
'తిరుపతిలో చంద్రబాబు రిగ్గింగ్ చేయించారు'
తిరుపతి: తిరుపతి శాసనసభ ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఆదేశాలు జారీ చేసి రిగ్గింగ్ చేయించారని మాజీ ఎంపీ చింతామోహన్ ఆరోపించారు. అధికారులు, పోలీసులు దగ్గరుండి రిగ్గింగ్ చేయించారని చెప్పారు. పోలీసులు ఖాకీ చొక్కాలకు బదులు పసుపు చొక్కాలు వేసుకోవడం మంచిదని వ్యాఖ్యానించారు.
కొన్ని మీడియా సంస్థలు టీడీపీ కొమ్ముకాస్తున్నాయని చింతామోహన్ విమర్శించారు. తిరుపతి ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, టీడీపీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణ చెలరేగింది.
బైరాగిపట్టెడలో టీడీపీ, కాంగ్రెస్ శ్రేణులు పోటాపోటీగా నిరసనకు దిగారు. టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీదేవి ఆరోపించారు. సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయన భార్య ఎన్నికల్లో పోటీచేస్తుండం, టీడీపీ అభ్యర్థన మేరకు వైఎస్ఆర్ సీపీ పోటీకి దూరంగా ఉంది.