చంద్రుడి కక్ష్యను చేరి.. తిరిగి భూమికి!
విజయవంతంగా తిరిగొచ్చిన చైనా ఆర్బిటర్
అమెరికా, రష్యాల తర్వాత చైనాదే ఈ ఘనత
బీజింగ్: చందమామ కక్ష్యను చేరి చుట్టూ తిరిగిన చైనా వ్యోమనౌక వారం రోజుల తర్వాత విజయవంతంగా భూమికి తిరిగి వచ్చింది. చైనాలోని సిజివాంగ్ బ్యానర్ ప్రాంతంలో శనివారం ఉదయం చైనా లూనార్ ఆర్బిటర్ విజయవంతంగా దిగినట్లు ఆ దేశ వార్తాసంస్థ ‘జినువా’ వెల్లడించింది. బీజింగ్‌కు 500 కి.మీ. దూరంలో నేలపై దిగిన ఆర్బిటర్‌ను అన్వేషక బృందాలు స్వాధీన చేసుకున్నాయంది. దీంతో చంద్రుడి కక్ష్యకు వ్యోమనౌకను పంపడంతో పాటు దానిని తిరిగి భూమికి క్షేమంగా తీసుకువచ్చిన మూడో దేశంగా చైనా అరుదైన రికార్డు సృష్టించింది. అమెరికా, రష్యాల తర్వాత ఈ ఘనత సాధించిన దేశంగా నిలిచింది. ఇలాంటి ప్రయోగాన్ని చివరిసారిగా 1970లలో రష్యా, అమెరికాలు విజయవంతంగా చేపట్టాయి. చంద్రుడిపైకి తొలిదశలో ఉపగ్రహాలను, రెండోదశలో ల్యాండర్, రోవర్‌లను పంపిన చైనా మూడోదశ ప్రయోగంలో భాగంగా చంద్రుడి కక్ష్యను చేరి తిరిగి భూమికి వచ్చే వ్యోమనౌకను ప్రయోగించింది.
‘జియావోఫెయ్’ అని ముద్దుపేరుతో పిలుచుకుంటున్న ఈ వ్యోమనౌకను అక్టోబర్ 24న లాంగ్‌మార్చ్ రాకెట్ ద్వారా నింగికి ప్రయోగించారు. 8.40 లక్షల కి.మీ ప్రయాణించిన ఈ ఆర్బిటర్ భూమి, చంద్రుడిని ఫొటోలు తీసి పంపింది. ఇది విజయవంతంగా తిరిగి రావడంతో రీ-ఎంట్రీ టెక్నాలజీని నిరూపించుకున్నామని, 2017లో చంద్రుడిపై దిగి, అక్కడి మట్టిని భూమికి తీసుకొచ్చే ‘చాంగ్-5’ వ్యోమనౌక ప్రయోగానికి మార్గం సుగమం అయింద ని చైనా అధికారులు తెలిపారు. కాగా, 2003లో తొలిసారిగా రోదసిలోకి వ్యోమగామిని పంపిన చైనా, 2008లో తన వ్యోమగామిని రోదసిలో నడిపించి అమెరికా, రష్యాల తర్వాత అరుదైన ఘనత సాధించింది. 2022 నాటికి సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకూ చైనా ప్రయత్నిస్తోంది.