తిక్క కుదిరింది
పిల్లల కథ
ఒక అడవిలో నివసిస్తున్న ఏనుగుల గుంపులో ఓ ఏనుగు బాగా పొగరుగా ఉండేది. అది ఆ అడవిలో స్వేచ్ఛగా తిరిగే జంతువుల్ని ఉత్తపుణ్యానికి హింసిస్తూ ఉండేది. చివరకు చీమలను కూడా వదిలిపెట్టేది కాదు. ఆహారం కోసం అవి బారులు తీరి వెళుతూంటే, తొండంతో నీటిని తెచ్చి వాటిపై విరజిమ్మేది. చీమలు నీటి నుంచి బయటపడ్డానికి పడుతున్న అవస్థ చూసి ఆనందించేది. నిష్కారణంగా చెట్లకొమ్మలను విరిచి పడేసేది.
అలా చేయడం తప్పని తోటి ఏనుగులు ఎన్నిసార్లు చెప్పినా పొగరుబోతు ఏనుగు తీరు మారలేదు. రాను రాను పొగరుబోతు ఏనుగు ఆగడాలు మితిమీరి పోవడంతో ఒకరోజు జంతువులన్నీ ఏకమై, తమ రాజైన సింహాన్ని కలిసి ఏనుగు పెట్టే బాధల్ని చెప్పాయి.సింహం వెంటనే వెళ్లి ఆ ఏనుగును తన వద్దకు తీసుకురమ్మని ఎలుగుకు పురమాయించింది. బలుసాకైనా తిని బతుకుతాను గాని, ఆ పొగరుబోతు ఏనుగు దగ్గరకు వెళ్లనని మొరాయించింది ఎలుగు. తర్వాత చిరుతపులి, తోడేలు, ఖడ్గమృగం, జింక వగైరా జంతువులకు చెప్పి చూసినా... ఆ ఏనుగు వద్దకెళ్లడానికి ఏ ఒక్కటీ సాహసించలేదు.
‘చాలా ఆశ్చర్యంగా ఉందే! కేవలం కబురు చెప్పడానికే భయపడిపోతున్నారేమిటి?’ అనుకుంటూ సింహం క్షణకాలం వాటన్నింటినీ పరీక్షగా చూసి, ‘‘ఇదిగో, కుందేలు బుల్లోడా! ఏనుగు వద్దకు నువ్వెళ్లు. ఎవరూ వెళ్లకపోతే సమస్య ఎలా పరిష్కారమవుతుంది?’’ అన్నది. కుందేలు లోలోపల భయపడుతూనే... ధైర్యం కూడగట్టుకొని పొగరుబోతు ఏనుగు చెంతకెళ్లి సింహం రాజుగారు రమ్మంటున్నారని చెప్పింది. ‘‘నేను రాను. కావలిస్తే ఆయనే వస్తాడు. నువ్వు ఫో!’’ అంది మహాగీరగా ఏనుగు. ఆగమేఘాల మీద వచ్చేసి, ఆ మాట సింహానికి చెప్పింది కుందేలు.
‘‘అబ్బో! చాలా పొగరుగా ఉందే. మీరంతా వెళ్లి దాన్ని మెత్తగా తన్ని తీసుకురాలేరా?’’ అంది చిరాకుపడుతూ సింహం.
బలుసాకైనా తిని బతుకుతాను గాని, ఆ పొగరుబోతు ఏనుగు దగ్గరకు వెళ్లనని మొరాయించింది ఎలుగు.
జంతువులేవీ నోరు మెదపలేదు.
‘‘మీరింత పిరికిపందలనుకోలేదు. సరే, ఇక చేసేదేముంది? నేనే వెళతాను’’ అని సింహం బయలుదేరబోతూంటే చీమలరాణి ముందుకొచ్చి, ‘‘మృగరాజా! ఆ ఏనుగు తమ చెంతకొచ్చేలా నేను చేస్తాను’’ అంది ధైర్యంగా. ఆ మాటలకు జంతువులన్నీ పెద్ద పెట్టున నవ్వాయి.
‘‘మీరెవ్వరూ చెయ్యలేని పని అది చేస్తూంటే సిగ్గుపడ్డం మాని నవ్వుతున్నారా’’ అంటూ వాటిని తిట్టి, చీమలరాణిని వెళ్లమని ప్రోత్సహించింది సింహం. తక్షణం చీమలను వెంటబెట్టుకొని ఆ ఏనుగు ఉండే తావుకు చేరుకొంది చీమలరాణి.
కొంతసేపటి తర్వాత పొగరుబోతు ఏనుగు, సింహం సమక్షానికి వచ్చింది. ఏనుగు హఠాత్తుగా రావడం చూసి, అది ఎవరిమీద విరుచుకుపడుతుందోనని అక్కడున్న జంతువులన్నీ భయపడ్డాయి. అయితే ఆ ఏనుగు ఏదో బాధతో సతమతమవుతూ సింహాన్ని సమీపించి, ‘‘రాజుగారూ! నేను ఆదమరచి నిద్రపోతుంటే చీమలు నా తొండంలో దూరి, అదే పనిగా కుడుతున్నాయి. అమ్మో! ఈ మంట భరించలేకపోతున్నాను. నన్నిలా బాధించడం వీటికి తగునా?’’ అని మొరపెట్టుకుంది.
సింహం మందహాసం చేస్తూ, ‘‘ఏనుగు తమ్ముడూ! బాధ అనేదెలా ఉంటుందో నీకిప్పుడు తెలిసిందా?’’ అంది.
‘‘తెలిసింది మృగరాజా!’’ అంటూ కంటనీరు పెట్టుకుంది ఏనుగు.
‘‘ఇకముందు ఏ జంతువునూ హింసించకుండా, వృక్షాలను ధ్వంసం చెయ్యకుండా ఉంటావా?’’ అడిగింది సింహం.
‘‘ఉంటాను రాజా. వనదేవత సాక్షిగా ఇంకెప్పుడూ బాధపెట్టను’’ అంది ఏనుగు.
ఏనుగు అలా వాగ్దానం చెయ్యగానే చీమలరాణి, ఆమె సైన్యం దాని తొండంలో నుండి బయటకొచ్చేశాయి.
‘‘చూశారా! చీమలు చిన్నవే కావచ్చు, అవి కలిసికట్టుగా ఎంత శక్తిని ప్రయోగిస్తాయో ఇప్పుడు మీకు తెలిసిందిగా!’’ అంది సింహం. జంతువులన్నీ బుద్ధిగా తలలూపాయి. తెలివిగా పొగరుబోతు ఏనుగు పొగరణచినందుకు చీమలరాణిని, ఆమె సైన్యాన్ని ఎంతగానో మెచ్చుకుంది సింహం.
- చోడిశెట్టి శ్రీనివాసరావు