగమం అయింద ని చైనా అధికారులు తెలిపారు. కాగా, 2003లో తొలిసారిగా రోదసిలోకి వ్యోమగామిని పంపిన చైనా, 2008లో తన వ్యోమగామిని రోదసిలో నడిపించి అమెరికా, రష్యాల తర్వాత అరుదైన ఘనత సాధించింది. 2022 నాటికి సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకూ చైనా ప్రయత్నిస్తోంది.