breaking news
CJI Gavai
-
రాకేష్ కిషోర్‌పై చర్యలు.. సుప్రీం కోర్టులో ఆసక్తికర చర్చ
తనపై షూ విసిరిన లాయర్(సస్పెండెడ్) రాకేష్ కిషోర్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ క్షమించినా.. న్యాయ వ్యవస్థ మాత్రం వదిలిపెట్టడం లేదు. ఆయనపై కోర్టు ధిక్కరణ కింద క్రిమినల్ చర్యలకు ఉపక్రమించాలని తాజాగా అటార్నీ జనరల్ అనుమతిచ్చారు. అయితే.. ఈ విషయాన్ని ఇక్కడితోనే ఆపేస్తే మంచిదంటూ సుప్రీం కోర్టు గురువారం అభిప్రాయపడింది. అటార్నీ జనరల్ ఈ చర్యకు చట్టపరమైన అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని ఇక్కడితోనే ఆపేస్తే దానంతట అదే ఆగిపోతుంది. లేకుంటే.. సోషల్ మీడియాలో చర్చలతో సాగుతుంటుంది. పైగా ఈ అంశాన్ని పదే పదే చర్చించడం ద్వారా న్యాయవ్యవస్థపై ప్రభావం పడే అవకాశం కూడా ఉంది అని జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి అభిప్రాయపడ్డారు. అక్టోబర్ 6వ తేదీన కేసు లిస్టింగ్‌లు జరుగుతున్న టైంలో.. అడ్వొకేట్ రాకేష్ కిషోర్ తన షూను సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ మీదకు విసిరారు. అయితే అది ఆయన దాకా వెళ్లకుండా కింద పడిపోయింది. దీంతో అప్రమత్తమైన తోటి లాయర్లు కిషోర్‌ను అడ్డగించి.. కోర్టు సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించారు. ఆ సమయంలో సనాతన ధర్మాన్ని అవమానిస్తే దేశం ఊరుకోదు అంటూ కిషోర్ నినాదాలు చేశాడు. అయితే ఈ ఘటనను పట్టించుకోకుండా ప్రొసీడింగ్స్ కొనసాగించాలని జస్టిస్ గవాయ్ అక్కడున్నవాళ్లకు సూచించారు. ఇలాంటివి తనని ప్రభావితం చేయబోవని ఆ టైంలో అన్నారాయన.అటుపై చీఫ్ జస్టిస్ సూచనతో ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు కాకుండా సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ చూసుకుంది. దీంతో రాకేష్‌ను మూడు గంటలపాటు ప్రశ్నించి.. షూ, ఆయన ఫైల్స్‌ను అందించి ఢిల్లీ పోలీసులు వదిలేశారు. ఈలోపు.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆయన లాయర్ లైసెన్స్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఘటనపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. అయితే తాను చేసిన పనికి పశ్చాత్తపం చెందడం లేదంటూ కిషోర్ పలు ఇంటర్వ్యూల్లో వ్యాఖ్యానించాడు. ఆ వెంటనే సుప్రీం కోర్టు బార్ అసోషియేషన్.. ఆయన్ని సుప్రీం కోర్టు ఆవరణలోకి అడుగుపెట్టనివ్వకుండా నిషేధం విధించింది. అయితే.. ఏజీ ఆదేశాల నేపథ్యంలో రాకేష్ కిషోర్‌పై క్రిమినల్ కంటెప్ట్ ఆఫ్ కోర్టుకు అనుమతించాలంటూ సుప్రీం కోర్టు బార్ అసోషియేషన్ అధ్యక్షుడు.. సీనియర్ లాయర్ వికాస్ సింగ్ ఇవాళ ద్విసభ్య ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇది రాజ్యాంగ వ్యవస్థను అవమానించే ఘటన అని, తీవ్రంగా పరిగణించి ఈ అంశాన్ని రేపు విచారణ జరపాలని బెంచ్‌ను కోరారు. అయితే.. ఈ అంశం సోషల్ మీడియాలో కొనసాగుతోందని వికాస్ సింగ్ అనగా.. కొంతమంది ఈ చర్యను సమర్థించారని, ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ గౌరవాన్ని దెబ్బ తీసే అంశమని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బెంచ్ వద్ద అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుని.. ఈ ఘటనలో సీజేఐ చాలా ఉదారంగా స్పందించారు. ఇలాంటి ఘటనలు సంస్థను ప్రభావితం చేయవని హుందాగా అన్నారు. అయితే.. ఆయన స్పందన గౌరవప్రదంగానే ఉన్నా సోషల్ మీడియాలో ఈ చర్యను సమర్థించడం ఆందోళన కలిగిస్తోందని తుషార్ మెహతా చెప్పారు. ఈ వ్యవహారంలో John Doe injunction(కోర్టు నుంచి ముందస్తుగా తీసుకునే నిషేధ ఉత్తర్వు) జారీ చేయాలని లాయర్ వికాస్ సింగ్ కోర్టును కోరారు. ఆ సమయంలో జస్టిస్ బాగ్చీ కలుగజేసుకుని.. ‘‘ఇది కొత్త వివాదాలకు దారితీయవచ్చు. కోర్టులో మన ప్రవర్తనే ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తుంది. ఓ బాధ్యతలేని పౌరుడి చర్యగా పరిగణించి సీజేఐ దీనిని పట్టించుకోలేదు. అలాంటి అంశాన్ని మళ్లీ తవ్వడం అవసరమా? అని అన్నారు. పైగా ఎన్నో ముఖ్యమైన అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని, దీనిని పైకి తేవడం సమయాన్ని వృధా చేయడమేనన్న అభిప్రాయమూ ఆయన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని మరింత పెద్దది చేయడం తన ఉద్దేశం కాదని, ఇక్కడితో నిలువరించమే తన అభిమతమని వికాస్ సింగ్ స్పష్టత ఇచ్చారు. ఆపై జస్టిస్ కాంత్ మాట్లాడుతూ.. నా సహ న్యాయమూర్తి చెబుతోంది మీరు కూడా అర్థం చేసుకున్నారు. మీరు ఈ అంశాన్ని మళ్లీ ప్రస్తావించిన వెంటనే, మీడియాలో కథనాలు కొనసాగుతాయి అని అన్నారు. ఆ టైంలో..‘దురదృష్టవశాత్తు, మనం డబ్బు సంపాదించే వ్యాపారాలుగా మారిపోయాం…" అని జస్టిస్ బాగ్చీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యతో సాలిసిటర్ జనరల్ ఏకీభవించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలు అల్గోరిథమ్స్ ఆధారంగా పనిచేస్తాయి. ప్రజలు వాటికి బానిసలుగా మారిపోయారు. ఆ బానిసత్వాన్ని ఈ ప్లాట్‌ఫారాలు డబ్బుగా మార్చుకుంటున్నాయి. మనం సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నామనుకుంటాం, కానీ నిజానికి మనమే ఆ ప్లాట్‌ఫారాల ఉత్పత్తులం’’ అని మెహతా అన్నారు. ఆ సమయంలో జస్టిస్ కాంత్ కలుగజేసుకుని మనం ఉత్పత్తులమే కాదు.. వినియోగదారులం కూడా అని అన్నారు. సోషల్ మీడియా మనుషుల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దాని అల్గోరిథమ్స్ ద్వారానే.. ద్వేషం, కోపం, కామం లాంటి భావనలకు గురవుతున్నాం. సోషల్ మీడియా మన ఈ వ్యసనాన్ని మానిటైజ్ చేస్తోంది. ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా అది మళ్లీ మానిటైజ్ అవుతుంది. కాబట్టి దీనిని సహజంగా ముగియనివ్వడమే మంచిది అని జస్టిస్ కాంత్ అన్నారు. పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనని.. అలాగే న్యాయస్థానం కూడా బార్ (న్యాయవాదుల సంఘం) ఆవేదనను అర్థం చేసుకోవాలని లాయర్ వికాస్ సింగ్ కోరారు. ‘‘బార్ (న్యాయవాదుల సంఘం) ఎప్పుడూ న్యాయ వ్యవస్థకు అండగా నిలిచింది. మీరు న్యాయాన్ని కోరే ప్రజలతో కోర్టును కలిపే వంతెన. మీ పరిస్థితిని, మీ భావోద్వేగాలను మేము అర్థం చేసుకుంటున్నాం’’ అని జస్టిస్ కాంత్ అన్నారు. ఈ అంశాన్ని శుక్రవారం విచారణకు తీసుకురావాలని వికాస్ సింగ్ మరోసారి కోరారు. అయితే.. దీపావళి తర్వాతే విచారించే అవకాశం ఉందని బెంచ్ స్పష్టం చేసింది. ఒక వారం తర్వాత ఇది ఇంకా 'సేలబుల్' అంశంగా ఉంటుందేమో చూద్దాం అని జస్టిస్ కాంత్ సున్నితంగా వ్యాఖ్యానించారు. ఈలోపు.. అల్గోరిథమ్ కోసం కొత్త అంశం వస్తుందేమో చూడాలి అని జస్టిస్ బాగ్చీ అన్నారు. దీనికి సాలిసిటర్ జనరల్ స్పందిస్తూ.. ఇలాంటి అంశాలకు 24–48 గంటల లైఫ్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి వస్తుంది అనడంతో నవ్వులతో విచారణ వాయిదా పడింది. -
సీజేఐపై దాడి ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. సీజేఐపైకి షూ విసిరిన లాయర్ రాకేష్ కిషోర్(71)ను బహిష్కరిస్తూ సుప్రీం కోర్టు బార్ అసోషియేషన్ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. ఆయన భవిష్యత్తులో కోర్టు ప్రాంగణంలోకి అడుగుపెట్టకుండా ఎంట్రీ కార్డును రద్దు చేసినట్లు గురువారం ప్రకటించింది.అక్టోబర్ 6వ తేదీన సుప్రీం కోర్టులో జరిగిన షాకింగ్ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. కోర్టు నెంబర్ 1 హాల్లో.. కేసుల మెన్షనింగ్ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి తన కాలి బూటు తీసి సీజేఐ వైపు విసిరాడు(Attack on BR Gavai). అయితే అది బెంచ్ దాకా వెళ్లకుండా కింద పడిపోయింది. తోటి లాయర్లు ఆ వ్యక్తిని నిలువరించి.. కోర్టు సిబ్బందికి అప్పగించారు. అయితే.. ఇలాంటి చర్యలు తనని ప్రభావితం చేయలేవన్న జస్టిస్ గవాయ్.. కోర్టు కలాపాలు కొనసాగించాలని ఆదేశించారు.దాడి సమయంలో సదరు లాయర్ ‘‘సనాతన ధర్మాన్ని అవమానించడాన్ని సహించం’’ అంటూ నినాదాలు చేశాడు. సీజేఐ సూచనతో అతనిపై పోలీసులకు సుప్రీం కోరటు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేయలేదు. దీంతో ఢిల్లీ పోలీసులు అతన్ని మూడు గంటలపాటు విచారించి షూతో పాటు అతని పేపర్లు ఇచ్చి వదిలేశారు. దాడికి పాల్పడిన వ్యక్తిని రాకేష్ కిషోర్‌గా నిర్ధారించారు. అయితే.. దాడికి ప్రయత్నించినందుకుగానూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాకేష్ కిషోర్(Rakesh kishore)పై చర్యలకు ఉపక్రమించింది. దేశవ్యాప్తంగా ఎలాంటి కోర్టు, ట్రిబ్యునల్, అధికార సంస్థల్లో ప్రాక్టీస్ చేయకుండా తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. జరిగిన ఘటనపై 15 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈలోపే.. సుప్రీం కోర్టు బార్ అసోషియేషన్ బహిష్కరణ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా..దాడిని సమర్థించుకున్న రాకేష్ కిషోర్.. అదంతా దైవ నిర్ణయమని అంటున్నారు. అంతేకాదు.. తన నుంచి కనీస వివరణ తీసుకోకుండానే సస్పెండ్ చేయడాన్ని కూడా తీవ్రంగా తప్పు బడుతూ పలు ఇంటర్వ్యూలు ఇవ్వసాగారు. మరోవైపు..సస్పెండెడ్ లాయర్ రాకేష్ కిషోర్‌పై బెంగళూరులో కేసు నమోదు అయ్యింది. సీజేఐపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారంటూ.. ఆల్ ఇండియా అడ్వొకేట్స్ అసోషియేషన్ అధ్యక్షుడు భక్తవత్సల ఫిర్యాదు చేశారు. దీంతో విధానసౌధ పీఎస్‌లో బుధవారం కేసు నమోదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో.. ఢిల్లీకి కేసు బదిలీ కానుంది. నోట్: ఆ బూటు విసిరింది నేను కాదు కథనంలో లాయర్ పేరును రాజేష్ కిషోర్‌గా పేర్కొన్నాం. ఎన్డీటీవీ కథనం తప్పుగా పేర్కొనడంతో అలా ఇవ్వాల్సి వచ్చింది. ఆ లాయర్ అసలు పేరు రాకేష్ కిషోర్ అని గమనించగలరు.ఇదీ చదవండి: షూ దాడి: ఇంతకీ చీఫ్ జస్టిస్ గవాయ్ ఏం వ్యాఖ్యలు చేశారంటే.. -
‘ఏదో సరదాగా అన్నంత మాత్రాన..’: సీజేఐ గవాయ్
న్యూఢిల్లీ: కోర్టుల్లో కేసుల విచారణల సమయంలో న్యాయమూర్తులు సరదాగా చేసే వ్యాఖ్యలను కూడా సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్(CJI BR Gavai) ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో తనపై దాడి జరిగిన మరుసటిరోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది(Lord Vishnu Shoe Attack Row).సర్వీస్ కండిషన్స్, వేతనాలు, వృత్తిగతమైన పురోగతిపై ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ కే వినోద్ చంద్రన్‌తో కలిసి జస్టిస్ గవాయ్ మంగళవారం విచారించారు. ఈ సందర్భంగా జస్టిస్ కే వినోద్‌తో తన గత అనుభవాన్ని జస్టిస్ గవాయ్ వివరించారు. ‘ఇటీవల ధీరజ్ మోర్ కేసు విచారణ సందర్భంగా నా సహోదరుడు (జస్టిస్ కే వినోద్‌ని ఉద్దేశించి..) ఏదో వ్యాఖ్యానించబోయారు. ఆయనను నేను ఆపాను. లేదంటే తెల్లారి సోషల్ మీడియాలో ఏమేం ప్రచారం చేసేవారో తెలియదు. అందుకే ఆయనను నాకు మాత్రమే వినపడేలా చెప్పమన్నాను’అని జస్టిస్ గవాయ్ తెలిపారు. కాగా, ఈ కేసు విచారణను ధర్మాసనం ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. కొద్దిరోజుల క్రితం ఖజురహో ఆలయంలో ధ్వంసమైన విష్ణు విగ్రహాన్ని మళ్లీ ఏర్పాటుచేసేలా ఆదేశాలివ్వాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ సరదాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. ‘‘మీరు విష్ణువు భక్తులని అంటున్నారు. కాబట్టి, మీరు వెళ్లి ప్రార్థన చేయండి. కోర్టులకు కాకుండా దైవాన్నే అడిగి చూడండి’’ అంటూ పిటిషనర్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఖజురహో ఆలయ సముదాయం యూనెస్కో (UNESCO) వారసత్వ స్థలంగా గుర్తించబడింది. కాబట్టి విగ్రహ పునఃస్థాపనకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అనుమతి అవసరమని కోర్టు అభిప్రాయపడుతూ ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ క్రమంలో.. తన వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో జస్టిస్ గవాయ్ ఆ తర్వాత వివరణ కూడా ఇచ్చారు. తనకు అన్ని మతాలు సమానమే అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. సనాతన ధర్మాన్ని కించపరిస్తే దేశం సహించబోదు అంటూ కోర్టులోనే జస్టిస్ గవాయ్‌పై ఓ న్యాయవాది బూటు విసిరేయటం సంచలనం సృష్టించింది(Attack on BR Gavai).ఇదీ చదవండి: బూటు విసిరింది ఆ దేవుడే! -
ఆ బూటు విసిరింది నేను కాదు.. : రాజేష్ కిషోర్
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై షూతో దాడికి ప్రయత్నించిన(Shoe Attack On CJI BR Gavai) అడ్వొకేట్(సస్పెండెడ్) రాజేష్ కిషోర్(71).. నేషనల్ మీడియాలో హైలైట్ అయ్యారు. ఇప్పుడు వరుస బెట్టి మీడియా చానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో తన చర్యను సమర్థించుకుంటున్న ఆయన.. ఆ పని తాను చేయలేదంటూ వింత వాదన చేస్తున్నారు. ‘‘ఆ పని నేను చేయలేదు, దేవుడే చేశాడు. భారత ప్రధాన న్యాయమూర్తి సనాతన ధర్మాన్ని అవమానించారు. ఇది భగవంతుని ఆజ్ఞ, చర్యకు ప్రతిచర్య మాత్రమే’’ అని అంటున్నారు. అదే సమయంలో తనను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సస్పెండ్ చేయడాన్ని రాజేష్ కిషోర్(Rajesh Kishore) తీవ్రంగా తప్పుబడుతున్నారు. తన వాదన వినకుండానే చర్యలు తీసుకున్నారని, ఇది హద్దులు దాటడడమేనని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాపై మండిపడుతున్నారు. సీజేఐ గవాయ్‌పై షూ విసిరిన ఘటన సోమవారం(అక్టోబర్ 6వ తేదీన) సుప్రీం కోర్టులో కలకలం రేపింది. ఓ కేసు విచారణ జరుగుతున్న సమయంలో రాజేష్కిషోర్ తన షూ తీసి సీజేఐ మీదకు విసిరారు. అయితే షూ ఆయన ముందున్న టేబుల్ మీద పడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే తోటి లాయర్లు రాజేష్‌ను పట్టుకుని.. సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు మూడు గంటలపాటు రాజేష్‌ను విచారించి వదిలేశారు. అయితే.. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ సూచన మేరకు సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ కేసు నమోదుకు ముందుకు రాలేదు. అయితే.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాత్రం రాజేష్‌పై తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. జరిగిన దానికి 15రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.ఇదీ చదవండి: సీజేఐపై దాడి ఘటన: ప్రధాని మోదీ ఏమన్నారంటే.. -
సీజేఐ గవాయ్‌పై దాడిని ఖండించిన వైఎస్ జగన్
తాడేపల్లి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై దాడిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖండించారు. సీజేఐ గవాయ్‌పై సుప్రీం కోర్టులో జరిగిన దాడి కలవరపరచే విషయం అంటూ ట్వీట్ చేశారు. ‘‘ఈ ఘటన కేవలం ఒక వ్యక్తిపై దాడి మాత్రమే కాదు,. దేశంలోని అత్యున్నత న్యాయ సంస్థ గౌరవానికే ఇది అవమానకరమైనది. మనం అందరం కలిసి రాజ్యాంగ బద్ద సంస్థల సమగ్రతను కాపాడుదాం’’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ పేర్కొన్నారు.The disgraceful attack on Hon’ble Chief Justice of India, Shri B.R. Gavai Ji, in the Supreme Court is deeply disturbing and must be unequivocally condemned. This is not only an assault on an individual but an affront to the dignity of our highest judicial institution. We must…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 6, 2025 -
సీజేఐపై దాడికి లాయర్ యత్నం
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సుప్రీంకోర్టులో సోమవారం ఉదయం 11.35 గంటలకు ఓ కేసుపై విచారణ జరుగుతుండగానే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్‌పై ఓ న్యాయవాది బూటు విసిరేందుకు ప్రయతి్నంచడం తీవ్ర కలకలం సృష్టించింది. కోర్టుగదిలో విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై అడ్డుకోవడంతో ఆ బూటు జస్టిస్ గవాయ్‌ని తాకలేదు. సీజేఐపై దాడికి ప్రయతి్నంచిన లాయర్‌ను ఢిల్లీ మయూర్ విహార్‌కు చెందిన రాకేశ్ కిశోర్(71)గా గుర్తించారు. అతడిని కోర్టు గది నుంచి బలవంతంగా బయటకు తరలించారు. సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించబోనంటూ రాకేశ్ కిశోర్ నినాదాలు చేయడం గమనార్హం. త నపై జరిగిన దాడి యత్నంపై జస్టిస్ గవాయ్ స్పందించారు. ఇలాంటి ఘటనలు తనపై ఏమా త్రం ప్రభావం చూపబోవని తేల్చిచెప్పారు. దాడులకు భయపడే ప్రసక్తే లేదంటూ పరోక్షంగా స్పష్టంచేశా రు. దాడి యత్నం తర్వాత కూడా కేసుల విచారణ ను ఆయన యథాతథంగా కొనసాగించడం విశేషంఅసలేం జరిగింది? సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం వేర్వేరు కేసుపై విచారణ నిర్వహిస్తుండగా, అక్కడే ఉన్న లాయర్ రాకేశ్ కిశోర్ వారిద్దరూ కూర్చున్న వేదిక వద్దకు దూసుకొచ్చాడు. తన కాలికున్న బూటు తీసి న్యాయమూర్తులపైకి విసిరేందుకు ప్రయత్నించాడు. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది మధ్యలోనే అడ్డుకుని బయటకు లాక్కెళ్లారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. విష్ణు దేవుడి విగ్రహంపై వ్యాఖ్యల వివాదం మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో ఉన్న విష్ణు దేవుడి విగ్రహంపై దాఖలైన పి టిషన్ విషయంలో చేసిన వ్యాఖ్యలే జస్టిస్ గవాయ్‌పై దాడి యత్నానికి కారణం కావొచ్చని న్యాయవాద వర్గాలు భావిస్తున్నాయి. ఖజురహోలోని జవెరీ టెంపుల్‌ను మళ్లీ నిర్మించి, ఏడు అడుగుల విష్ణు దేవుడి విగ్రహాన్ని నెలకొల్పేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ జస్టిస్ గవాయ్ తిరస్కరించారు. ‘మీరు ఏం కోరుకుంటున్నారో వెళ్లి ఆ దేవుడినే అడగండి. విష్ణు దేవుడికి మీరు నిజమైన భక్తులైతే అక్కడికే వెళ్లి ప్రారి్థంచండి. కొంతసేపు ధ్యానం కూడా చేయండి’’ అని పిటిషనర్‌కు సూచించారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.లాయర్‌పై సస్పెన్షన్ వేటు సాక్షాత్తూ సీజేఐపైనే బూటు విసిరేందుకు ప్రయత్నించిన లాయర్ రాకేశ్ కిశోర్‌పై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) తక్షణమే చర్యలు తీసుకుంది. అతడిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. లెసెన్స్‌ను రద్దు చేసింది.రాజ్యాంగంపై దాడి: సోనియాజస్టిస్ గవాయ్‌పై బూటుతో దాడిచేసేందుకు ప్రయతి్నంచడాన్ని కాంగ్రెస్ సీని యర్ నేత సోనియా గాంధీ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన సిగ్గుచేటు, మతిలేని చర్య అని పేర్కొన్నారు. ఇది మన రాజ్యాంగంపై, న్యాయ వ్యవస్థపై దాడేనని వ్యాఖ్యానించారు. విద్వేషం, ఉన్మాదం మన సమాజం చుట్టూ ఆవరించుకొని ఉన్నాయని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు సోని యా ఒక ప్రకటన విడుదల చేశారు.జస్టిస్ గవాయ్‌కి ప్రధాని మోదీ ఫోన్ న్యూఢిల్లీ: జస్టిస్ బి.ఆర్.గవాయ్‌పైకి లాయర్ బూటు విసిరేందుకు ప్రయత్నించడాన్ని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన ప్రతి ఒక్క భారతీయుడిని ఆగ్రహానికి గురి చేసిందని పేర్కొన్నారు. మన సమాజంలో ఇలాంటి అనుచిత ధోరణులకు స్థానం లేదని తేలి్చచెప్పారు. ఈ మేరకు మోదీ సోమవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. జస్టిస్ గవాయ్‌తో ఫోన్లో మాట్లాడానని పేర్కొన్నారు. లాయర్ చర్య పట్ల పూర్తి సంయమనం పాటించినందుకు జస్టిస్ గవాయ్‌ని ప్రశంసించానని వెల్లడించారు. న్యాయ వ్యవస్థ విలువలను, రాజ్యాంగ స్ఫూ ర్తిని బలోపేతం చేయడానికి ఆయన కట్టుబడి ఉన్నట్లు దీన్నిబట్టి స్పష్టమవుతోందని ప్రధాని ఉద్ఘాటించారు. ఇదీ చదవండి: పార్లమెంట్ కాదు.. రాజ్యాంగమే సర్వోన్నతం -
‘‘ఆ దేవుడినే అడగండి..’’ సీజేఐ వ్యాఖ్యలపై దుమారం
న్యూఢిల్లీ: ధ్వంసమైన ఏడడుగుల విష్ణుమూర్తి విగ్రహాన్ని పునరుద్ధరించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ క్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకోవాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.మధ్యప్రదేశ్‌లోని ఛాతర్‌పూర్‌జిల్లాలోని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ప్రఖ్యాత ఖజురహో ఆలయ సముదాయంలోని జవారీ ఆలయంలో విష్ణుమూర్తి విగ్రహం ధ్వంసమైంది. ఈ విగ్రహాన్ని పక్కనబెట్టి కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించేలా ఆదేశాలు ఇవ్వాలని(Khajuraho Vishnu idol case) రాకేశ్ దలాల్ అనే వ్యక్తి ఈ పిల్ వేశారు. ఈ పిల్ స్వీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రనల్ ధర్మాసనం పరిశీలించింది. ‘‘ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదు. పబ్లిసిటీ ప్రయోజన వ్యాజ్యం. ఇందులో మేం చేసేది ఏం లేదు. భారత పురతత్వ విభాగం(ఏఎస్ఐ) పరిధిలో ఆలయం ఉంది. వాళ్లనే అభ్యర్థించండి. లేదంటే మీరెలాగూ విష్ణుమూర్తికి పరమభక్తుడిని అని చెబుతున్నారుగా. ఆయననే వేడుకోండి. శైవత్వానికి మీరు వ్యతిరేకులు కాకపోతే అదే ఖజురహోలో అతిపెద్ద శివలింగం ఉంది. అక్కడ కూడా మీరు విన్నవించుకోవచ్చు. విగ్రహ పునరుద్ధరణ, పునర్నిర్మాణంపై ఏఎస్ఐ తుది నిర్ణయం తీసుకుంటుంది’’ అని వ్యాఖ్యానించారు. అయితే తీర్పు సందర్భంగా సీజేఐ జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఒక వర్గం మనోభావాలు దెబ్బ తీసేలా ఆయన మాట్లాడారంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అంతేకాదు.. ఆయన్ని అభిశంసించాలంటూ కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. వినీత్ జిందాల్ అనే న్యాయవాది సీజేఐ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారత రాష్ట్రపతికి, సుప్రీం కోర్ట్‌కు ఆయన ఓ లేఖ రాశారు. ప్రతి మత విశ్వాసానికి గౌరవం ఇవ్వాలి అని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. సత్యం సింగ్ రాజ్‌పుత్ అనే మరో న్యాయవాది జస్టిస్ బీఆర్ గవాయ్‌కు బహిరంగ లేఖ రాశారు. విష్ణుమూర్తి భక్తుడిగా ఆయన వ్యాఖ్యలు నన్ను వ్యక్తిగతంగా బాధించాయి. కాబట్టి వెంటనే ఆయన వాటిని ఉపసంహరించుకోవాలి అని లేఖలో డిమాండ్ చేశారు. ప్రస్తుతం సీజేఐ వ్యాఖ్యలపై న్యాయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. -
కంచ గచ్చిబౌలి కేసు.. సుప్రీం కోర్టు మరో వార్నింగ్
సాక్షి, ఢిల్లీ: వివాదాస్పద హెచ్‌సీయూ కంచ గచ్చిబౌలి కేసు విచారణలో భాగంగా.. అధికారులకు సుప్రీం కోర్టు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. అక్కడికక్కడే తాత్కాలిక జైళ్లను ఏర్పాటు చేసి అందులోకి అధికారులు పంపాల్సి ఉంటుందని భారత ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ బుధవారం హెచ్చరించారు. కంచ గచ్చిబౌలి కేసు విచారణ ఇవాళ సుప్రీం కోర్టులో జరిగింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పరీశీలనకు సమయం కావాలని ప్రతివాదులు కోరారు. దీంతో రెండు వారాల సమయం ఇస్తూ.. తదుపరి విచారణను ఆగష్టు 13కి వాయిదా వేసింది. కోర్టు.. అయితే.. ప్రస్తుతం అడవిని కాపాడారు కదా? అని చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ తెలంగాణ ప్రభుత్వం తరఫున లాయర్లను ప్రశ్నించారు. దానికి ‘‘ప్రస్తుతానికి కంచ గచ్చిబౌలి భూముల్లో అన్ని పనులు ఆపేశాం’’ అని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది బదులిచ్చారు. అభివృద్ధి కోసం అడవులను నరకడం సమంజసం కాదు. రాత్రికి రాత్రి బుల్డోజర్ పెట్టి అడవిని తీసేద్దామనుకున్నారు. సుస్థిర అభివృద్ధి కోసం నేను అడ్వొకేట్ చేస్తున్నా. అడవిని కాపాడకుంటే... అధికారులను అక్కడే టెంపరరీ జైలుకు పంపుతాం అని హెచ్చరించారాయన. -
పార్లమెంట్ కాదు.. రాజ్యాంగమే సర్వోన్నతం
మన దేశంలో కొంతమంది పార్లమెంటే సుప్రీం అని అంటారు. కానీ, నావరకైతే రాజ్యాంగమే దేశానికి సర్వోన్నతం అని భారత ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయ్(CJI BR Gavai) అన్నారు. పార్లమెంట్‌కు రాజ్యాంగాన్ని సవరణ చేసే అధికారం మాత్రమే ఉందన్న ఆయన.. రాజ్యాంగపు మౌలిక నిర్మాణాన్ని మార్చే హక్కు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం తన స్వస్థలం అమరావతి(మహారాష్ట్ర)లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కొంత మంది దేశానికి పార్లమెంటే అత్యున్నతమైందని భావిస్తారు. కానీ, నా వరకైతే న్యాయ(judiciary), శాసన(legislature), కార్యనిర్వాహక (executive) వ్యవస్థల్లో ఏదీ గొప్పది కాదు. రాజ్యాంగమే సర్వోన్నతం. ఎందుకంటే..పార్లమెంట్‌కు రాజ్యాంగంలో సవరణలు చేసే హక్కు మాత్రమే ఉంది. కానీ, మౌలిక నిర్మాణాన్ని మార్చే హక్కు మాత్రం లేదు’’ అని అన్నారాయన.జడ్జి ఎలా ఉండాలంటే..ఒక న్యాయమూర్తి కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలు ఇవ్వడం వల్ల స్వతంత్రుడు అవ్వలేడు. తాము కేవలం అధికారం ఉన్నవాళ్లం అని మాత్రమే కాకుండా, పౌర హక్కులు, రాజ్యాంగ విలువలను సంరక్షించాల్సిన బాధ్యతగల వాళ్లమని న్యాయమూర్తులు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్రజలు తమ తీర్పుల గురించి ఏమనుకుంటారో? ఎలా స్పందిస్తారో? అనే విషయాలపై ప్రభావితం కాకూడదు. స్వతంత్రంగా ఆలోచించాలి. ప్రజలు ఏమంటారన్నది నిర్ణయ ప్రక్రియలో భాగం కావాల్సిన అవసరం లేదు.బుల్డోజర్ జస్టిస్ తీర్పు గురించి..నా పని గురించి నా తీర్పులతోనే మాట్లాడుకునేలా చేస్తాను. రాజ్యాంగంలో స్థిరపరిచిన మూల హక్కుల పట్ల గౌరవంగా నిలబడతా. ఈ సందర్భంగా.. బుల్డోజర్ జస్టిస్ తీర్పును(కిందటి ఏడాది నవంబర్ 13న ఇచ్చిన తీర్పును) ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ప్రజలకు ఆశ్రయం (నివాసం) హక్కు అత్యున్నతమైనది అని పేర్కొన్నారాయన.భారత సుప్రీంకోర్టు బుల్డోజర్ జస్టిస్‌పై 2024 నవంబర్ 13న కీలక తీర్పు వెల్లడించింది. నేరారోపణలు ఉన్న వ్యక్తుల ఇళ్లను విచారణ లేకుండానే కూల్చడం చట్ట విరుద్ధం అని జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన బెంచ్ స్పష్టం చేసిందిఆర్కిటెక్ట్ కావాలనుకున్నా..అలాగే.. తన బాల్యంలో జరిగిన సంఘటనలను ఆయన గుర్తుచేసుకున్నారు. తాను నిజానికి ఆర్కిటెక్ట్ అవ్వాలనుకున్నప్పటికీ, తన తండ్రి మాత్రం న్యాయవాదిగా అవ్వాలని ఆకాంక్షించారని గవాయ్ చెప్పారు. నిజానికి నా తండ్రికి కూడా న్యాయవాది అవ్వాలన్న ఆశ ఉండేది. కానీ ఆయన స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని అరెస్టు కావడంతో అది సాధ్యపడలేదు’’ అని తెలిపారాయన. గవాయ్ తండ్రి సూర్యభాన్ గవాయ్ అంబేద్కర్‌వాదిగా రాజకీయాల్లో రాణించారు. బిహార్, సిక్కిం, కేరళ రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు కూడా.రాజ్యాంగంపై బీఆర్ గవాయ్ చేసిన తాజా వ్యాఖ్యలు భారత ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ ప్రాముఖ్యతను, పార్లమెంట్ సహా అన్ని వ్యవస్థలు రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.