city forest
-
నగరవనం.. పర్యాటకానికి సిద్ధం
- నేటి సాయంత్రం ప్రారంభం - ప్రముఖుల హాజరు కల్లూరు (రూరల్) : నగరం, పరిసరా గ్రామాల ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు సిటీ ఫారెస్ట్ సిద్ధమైంది. నగర శివారులోని గార్గేయపురం చెరువు పక్కనే అటవీ శాఖ ఆధ్వర్యంలో రూ.1.5 కోట్ల వ్యయంతో నగర వనాన్ని అటవీ శాఖాధికారులు అభివృద్ధి చేశారు. 325 హెక్టార్లలో ప్రకృతి అందాల నడుమ వాకింగ్ ట్రాక్‌తో పాటు పగోడా షెల్టర్, యోగా సెంటర్, వాచ్‌టవర్ ఏర్పాటు చేశారు. వీటితో పాటు నక్షత్రవనం, రాశీవనం, పంచంటి, లక్ష్మీవనం, వినాయక వనం ఏర్పాటు చేసి రకరకాల పూల మొక్కలు నాటి అందంగా తీర్చిదిద్దారు. 850 అడుగుల ఎత్తులో వాచ్టర్ నిర్మించారు. దీనిపై నుంచి తుంగభద్ర, అటవీ ప్రాంతంలోని ప్రకృతి అందాలు, అలంపూర్ గ్రామాన్ని చూడొచ్చు. చిన్నారుల కోసం ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేశారు. గార్గేయపురం చెరువులో ఏపీ టూరిజం ఆధ్వర్యంలో స్పీడ్ బోటింగ్ వసతి కల్పించారు. పర్యాటకులకు కనువిందు చేసేందుకు సిద్ధమైన నగరవనాన్ని బుధవారం సాయంత్రం 5గంటలకు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, అటవీశాఖమంత్రి సిద్ధారాఘవరావు ప్రారంభించనున్నారు. శాసన మండలి చైర్మన్ ఎ.చక్రపాణి యాదవ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు, టూరిజం శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, రాజ్యసభ సభ్యులు టీ.జీ.వెంకటేష్, పార్లమెంట్ సభ్యులు బుట్టారేణుక, ఎస్పీవై రెడ్డి పాల్గొంటారు. ఇదేరోజు ఉదయం ఆత్మకూరులోని బైర్లూటి కాటేజీని ప్రారంభిస్తారు. -
అడవులను అభివృద్ధి చేయాలి
కర్నూలు(అగ్రికల్చర్): అడవులను అభివృద్ధి చేస్తేనే మానవాళి మనుగడ సాధ్యమవుతుందని శాసనమండలి చైర్మన్ చక్రపాణి యాదవ్ అన్నారు. శుక్రవారం 66వ వన మహోత్సవంలో భాగంగా కర్నూలు సమీపంలోని గార్గేయపురం ప్రాంతంలో సిటీ ఫారెస్ట్ ఏర్పాటుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలు నాటి సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. చెట్లు విచ్చలవిడిగా నరకడం, ప్రకృతిని దుర్వినియోగం చేయడం వల్ల వాతావరణ సమతుల్యం దెబ్బతింటుందన్నారు. కర్నూలు శివారులో 325 హెక్టార్లలో సిటీ ఫారెస్ట్‌ను అభివృద్ధి చేయడం శుభపరిణామమని తెలిపారు. గార్గేయపురం చెరువులో బోటింగ్ సౌకర్యం కల్పిస్తే పర్యాటకులను ఆకట్టుకోవచ్చన్నారు. ప్రభుత్వం నీరు-చెట్టు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని జెడ్పీ చైర్మన్ రాజశేఖర్ తెలిపారు. ఒకవైపు జలసంరక్షణ, మరోవైపు మొక్కలు నాటి పెంచడం వల్ల పర్యావరణ పరిరక్షణకు వీలు కలుగుతందన్నారు. ప్రతి విద్యార్థీ ఒక మొక్క నాటి పెంచాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలని కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ తెలిపారు. జిల్లాలో 1.40 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నాయని, వీటిని నాటి పరిరక్షించడంలో విద్యార్థులే కీలకమన్నారు. జిల్లాలో అన్ని రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి పెంచాలని కర్నూలు ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్‌రెడ్డి సూచించారు. నల్లమల అటవీ ప్రాంతం పలుచబడటంతోవర్షాలు పడటం లేదన్నారు. గార్గేయపురం చెరువును అభివృద్ధి చేయాలని కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ సూచించారు. అటవీ శాఖ కన్జర్వేటర్ మూర్తి మాట్లాడుతూ.. 1950 నుంచి ప్రతి ఏటా వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. సిటీ ఫారెస్ట్, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలిచినవారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, కర్నూలు డీఎఫ్ఓ శివప్రసాద్, సామాజిక వన విభాగం, డీఎఫ్ఓ సోమశేఖర్, కర్నూలు ఎంపీపీ రాజవర్ధన్‌రెడ్డి, గార్గేయపురం, నందనపల్లి సర్పంచులు, కౌలుట్లయ్య, సుజాతమ్మ, ఎంపీటీసీ సభ్యులు చంద్రశేఖర్‌రెడ్డి, కర్నూలు ఎంపీడీఓ జయరామిరెడ్డి పాల్గొన్నారు.