కర్నూలు(అగ్రికల్చర్): అడవులను అభివృద్ధి చేస్తేనే మానవాళి మనుగడ సాధ్యమవుతుందని శాసనమండలి చైర్మన్ చక్రపాణి యాదవ్ అన్నారు. శుక్రవారం 66వ వన మహోత్సవంలో భాగంగా కర్నూలు సమీపంలోని గార్గేయపురం ప్రాంతంలో సిటీ ఫారెస్ట్ ఏర్పాటుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలు నాటి సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. చెట్లు విచ్చలవిడిగా నరకడం, ప్రకృతిని దుర్వినియోగం చేయడం వల్ల వాతావరణ సమతుల్యం దెబ్బతింటుందన్నారు. కర్నూలు శివారులో 325 హెక్టార్లలో సిటీ ఫారెస్ట్‌ను అభివృద్ధి చేయడం శుభపరిణామమని తెలిపారు. గార్గేయపురం చెరువులో బోటింగ్ సౌకర్యం కల్పిస్తే పర్యాటకులను ఆకట్టుకోవచ్చన్నారు.
ప్రభుత్వం నీరు-చెట్టు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని జెడ్పీ చైర్మన్ రాజశేఖర్ తెలిపారు. ఒకవైపు జలసంరక్షణ, మరోవైపు మొక్కలు నాటి పెంచడం వల్ల పర్యావరణ పరిరక్షణకు వీలు కలుగుతందన్నారు. ప్రతి విద్యార్థీ ఒక మొక్క నాటి పెంచాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలని కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ తెలిపారు. జిల్లాలో 1.40 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నాయని, వీటిని నాటి పరిరక్షించడంలో విద్యార్థులే కీలకమన్నారు. జిల్లాలో అన్ని రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి పెంచాలని కర్నూలు ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్‌రెడ్డి సూచించారు. నల్లమల అటవీ ప్రాంతం పలుచబడటంతోవర్షాలు పడటం లేదన్నారు. గార్గేయపురం చెరువును అభివృద్ధి చేయాలని కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ సూచించారు. అటవీ శాఖ కన్జర్వేటర్ మూర్తి మాట్లాడుతూ.. 1950 నుంచి ప్రతి ఏటా వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
సిటీ ఫారెస్ట్, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలిచినవారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, కర్నూలు డీఎఫ్‌ఓ శివప్రసాద్, సామాజిక వన విభాగం, డీఎఫ్‌ఓ సోమశేఖర్, కర్నూలు ఎంపీపీ రాజవర్ధన్‌రెడ్డి, గార్గేయపురం, నందనపల్లి సర్పంచులు, కౌలుట్లయ్య, సుజాతమ్మ, ఎంపీటీసీ సభ్యులు చంద్రశేఖర్‌రెడ్డి, కర్నూలు ఎంపీడీఓ జయరామిరెడ్డి పాల్గొన్నారు.
అడవులను అభివృద్ధి చేయాలి
Published Sat, Jul 18 2015 3:18 AM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM
Advertisement