chintha mohan
-
కేసుల నుంచి తప్పించుకోడానికే బాబు ఢిల్లీ టూర్!
ఏలూరు (ఆర్ఆర్పేట): చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్లపై ఎన్ని కేసులున్నాయో తనకు తెలుసునని, ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి, తిరిగి అధికారంలోకి రావడానికి మాత్రమే చంద్రబాబు ఢిల్లీ ప్రయాణమవుతున్నాడని కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ పేర్కొన్నారు. శనివారం ఏలూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రాష్ట్రంలో ఏమి అభివృద్ధి చేశాడో చెప్పాలన్నారు. టీడీపీ నాయకుడు పట్టాభి సీఎం జగన్ను అటువంటి పదజాలంతో తిట్టడం ముమ్మాటికీ తప్పేనన్నారు. చంద్రబాబు దాన్ని సమర్థించడం సరికాదన్నారు. బాబు ఎందుకు దీక్షలు చేస్తున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. రాష్ట్రానికి కాపు సామాజికవర్గానికి చెందిన నాయకుడిని ముఖ్యమంత్రిని చేయడం కోసం తాను ప్రయత్నిస్తానని చింతా మోహన్ స్పష్టం చేశారు. -
రాజధాని మారే అవకాశం
మాజీ ఎంపీ చింతామోహన్ వెంకటగిరి(నెల్లూరు) : రాష్ట్రంలో ప్రభుత్వం మారితే ప్రస్తుతం అమరావతిలో ఉన్న రాజధాని తిరుపతి – వెంకటగిరి ప్రాంతంలో ఏర్పాటయ్యే అవకాశాలున్నాయని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ తెలిపారు. ఆదివారం ఆయన వెంకటగిరిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం రాజధాని నిర్మిస్తున్న ప్రాంతం భారీ నిర్మాణాలకు అనుకూలంకాదన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు రాజధాని కర్నూలు నుంచి హైదరాబాద్ మారిన విషయాన్ని గుర్తుచేశారు. జనసేన అధినేత పవన్కళ్యాణ్ రాజకీయంగా పురిటిబిడ్డేనన్నారు. దుగరాజపట్నం పోర్టు కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టని బీజేపీ పట్టించుకోవడంలేదని విమర్శించారు. తిరుపతికి అనుసంధానంగా నిర్మించిన జాతీయ రహదారులు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసినవేనన్నారు. ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ కీలకమైందన్నారు. దేశంలో న్యాయవ్యవస్థలో సమూల మార్పులు రావాల్సిన అవసరముందన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పంజాం ధనంజయ, డేగా మునిచంద్ర, సీహెచ్ హనుమంతరావు, సుధ తదితరులు పాల్గొన్నారు. -
'తిరుపతిలో చంద్రబాబు రిగ్గింగ్ చేయించారు'
తిరుపతి: తిరుపతి శాసనసభ ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఆదేశాలు జారీ చేసి రిగ్గింగ్ చేయించారని మాజీ ఎంపీ చింతామోహన్ ఆరోపించారు. అధికారులు, పోలీసులు దగ్గరుండి రిగ్గింగ్ చేయించారని చెప్పారు. పోలీసులు ఖాకీ చొక్కాలకు బదులు పసుపు చొక్కాలు వేసుకోవడం మంచిదని వ్యాఖ్యానించారు. కొన్ని మీడియా సంస్థలు టీడీపీ కొమ్ముకాస్తున్నాయని చింతామోహన్ విమర్శించారు. తిరుపతి ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, టీడీపీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణ చెలరేగింది. బైరాగిపట్టెడలో టీడీపీ, కాంగ్రెస్ శ్రేణులు పోటాపోటీగా నిరసనకు దిగారు. టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీదేవి ఆరోపించారు. సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయన భార్య ఎన్నికల్లో పోటీచేస్తుండం, టీడీపీ అభ్యర్థన మేరకు వైఎస్ఆర్ సీపీ పోటీకి దూరంగా ఉంది.