Christmas Eve
-
క్రిస్మస్ నేపథ్యంతో అలరించిన హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు ఇవే..
Top 10 Movies That Include Christmas Theme: భారతదేశం అన్ని పండుగలను ఒకే విధంగా జరుపుకుంటుంది. ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగానే క్రిస్మస్ను కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఇండియన్స్. ఈ పండుగలను సినిమాల్లో చూపించడం, వాటి గురించి ప్రస్తావన తేవడం సహజం. పండుగల ప్రత్యేకతలను తెలిపే సినిమాలు చాలానే వచ్చాయి. ఇలా క్రిస్మస్ పండుగ నేపథ్యంలో సాగే సినిమాలు సైతం వెండితెరపై అలరించాయి. ఇందులో రొమాంటిక్ ప్రేమ కథల నుంచి హృదయాన్ని కదిలించే ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్, హాస్యభరితమైన వరకు చిత్రాలు ఉన్నాయి. ఈ ఏడాది క్రిస్మస్ పండుగ సందర్భంగా బాలీవుడ్, హాలీవుడ్లో క్రిస్మస్తో అలరించిన టాప్ 10 సినిమాలపై ఓ లుక్కేద్దామా ! 1. ఏక్ మే ఔర్ ఏక్ తూ 2. అంజానా అంజాని 3. 2 స్టేట్స్ 4. దిల్వాలే 5. లాస్ట్ క్రిస్మస్ 6. షాందార్ 7. ది హాలీడే 8. శాంటా క్లాజ్ 9. ది పోలార్ ఎక్స్‌ప్రెస్ 10. హోమ్ ఎలోన్ -
నేను ప్రేమించిన యేసు.. మహాత్మ గాంధీ సందేశం
క్రైస్తవం అనేది ‘మతం’ కాదు, ‘జీవన విధానం’ అని. ఏ వ్యక్తి అయితే అవధులు లేని ప్రేమని చూపిస్తూ ప్రతీకారం, ఈర్ష్య, అసూయ, ద్వేషం లాంటివి మరచిపోతాడో అతడే నిజమైన క్రైస్తవుడు. లండన్‌లో 1931 డిసెంబర్లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన గాంధీజీ తన బృందంతో సముద్రమార్గంలో ఇండియాకి తిరిగి వస్తూ ‘క్రిస్మస్’ రోజున చేసిన ప్రసంగమిది. ప్రతిరోజూ ఆయన ఉదయం చేసే ప్రార్థనలో పాల్గొనే కొందరు ఆరోజు ఆయన్ని జీసస్ గురించి మాట్లాడమని కోరడంతో... గాంధీజీ మాట్లాడారు. అదే రోజు ఓడలో వున్న అసోసియేట్ ప్రెస్ ఆఫ్ అమెరికా ప్రతినిధి మిస్టర్ మిల్స్ ఆ ప్రసంగ పాఠం తనకు చెప్పమని అడిగి రాసుకున్నారు. అదే వారం అది వ్యాసంగా ‘యంగ్ ఇండియా’, ‘హరిజన్’ పత్రికల్లో వచ్చింది. ‘గాంధీస్ క్రిస్టమస్ సెర్మన్’ శీర్షికతో 1932, జనవరి7న ‘ది గార్డియన్’ పత్రికలో వచ్చింది. మొదటిసారి దీని తెలుగు అనువాదం ‘సాక్షి’ పాఠకుల కోసం.. ఒక హైందవ మతస్థుడనైన నేను యేసుక్రీస్తు జీవితం గురించి, ఆయన బోధల గురించి ఎలా తెలుసుకున్నానో మీరు కచ్చితంగా తెలుసుకోవాలి అని ఆశిస్తున్నాను. దాదాపుగా నలభై ఐదేళ్ళ కిందటే నాకు ‘పరిశుద్ధగ్రంథం’తో పరిచయం అయింది. హోటల్లో పరిచయమైన నా స్నేహితుడి ప్రోత్సాహం వల్లే ఇదంతా జరిగింది. పరిశుద్ధగ్రంథాన్ని మొదటిసారి చదివినప్పుడు నాకు పాత నిబంధన గ్రంథం మీద అంతగా ఆసక్తి కలగలేదు. కానీ, ఎప్పుడైతే నేను కొత్త నిబంధన చదవడం మొదలుపెట్టానో నాకు క్రీస్తు బోధల మీద ఒక అవగాహన ఏర్పడింది. ముఖ్యంగా ‘కొండ మీద ప్రసంగం’ నన్ను చాలా ఆకట్టుకుంది. ఆ ప్రసంగం చిన్నతనంలో నేను నేర్చుకున్న విలువలని గుర్తు చేసింది. అది నా జీవన విధానానికి చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. వేరే మతస్థుడనైన నాకు ఆ ప్రసంగం అంత ప్రాముఖ్యమైనది కాకపోవచ్చును. కానీ ఇది చెడుశక్తులతో సహా ఎవరికీ హాని కలిగించనిది. దీన్ని చదివాక నేను తెలుసుకున్నదేమిటంటే, యేసుక్రీస్తు ఒక కొత్త ధర్మాన్ని బోధించడానికి వచ్చారని. నిజానికి ఆయన తాను కొత్త ధర్మాన్ని ఇవ్వడానికి రాలేదు అని చెప్పినప్పటికీ, పాతనిబంధనలోని మోషే ధర్మశాస్త్రాన్ని ఆచరణ సాధ్యమైనరీతిలో సరళతరం చేయడానికి ఆయన వచ్చారు. కంటికి కన్ను, పంటికి పన్ను చట్టం కాకుండా, ఒక అంగీ అడిగితే రెండు అంగీలు ఇవ్వడం, ఒక మైలు తోడు రమ్మంటే, రెండు మైళ్ళు వెళ్ళమనే సహృదయతను ఆయన బోధించారు. ఈ మంచి లక్షణాలను ప్రతి ఒక్కరూ బాల్యంలోనే నేర్చుకోవడం చాలా అవసరమని నేను భావించాను. చిన్నతనంలో క్రైస్తవం అన్నా, క్రైస్తవులు అన్నా నాకొక దురభిప్రాయం ఉండేది. వారికి ఒక చేతిలో మద్యం, మరో చేతిలో మాంసం ఉంటాయని అనుకునేవాడిని. ఎప్పుడైతే నేను ‘కొండ మీద ప్రసంగం’ చదివానో, వారిపట్ల నాకున్న ఈ చెడు అభిప్రాయం పటాపంచలయ్యింది. ఆ తరువాత, దేవునికి నిజంగా భయపడే నా క్రైస్తవ స్నేహితులు కొందరు క్రైస్తవంపై నాకున్న సదభిప్రాయాన్ని మరింత పెంచారు. క్రైస్తవ జీవితం చాలావరకు ‘కొండ మీద ప్రసంగం’లో ఇమిడి ఉంది. ఒక వ్యక్తి నిజమైన క్రైస్తవుడిగా జీవించాలని కోరుకున్నట్లయితే అతను యేసుక్రీస్తు ‘కొండ మీద చేసిన ప్రసంగం’లోని అంశాలను నిజాయితీగా ఆచరిస్తే చాలు. నా జీవితంలో నేనెన్నడూ యేసుక్రీస్తు ఉనికిని గురించి సందేహించలేదు. ఒకవేళ ఎవరైనా ఆయన అసలు ఇక్కడ జన్మించలేదని నిరూపించినా, నేను ఆ విషయానికి అంత ప్రాముఖ్యత ఇవ్వను. నాలుగు సువార్తలు రాసిన వ్యక్తులు, వారికి క్రీస్తుతో ఉన్న సాన్నిహిత్యం, వారు ఆయనను చూసిన విధానాన్ని బట్టి ఆయనని వారు వివరించారు. కానీ, నాకు మాత్రం ‘కొండ మీద ప్రసంగం’ మాత్రమే ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేసింది. ఆ ప్రసంగాన్ని చదివి, అర్థం చేసుకున్నాక– నేను తెలుసుకున్నదేమిటంటే క్రైస్తవం అనేది ‘మతం’ కాదు, ‘జీవన విధానం’ అని. ఏ వ్యక్తి అయితే అవధులు లేని ప్రేమను చూపిస్తూ ప్రతీకారం, ఈర‡్ష్య, అసూయ, ద్వేషం లాంటివి మరచిపోతాడో అతడే నిజమైన క్రైస్తవుడు. అలాంటి వ్యక్తి జీవితంలో అన్ని ఆటంకాల్ని అధిగమిస్తాడు. ఇటువంటి జీవన విధానం అవలంబించడం ఒకింత కష్టంగానూ, ఎదుటివారికి అర్థం కానట్లుగానూ ఉంటుంది. దీన్ని కేవలం మనసుతో మాత్రమే చూడగలం. విషాదమేమిటంటే ఈ విధమైన క్రైస్తవం చాలామందికి అర్థం కాకుండా ఉంది. దేవుని దయ వలన పరిశుద్ధగ్రంథం కొందరు విధ్వంసకారుల నుంచి భద్రపరచబడింది. బ్రిటిష్ వారు, ఫారిన్ బైబిల్ సొసైటీ వారు పరిశుద్ధ గ్రంథాన్ని అనేక భాషల్లో తర్జుమా చేశారు. ఆ తర్జుమాలు సమయం వచ్చినప్పుడు, వాటి ఉద్దేశాన్ని నెరవేర్చాయి. యేసుక్రీస్తు బోధించిన ఈ అంశాలను మనం ఆచరించకపోతే, రెండువేల సంవత్సరాల పాటు ఉన్న ఈ సజీవ నమ్మకానికి అర్థం లేనట్లే. మనం పాడుకునే ‘పరలోకమందున్న దేవునికి సమస్త మహిమ, భూమి మీద ఆయన భక్తులకి సమాధానం కలుగును గాక...’ అనే పాటలో ఉన్నట్లుగా దేవునికి మహిమ, మనకి సమాధానం రెండూ కలగవు. మనలోని ఆత్మీయ తృష్ణ చల్లారేంత వరకూ, క్రీస్తు మన హృదయంలో జన్మించేంత వరకూ మనం ఆయన కోసం ఎదురు చూడాలి. ఎప్పుడైతే ఆయన మన హృదయాల్లో జన్మించడం వలన నిజమైన శాంతి నెలకొంటుందో, అప్పుడు మనకిక వేరే సాక్ష్యాలు అవసరం లేదు. అది మన జీవితాల ద్వారా ప్రతిబింబిస్తుంది. కేవలం వ్యక్తిగతంగానే కాకుండా సామాజికంగా కూడా ఈ మార్పు కనపడుతుంది. నా మటుకు ఈ పాటకు అసలైన అర్థం ఇదేనని తోస్తుంది. క్రీస్తు మనలో జన్మించడం అన్నది కేవలం ఒకరోజుకే పరిమితమయ్యేది కాదు. మన జీవితాల్లో ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ లోకంలోని మతాల గురించి నేను ఆలోచించినప్పుడల్లా, ఈ భూమి మీదకి దిగివచ్చిన మహోన్నతమైన గురువుల గురించి ఆలోచిస్తాను. వారి పుట్టుకకి కారణం– నేను మొదట చెప్పినట్టుగా, వారు ఈ భూమి మీద ఒక సత్యాన్ని ప్రచురించడానికి అవతరించారు. దానికి ఏ గుర్తు, సాక్ష్యం అవసరం లేదు. ఆ సత్యాన్ని వాళ్ళు జీవించిన జీవన విధానం ద్వారా లోకానికి తెలియజేశారు. ఈ సత్యం ఎన్నటికీ ఆగిపోదు, నాశనం చెందదు. క్రీస్తు తమలో జన్మించనంత వరకూ ఎవరైనా ‘క్రిస్మస్ శుభాకాంక్షలు’ తెలియజేస్తే, అది అర్థం లేనిదే అవుతుంది. ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్నవారి శాంతిని తాను ఆకాంక్షించకుండా, తనకు శాంతి కలగాలని కోరుకోవడం దురాశ అవుతుంది. ‘యూక్లిడ్ సూత్రం’ ప్రకారం ఎవరైతే తన చుట్టూ ఉన్న వారి శాంతిని కోరుకుంటారో, వాళ్ళ జీవితాల్లో కూడా శాంతి నెలకొంటుంది. ఇందుకు భిన్నంగా ఉండేవారి జీవితాల్లో, చిన్నచిన్న కలహాలు కూడా పెద్ద సమస్యలుగా మారతాయి. కేవలం, యేసుక్రీస్తు ఈ చారిత్రాత్మక జన్మని మాత్రమే మనం స్మరించుకుంటూ, ఆయన సిలువ త్యాగాన్ని విస్మరిస్తే, ఈ పర్వదినానికి విలువ లేనట్లే! అప్పుడు మన విశ్వాసం మృతమైన విశ్వాసం అవుతుంది.. తెలుగు అనువాదం: సి. షఫేల ఫ్రాన్కిన్సన్ -
హ్యాపీ క్రిస్మస్
మెదక్ జోన్: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో మంగళవారం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో చర్చ్ ప్రాంగణం కిటకిటలాడింది. బిషప్ ఏసీ సాలమాన్‌రాజ్ ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆ«రాధనలు ప్రారంభమయ్యాయి. అనంతరం బిషప్ దైవ సందేశం వినిపించారు. మానవుల పాపాలను కడిగేసేందుకు పరలోకం నుంచి భూలోకానికి వచ్చిన రారాజు ఏసయ్య అన్నారు. అనంతరం ప్రెస్బిటరీ ఇన్చార్జి ఆండ్రోస్ ప్రేమ్ సుకుమార్ ప్రత్యేక ప్రార్థనలు చేసి విశ్వమంతా నిండి ఉన్న దేవుడు ఏసయ్య అని కొనియాడారు. భక్తులు ఇబ్బందులు పడకుండా దాదాపు 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రార్థనల్లో పాల్గొన్న ప్రముఖులు... స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఉపేందర్‌రెడ్డిలు చర్చ్ ప్రాంగణంలో కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కులమతాలకు అతీతంగా మెదక్ సీఎస్ఐ చర్చ్‌లో ప్రార్థనలు జరుగుతున్నాయని చెప్పారు. ఏసుక్రీస్తు బోధించిన పరలోక మార్గం సూత్రాలను ప్రతిఒక్కరూ ఆచరించాలన్నారు. భారతీ సిమెంట్ ఆధ్వర్యంలో పాల వితరణ: క్రిస్మస్ పండుగ సందర్భంగా మెదక్ సీఎస్ఐ చర్చ్ ప్రాంగణంలో భారతీ సిమెంట్ ఆధ్వర్యంలో పాల వితరణ చేశారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు సుమారు 10 వేల లీటర్ల పాల వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీ సిమెంట్ ప్రతినిధులు మల్లారెడ్డి, కొండల్‌రెడ్డి, సతీష్‌కుమార్, గంగాధర్, శ్రీరాములు, శ్రీనివాస్‌రెడ్డి భారతీ సిమెంట్ మెదక్ డీలర్ లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
క్రిస్మస్ రోజు భారీగా గుండెపోట్లు!
లండన్: క్రిస్మస్ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం మధ్య రోగులు, వృద్ధులు భారీ సంఖ్య లో గుండెపోటుకు గురవుతారని తాజా అధ్యయనం లో తేలింది. స్వీడన్‌లోని ఉప్సలా వర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు. తొలుత పరిశోధకులు స్వీడన్లో 1998 నుంచి 2013 వరకు అన్ని సెలవు దినాలు, పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉన్న రోజు ల్లో నమోదైన గుండెపోటు వివరాలను సేకరించారు. ఈ 16 ఏళ్లలో 2,83,014 మంది గుండెపోటుకు గురి కాగా, ఇందులో 15% మంది క్రిస్మస్ నాడే గుండె పోటుకు గురైనట్లు గుర్తించారు. తరువాతి స్థానంలో వేసవి రోజుల్లో 12% మందికి గుండెపోటు వచ్చింది. న్యూ ఇయర్ రోజు, సోమవారపు ఉదయాలు కూడా ముప్పు తీవ్ర స్థాయిలోనే ఉందని తేల్చారు. క్రిస్మస్ సాయంత్రం ఈ ముప్పు 37% అధికంగా ఉంటుందన్నారు. క్రిస్మస్ రోజు అందరిలో భావో ద్వేగపూరిత ఒత్తిడి ఉండటమే గుండెపోటుకు కారణమవుతున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు. ఈ వివరాలు బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
హెచ్చరిక : భారీ నరమేధానికి కుట్ర!
వాషింగ్టన్ : భారీ నరమేధానికి ఐసిస్ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నుతున్నట్లు అమెరికా రణ శాఖ వివిధ దేశాలకు సమాచారం అందజేసింది. ముఖ్యంగా యూరప్ దేశాలకు ప్రధాన హెచ్చరికలు జారీ చేస్తూ.. అక్కడ ఉన్న తమ దేశ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తెలియజేసింది. క్రిస్మస్, కొత్త సవత్సర వేడుకలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఉగ్రదాడుల హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. బ్రిటన్, స్పెయిన్, స్వీడన్, రష్యా, ఫిన్ లాండ్ దేశాలతోపాటు పవిత్ర నగరంగా భావించే వాటికన్ సిటీ కూడా ఆ జాబితాలో ఉన్నట్లు తెలిపింది. దీనికితోడు ఐసిస్ మీడియా వాఫా విడుదల చేసిన ఓ కొత్త పోస్టర్ మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. మత గురువు పొప్ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు. క్రిస్మస్ బ్లడ్ సో వెయిట్... పేరిట విడుదల చేసిన పోస్టర్లో కారులో పక్కనే ఓ తుపాకీతో ఉగ్రవాది దూసుకొచ్చినట్లుగా ఉంది. ఇలాంటివి చాలా కష్టతరమైన దాడులే అయినప్పటికీ.. ఇటీవల వరుసగా జరుగుతున్న ఆత్మాహుతి దాడుల నేపథ్యం పరిశీలిస్తే మాత్రం ఈ హెచ్చరికలను అంత తేలికగా తీసుకోవటానికి వీల్లేదని ఎఫ్‌బీఐ మాజీ ఏజెంట్ స్టీవ్ గోమెజ్ చెబుతున్నారు. గత ఏడాది క్రిస్మస్ పర్వదినానే జర్మనీలోని బెర్లిన్ లో దాడులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. ఇస్తాంబుల్(టర్కీ) కూడా ఓ నైట్ క్లబ్ పై కాల్పులు జరపగా... 39 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మరోసారి అలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలంటూ యూరప్‌తోపాటు పలు ఆసియా దేశాలకు(భారత్ సహా) కూడా అమెరికా ఏజెన్సీ ఎఫ్‌బీఐ హెచ్చరికలను జారీ చేసింది. -
సీఎం కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: ఏసుక్రీస్తు జన్మదినం క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవులకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. తోటి వారికి తోడ్పడటం, ఇతరులకు సేవ చేయడంలోనే మానవ జన్మ పరమార్థం దాగి ఉందని క్రీస్తు బోధించారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పరమత సహనం, మత సామరస్యం పునాదులుగా తెలంగాణ రాష్ట్రం భాసిల్లుతోందని, ఇదే సంప్రదాయాన్ని కొనసాగించాలని ప్రజలను కోరారు. -
25న పాఠశాలలకు సెలవు: కేంద్రం
న్యూఢిల్లీ: డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగ సందర్భంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవులో ఎలాంటి మార్పు ఉండబోదని మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభకు తెలిపారు. డిసెంబర్ 25ను ‘గుడ్ గవర్నెన్స్’ దినంగా పాటించాలన్న కేంద్రం ప్రకటనలతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొందని సభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే కేంద్రీయ గురుకుల విద్యాలయాలు మాత్రం పనిచేస్తాయన్నారు.గాంధీ జయంతిన విద్యా సంస్థల్లో కార్యక్రమాలు నిర్వహిస్తుండగా మాజీ ప్రధాని వాజ్‌పేయి జన్మదినమైన డిసెంబర్ 25న వేడుకలు జరుపకూడదంటే ఎలాగని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. -
వేడుకగా క్రిస్మస్ ఈవ్
శ్రీకాకుళం కల్చరల్, న్యూస్‌లైన్ :శ్రీకాకుళం పట్టణంలోని పలు క్రైస్తవ మందిరాలలో క్రిస్మస్ ఈవ్ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నబ జారులోని తెలుగు బాప్టిస్టు దేవాలయంలో క్రిస్మస్ ఈవ్ సందర్భంగా మంగళవారం సాయంత్రం కేండిల్ లైట్ సర్వీసు నిర్వహించారు. తొలుత చర్చి ఫాదర్ ఎ.జాకబ్ క్రీస్తు సందేశాన్ని అందించారు. అనంతరం చర్చి విశ్వాసులంతా కలసి కొవ్వొత్తులను వెలిగించి కేండిల్ సర్వీసు నిర్వహించారు. క్రిస్మస్ కేక్‌ను కట్ చేశారు. మహిళలకు నూతన దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో చర్చి ప్రెసిడెంట్ ఎన్.భాస్కరావు, ట్రెజరర్ బి.అప్పారావునాయుడు, కౌన్సిల్ సభ్యులు ఎల్.చిట్టిబాబు పాల్గొన్నారు. కోడిరామమూర్తి స్టేడియం వద్దగల లూథరన్ చర్చిలో, మహిళా కళాశాల రోడ్డులోని క్రైస్తవారాధన మందిరంలో క్రిస్మస్ ఈవ్ జరిగింది. తెలుగు బాప్టిస్టు చర్చి చరిత్ర 170 ఏళ్లు శ్రీకాకుళంలోని చిన్నబజారు రోడ్డులోని తెలుగు బాప్టిస్టు చర్చి జిల్లాలో ప్రధమదిగా చెబుతారు. దీన్ని 1832లో ఈస్టిండియా కంపెనీకి చెందిన మిస్టర్ బ్రట్ జేమ్స్ డాసన్ క్రీస్తు ప్రార్ధనా మందిరంగా ఏర్పాటు చేశారు. 1846 సెప్టెంబర్ 12వతేదీన తెలుగు బాప్టిస్టు చర్చిగా మార్చి ప్రారంభించారు. అప్పట్లో రూ.6 వేల వ్యయంతో దీన్ని నిర్మించారు. ఏసుక్రీస్తుపై అనేక గీతాలు రాసిన పురుషోత్తమ చౌదరి మొట్టమొదటి పాదర్‌గా ఇక్కడ పనిచేశారు. శిథిలావస్థకు చేరుకుంటున్న దశలో ఇటీవల రూ.60 లక్షల వ్యయంతో పునర్నిర్మాణం జరిగింది. ఆధునిక సౌకర్యాలతో 1500 మంది కూర్చొని ప్రార్ధనలు చేసుకునేందుకు వీలుగా పెద్ద హాలు ఇక్కడ ఉంది. ప్రస్తుత చర్చి పాదర్‌గా రెవ. ఎ.జాకబ్ వ్యవహరిస్తున్నారు. అతిపెద్ద చర్చిగా సహాయమాత ఆలయం శ్రీకాకుళంలోని ప్రభుత్వ కళాశాల రోడ్డులో ఉన్న సహాయ మాత ఆలయం ఉత్తరాంధ్రాలోనే అతిపెద్ద ప్రార్ధనా మందిరంగా పేరుపొందింది. సుమారు వంద అడుగుల పొడవుతో రెండు గోపురాలు, పూజా పీఠం వెనుక ఏసుక్రీస్తు కడతేరడం వంటి సన్నివేశాలు, ఫైబర్ గ్లాసులో అమర్పిన పాత్ర ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తోంది. సుమారు 2 వేల మందికిపైగా ఒకేసారి ప్రార్ధనలు చేసుకునే వీలుగా హాలు నిర్మాణ చేశారు. ఫాదర్ ఎ.ప్రేమానందం ఆధ్వర్యంలో ఇక్కడ ప్రార్ధనలు నిర్వహిస్తుంటారు. రెండోపోప్ నిర్మించిన సెయింట్ థామస్ చర్చి పట్టణంలోని టౌనుహాలు రోడ్డులో పునీత తోమాను దేవాలయం పేరుతో నిర్మితమైనది సెయింట్ థామస్ చర్చి. రెండో పోప్ జాన్‌పాల్ శ్రీకాకుళం వచ్చి దీన్ని నిర్మించగా... అడ్డగట్ల ఇన్నయ్య మొదటి ఫాదర్‌గా వ్యవహరించారు. 1999లో పునర్ నిర్మాణం జరిగింది. దీనిలో ఆరోగ్య మాత మందిరం ఉంది. వెయ్యిమంది ఒకేసారి ప్రార్ధనలు చేసుకోవచ్చు. ప్రస్తుతం రెవ. డాకనిక్ రెడ్డి పాదర్‌గా ఉంటూ బైబిల్ ప్రవచనాలు, ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు.