Class 11 student
-
నోయిడా గ్యాంగ్ రేప్ కేసులో మలుపు
సాక్షి, : గ్రేటర్ నోయిడాలో 11వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలికపై సమీప బంధువు, స్నేహితులే అత్యాచారం చేశారని వచ్చిన ఆరోపణలు వాస్తవం కాదని తెలిసింది. తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని ఆరోపించిన బాలికకు నిర్వహించిన వైద్యపరీక్షల్లో ఈ విషయం తేటతెల్లమైంది. బాలికపై అత్యాచారం జరిగినట్లు ఆధారాలు ఏవీ లభించలేదని డాక్టర్లు తెలిపారు. దాంతో పోలీసులు ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం... ఈ నెల 18న స్కూల్‌కి వెళ్లిన బాలిక తిరిగి వచ్చే క్రమంలో స్కూల్‌బస్ వెళ్లిపోయింది. దీంతో ఆమె ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా ఆ సమయంలో అదే దారిలో కారులో వస్తున్న ముగ్గురు అబ్బాయిలు ఆమెను ఇంటి వద్ద దించుతామని కారులో ఎక్కించుకున్నారు. అనంతరం కదులుతున్న కారులోనే తనపై సామూహిక అత్యాచారం చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాలిక తెలిపింది. స్పృహ కోల్పోయిన తనను గల్గోటియా కళాశాల సమీపంలో వదిలి వెళ్లారని తెలిపింది. తమ కూతురు ఇంటికి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మంగళవారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో కాలేజీ వద్ద అపస్మారక స్థితిలో ఉన్న బాలికను గుర్తించారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం ఆ ముగ్గురు నిందితుల్లో ఒకరు తన సమీప బంధువని, మరొకరు తన క్లాస్మేట్ కాగా, మూడో వ్యక్తి తెలియదని చెప్పింది. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదే సమయంలో బాలికకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆమెపై అత్యాచారం జరగలేదని తేలింది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. అసలేం జరిగిందనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
స్కూల్‌కు తుపాకీ తీసుకెళ్లి..
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ ఇంటర్ విద్యార్థి కాలేజీకి తుపాకీ తీసుకెళ్లి కలకలం సృష్టించాడు. తన తమ్ముడితో గొడవపడ్డ మరో విద్యార్థిని తుపాకీతో కాల్చాడు. విద్యార్థి నడుములోకి బుల్లెట్ దూసుకెళ్లింది. స్కూల్ సిబ్బంది వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగా ఉందని, ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు. గోవింద్పురంలోని డెహ్రాడూన్ పబ్లిక్ స్కూల్లో ఇద్దరు విద్యార్థులు గొడవపడ్డారు. మరుసటి రోజు ఓ విద్యార్థి అన్న ఇంట్లో నుంచి నాటు తుపాకీ తీసుకొని క్యాంపస్‌కు వెళ్లాడు. తన సోదరుడిపై దాడిచేసిన విద్యార్థిపై లంచ్ టైమ్‌లో కాల్పులు జరిపాడు. నిందితుడు, అతని ముగ్గురు స్నేహితులు కలసి బెల్ట్‌లతో తన కొడుకును చితకబాది, తర్వాత కాల్చాడని బాధితుడి తండ్రి ఆరోపించాడు. టీచర్లు, ఇతర సిబ్బంది వచ్చి అడ్డుకుని, తన కొడుకును ఆస్పత్రికి తీసుకెళ్లి కాపాడారని చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. తుపాకీని స్వాధీనం చేసుకుని నిందితుడి తల్లిదండ్రులను విచారిస్తున్నారు. -
హోమ్ వర్క్ చేయడానికి...
చెన్నై: హోమ్ వర్క్ చేయడానికి సెలవు అవసరం కావడంతో పాఠశాలలో బాంబు ఉందని ఫోన్ చేశానని ప్లస్ వన్ విద్యార్థి మంగళవారం పోలీసులకు తెలిపాడు. అతన్ని బాలల జువైనల్ హోమ్‌కు తరలించారు. చెన్నై, పోలీసు కంట్రోల్ రూమ్‌కు సోమవారం ఉదయం ఫోన్ చేసిన ఒక బాలుడు, వలసరవాక్కం ఆల్వార్తినగర్లో ఉన్న వెంకటేశ్వర పాఠశాలలోను, విరుగంబాక్కం న్యూకాలనీలో ఉన్న జాన్స్ పాఠశాలలోను బాంబులు పెట్టినట్టు తెలిపాడు. కొద్దిసేపట్లో అవి పేలిపోతాయని అని బెదిరించి ఫోన్ కట్ చేశాడు. దీంతో డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ నిపుణులు వలసరవాక్కం, విరుగంబాక్కం పోలీసులు ఆయా పాఠశాలలకు వెళ్లి విద్యార్థులను బయటకు పంపించివేసి పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పోలీసుల తనిఖీల్లో అది బాంబు బూచీ అని తేలింది. ఈ విషయమై విరుగంబాక్కం పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో ఫోన్ కాల్ ఏంజీఆర్ నగర్ నుంచి వచ్చినట్టుగాను, సెయింట్ జాన్స్ పాఠశాలలో ప్లస్ వన్ విద్యార్థి ఫోన్ చేసినట్టు తెలిసింది. దీంతో పోలీసులు ఆ విద్యార్థిని మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. విచారణలో శని, ఆదివారాల్లో పాఠశాలకు సెలవు కావడంతో ఉపాధ్యాయులు ఎక్కువ హోమ్ వర్క్ ఇచ్చారు. వినాయక నిమజ్జనానికి స్నేహితులతో వెళ్లాను. దీంతో హోమ్‌వర్క్ చేయలేదు. సోమవారం ఉపాధ్యాయులు హోమ్ వర్క్ గురించి అడుగుతారని భయపడి, సెలవు కోసం బాంబు బెదిరింపు కాల్ చేశాను అని విద్యార్థి వెల్లడించాడు. నేను చేసిన తప్పును తెలుసుకున్నానని బోరున విలపించాడు. తనను క్షమించి విడిపించాలని విజ్ఞప్తి చేశాడు. అయినప్పటికీ అతనిపై కేసు నమోదు చేసి కెల్లిస్లో ఉన్న బాలల జువైనల్ హోమ్‌కు తరలించారు.