chintapally
-
ఏపీ టూ మహారాష్ట్ర వయా తెలంగాణ: వీళ్ల తెలివి మామూలుగా లేదుగా..
ఖమ్మం రూరల్: మండల పరిధిలోని కోదాడ క్రాస్ రోడ్డులో పోలీసులు రూ.25 లక్షల విలువైన 1.7 క్వింటాళ్ల గంజాయిని బుధవారం పట్టుకున్నారు. ఖమ్మం రూరల్ సీఐ పి.సత్యనారాయణరెడ్డి, ఎస్సై శంకర్రావు కథనం ప్రకారం.. విశాఖపట్నం జిల్లా చోడవరం గ్రామానికి చెందిన కోళ్లు తరలించే వ్యాన్ డ్రైవర్ బొబ్బిలి సాయి, ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన మరో డ్రైవర్ గుంజి వెంకట్రావు, విశాఖపట్నానికి చెందిన తేలు నాగా వెంకట సత్యనారాయణ, మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన విశాల్ అంకుష్ కలిసి గంజాయి తరలిస్తున్నారు. ఏపీలోని విశాఖ జిల్లా చింతపల్లి గ్రామం నుంచి సత్తుపల్లి, ఖమ్మం మీదుగా మహారాష్ట్రలోని షోలాపూర్‌కు కోళ్లు తరలించే రెండు వ్యాన్లలో తీసుకెళ్తున్నారు. కోదాడ క్రాస్‌రోడ్డు వద్ద వాహన తనిఖీ చేస్తున్న పోలీసులకు కోళ్లు తరలించే వ్యాన్లలో ఉన్న వారిపై అనుమానం వచ్చింది. తనిఖీ చేయగా, వ్యాన్‌పైన మామూలుగానే ఉన్నా కింద ప్రత్యేక అరలు ఏర్పాటుచేసి ప్యాక్ చేసిన గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈమేరకు గంజాయిని స్వాధీనం చేసుకుని, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. -
పత్తి లారీ బోల్తా: డ్రైవర్ కు గాయాలు
చింతపల్లి (నల్లగొండ) : అధిక లోడుతో వెళ్తున్న పత్తి లారీ అదుపుతప్పి బ్రిడ్జి పై నుంచి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండల శివారులో ఆదివారం చోటుచేసుకుంది. హోమంతాలపల్లి గ్రామం నుంచి చింతపల్లికి పత్తి లోడుతో వెళ్తున్న లారీ చింతపల్లి శివారులోని మూలమలుపు వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా కొట్టి బ్రిడ్జి నుంచి కింద పడింది. దీంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. -
అత్తారింట్లో పండుగ చేసుకున్న అల్లు అర్జున్
-
అత్తారింట్లో పండుగ చేసుకున్న అల్లు అర్జున్
నల్లగొండ: ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీ బిజీగా ఉండే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..దసరా పండుగకు బ్రేక్ తీసుకున్నాడు. బన్నీ ఈసారి దసరా పండుగను ఈ సారి తన అత్తగారి ఊళ్లో జరుపుకున్నాడు. స్నేహారెడ్డి అమ్మమ్మ స్వగ్రామం నల్లొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లికి కుటుంబ సమేతంగా వెళ్లాడు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు ..అల్లు అర్జున్ను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల విడుదల అయిన రుద్రమదేవి సినిమాలోని గోన గన్నారెడ్డి పాత్ర డైలాగ్స్ చెప్పాలంటూ గ్రామస్తులు కోరగా... డైలాగ్స్ వినిపించి వారి ముచ్చట తీర్చాడు. అలాగే పలువురు బన్నీతో సెల్పీలు, ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా వారిని అదుపు చేయటానికి స్నేహారెడ్డి కుటుంబసభ్యులు కష్టపడాల్సి వచ్చింది. -
వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ట
చింతపల్లి (నల్లగొండ) : నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని ఘడియగౌరారం గ్రామంలో భక్తాంజనేయస్వామి దేవస్థానంలో కీర్తి ధ్వజస్తంభ ప్రతిష్టాపన, ముత్యాలమ్మ, ఈదమ్మ విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు జపములు, హోమములు, పూజలు, తర్వాత 10 గంటల 20 నిమిషాలకు ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ట, 10 గంటల 49 నిమిషాలకు ఈదమ్మ విగ్రహ ప్రతిష్ట, అలాగే 11 గంటల 15 నిమిషాలకు కీర్తి ధ్వజస్తంభ ప్రతిష్ట, బలిహారం, కుంభ నివేదనం, పూర్ణాహుతి కార్యక్రమాలను వేదపండితుల మంత్రోచ్ఛారణ మధ్య మేళతాళాలతో అమ్మవార్ల విగ్రహాలను గ్రామ పురవీధులలో వైభవంగా ఊరేగిస్తూ ప్రతిష్టాపన కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామస్తులతోపాటు చుట్టుపక్కల గ్రామాలవారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు ఈదమ్మ, ముత్యాలమ్మ దేవతలకు గ్రామ ప్రజలు డప్పు చప్పుళ్ళతో బోనాలు సమర్పించారు. భక్తాంజనేయస్వామి దేవస్థానంలో జిల్లాపరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్‌తో పాటు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యేలు ఉజ్జిని నారాయణరావు, ఉజ్జిని యాదగిరిరావు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.