కథల వర్ణన్
ఒక టీనేజర్ బామ్మగా మారిపోయింది. మీరు విన్నది నిజమే, పెద్దవాళ్లు పిల్లలకు కథ చెప్పే అలవాటు పోయిందంటూ రేపటి తరానికి కథలు చెప్పడానికి సిద్ధమైపోయింది పద్దెనిమిదేళ్ల ప్రియాల్ జైన్. ‘పిల్లలు మన భారతీయ సంస్కృతికి, వారసత్వానికి దూరం అవుతున్నారని పెద్దలు బాధపడుతుంటారు. ఇది వారి తప్పు కాదు. పిల్లలకి మన చరిత్ర, సంస్కృతి, వారసత్వానికి దగ్గరయ్యేలా వారిలో స్ఫూర్తిని నింపాలి. అది మన బాధ్యత’ అంటోంది ప్రియాల్. రాజస్థాన్ వాసి అయిన ప్రియాల్ దేశవ్యాప్తంగా ఉన్న సంప్రదాయ, జానపద కథలకు రూపం కూడా ఇస్తోంది.
ప్రియాల్ జైన్ 12వ తరగతి చదువుతోంది. లాక్డౌన్ టైమ్‌ని సద్వినియోగ పరుచుకోవాలని ‘వర్ణన్’ అనే పేరుతో వెబ్సైట్ ప్రారంభించి, తను చిన్ననాటి నుంచి విన్న కథలన్నీ అందులో పొందుపరుస్తోంది. ఇంకెన్నో కథలను సేకరిస్తూ, వాటిని రేపటితరానికి అందిస్తోంది.
శతాబ్దాల జ్ఞానం
‘నా చిన్నప్పుడు మా బామ్మ నా హిస్టరీ బుక్‌లో ఉన్న పాఠాల కన్నా ఎన్నో కథలు చెప్పేది. అవన్నీ నేను మరచిపోలేనివి. ధైర్యవంతులైన స్త్రీ పురుషుల కథల గురించి, మార్మికమైన పౌరాణిక పాత్రల గురించి, విశ్వాసపాత్రమైన జంతువుల గురించి... ఇలా ఎన్నో కథలు. నేను పెద్దయ్యాక మా నాన్న ఉద్యోగరీత్యా నా చదువుకోసం బామ్మ నుంచి దూరంగా వెళ్లిపోయాం. నా చెల్లెలికి పదేళ్లు ఉంటాయి. తనకి కథలు చెప్పడానికి ఎవరూ లేరు. ఈ ఏడాదిన్నర కాలంగా ఆన్లైన్లో తరగతులు.
నాకైతే ఒకే క్లాసులో ఉన్న భావన కలుగుతోంది. పిల్లలకు ఆటలు లేవు. అలాగే, మన భారతీయ చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదలో పొందుపరిచిన శతాబ్దాల మిశ్రమ జ్ఞానం కూడా పొందలేకపోతున్నారు. ఇది గ్రహించే నేను ‘వర్ణన్’ అనే వెబ్సైట్ ప్రారంభించాను. ఇందుకు మా నాన్న నాకు సపోర్ట్‌నిచ్చారు. శతాబ్దాల నాటి భారతీయ జ్ఞానాన్ని అంతా సజీవంగా ఉంచాలనుకుంటున్నాను. ఈ జ్ఞానాన్ని తరువాత తరానికి తీసుకెళ్లకపోతే ఎంతో కాలం ఉండదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ప్రతి ఒక్కరికీ కథ చెప్పే బామ్మగా వర్ణన్ ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను’ అని తన ఆలోచన రూపం దాల్చిన విషయం గురించి చెబుతుంది ప్రియాల్.
6 నుంచి 106 ఏళ్ల వయసున్న కథలు
‘మా కథల సేకరణ పిల్లల్లో ఊహాన్వేషణను ప్రోత్సహిస్తుంది. ఏ మాత్రం బోర్ కొట్టవు. బెడ్ టైమ్ కథలతోపాటు, పెద్దలను కూడా వినోదంతో ఆకట్టుకునేలాంటి కథలు మా ‘వర్ణన్’లో ఉంటాయి. అంటే ఐదారేళ్ల పిల్లలతో పాటు నూరేళ్ల వయసు దాటిన వారినీ మా కథలు ఆకట్టుకుంటాయి. ‘వర్ణన్’ మీకు ఇష్టమైన కథ చెప్పే తాత, బామ్మ లాంటిది. ప్రేరణ కలిగించేది, ఆలోచన పెంచే విధంగా ఉంటుంది’ అని తన వర్ణన్ గురించి వర్ణించి మరీ చెబుతుంది ప్రియాల్.
కథకుల బృందం
ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదలుపెట్టిన కథా పందిరి వర్ణన్కు కథలు అందించేలా 30 మంది దాకా బృందాన్ని ఏర్పాటు చేసింది ప్రియాల్. వారి ద్వారా కథా సేకరణ చేస్తోంది. వాటిన్నిటికీ ఒక రూపం ఇచ్చి, ఎడిట్ చేసి వెబ్సైట్లో ఉంచుతూ ఈ తరానికి కథల ప్రయోజనాన్ని తెలియజేస్తోంది.
కథల మూటతో జ్ఞాన సంపదను భవిష్యత్ తరాలకు అందించాలని తపించే నవతరపు ప్రతినిధి ప్రియాల్ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది.