మొక్కులు చెల్లించిన చెవిరెడ్డి
చంద్రగిరి : సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మొక్కులు చెల్లించారు. తన కుటుంబ సభ్యులతో కలసి ఆయన శ్రీవారిమెట్టు మార్గం మీదుగా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన శ్రీవారిమెట్టు వద్ద, ప్రత్యేక పూజల అనంతరం కుటుంబ సభ్యులతో భక్తిప్రపత్తులతో మెట్టుమెట్టుకూ పసుపు, కుంకుమతో పాటు కర్పూరం పెడుతూ తిరుమలకు వెళ్లారు. తలనీలాలు సమర్పించిన అనంతరం శనివారం తెల్లవారుజామున తిరుమలేశుని దర్శించుకున్నారు.
ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వైఎస్సార్సీపీ ఆదరించి, అత్యధిక మెజార్టీతో గెలిపించారన్నారు. జగన్మోహన్రెడ్డి పాలనలో దివంగత నేత రాజన్న రాజ్యాన్ని మళ్లీ చవిచూస్తారని ధీమాగా చెప్పారు. రానున్న ఐదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం ప్రజలకు అన్ని సంక్షేమ కార్యక్రమాలను దిగ్విజయంగా అందించాలని ఆ దేవుడిని ప్రార్థించానని, జగనన్న పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. అంతకముందు వైఎస్సార్సీపీ నాయకులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో యారాశి చంద్రశేఖర్‌రెడ్డి, మస్తాన్, ఓబుల్ రెడ్డి, దొడ్లకరుణాకర్ రెడ్డి, శ్రీహరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.