Class X student
-
మరో బాలికపై అఘాయిత్యం!
సాక్షి టాస్క్‌ఫోర్స్, తిరుపతి: తిరుపతి జిల్లాలో మూడున్నరేళ్ల బాలికపై హత్యాచార ఘటనను మరువకముందే.. సోమవారం మరో బాలికపై దారుణం చోటుచేసుకుంది. గాయాల పాలై ముళ్లపొదల్లో అపస్మారక స్థితిలో మూలుగుతున్న బాలికను గుర్తించిన తండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలిక తండ్రి కథనం ప్రకారం.. తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలం యల్లమంద దళితవాడకు చెందిన 14 ఏళ్ల బాలిక సమీపంలోని జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. ఎప్పటిలా సోమవారం పాఠశాలకు వెళ్లింది. సాయంత్రం అవుతున్నా.. ఇంటికి రాకపోవటంతో బాలిక తండ్రి కంగారుపడి పాఠశాలకు వెళ్లాడు. బాలిక పాఠశాలలో లేకపోవటంతో వెతకటం ప్రారంభించాడు. గ్రామానికి సమీపంలోని ముళ్లపొదల్లోంచి మూలుగు వినిపించడంతో లోనికి వెళ్లి చూశాడు. బాలిక తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో ఉండటాన్ని చూసి చలించిపోయాడు. అక్కడే సపర్యలు చేసి ఏం జరిగిందని బాలికను ఆరా తీశాడు.పొట్టపై తన్ని.. చాకుతో దాడిపాఠశాల ముగిసిన తరువాత బాలిక నడచుకుంటూ ఇంటికి బయలుదేరింది. వెనుకవైపు నుంచి పల్సర్ బైక్‌పై మాస్క్‌లు ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు బాలికను అడ్డగించారు. వెంటతెచ్చుకున్న మత్తు మాత్రలను నీళ్లలో కలిపి తాగమని బాలికను బలవంతం చేశారు. అందుకు నిరాకరించడంతో ఇద్దరు దుండగులు కాలితో ఆమె పొట్టపై తన్నారు. ఆపై చాకుతో దాడిచేసి బలవంతంగా మత్తు మందు కలిపిన నీటిని తాగించారు. అనంతరం ఎవరికో వీడియో కాల్చేసి.. ఈ అమ్మాయేనా? కాదా? అని అడిగి తెలుసుకున్నారు. తరువాత ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్టు చెబుతున్నారు. మత్తు మందు తాగించాక గంటకుపైగా బాలిక స్పృహలో లేదు. స్థానికుల సహాయంతో బాలికను ఆమె తండ్రి యల్లమంద పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం బాలికను పోలీసులు జీపులో పీలేరు ప్రభుత్వాస్పపత్రికి తరలించారు. తండ్రిని సర్పంచ్ ఓబులేసు, వైఎస్సార్సీపీ నాయకుడు నాగార్జునరెడ్డి కారులో తీసుకుని పోలీసు వాహనాన్ని వెంబడించారు.కేసులో అనేక సందిగ్ధాలు: ఎస్పీ కార్యాలయంయర్రావారిపాలెం మండలం యల్లమంద గ్రామంలో బాలికపై అత్యాచారం జరిగినట్టు ప్రచారం ప్రచారం చేస్తున్నారని.. దీనిపై యర్రావారిపాలెం పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారని తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం సోమవారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొంది. విచారణలో అనేక సందిగ్ధాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపింది. అయితే, విచారణ పూర్తికాకముందే కొంతమంది సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని, కేసు నమోదు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో పేర్కొంది.ఆ దుండగుల్ని ఉరి తీయాలిబాలికపై చాకుతో దాడిచేసి.. మత్తు మందు కలిపిన నీళ్లు తాగించి దారుణానికి ఒడిగట్టిన ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్ట్ చేయాలని బాలిక తండ్రి కోరారు. నిందితులిద్దరినీ పట్టుకుని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. అలా చేస్తేనే తమకు న్యాయం జరుగుతుందని చెప్పారు.దోషులను శిక్షించే వరకు వదలం: చెవిరెడ్డిమైనర్ బాలికపై దారుణం జరిగిందన్న సమాచారం అందుకున్న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హుటాహుటిన యల్లమంద దళితవాడకు చేరుకున్నారు. అనంతరం బాలిక చికిత్స పొందుతున్న ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాలికకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను కోరారు. దారుణ ఘటనకు కారుకులైన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దోషులను శిక్షించే వరకు వదిలేది లేదని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. -
చుక్కల్లో చంద్రిక.. ఎన్నో రకాల బుక్స్ చదివాను.. కానీ, ఆ ఒక్కటీ..
అమ్మా! నక్షత్రాలు పగలంతా ఎక్కడికి వెళ్తాయి? నాన్నా! చందమామ రోజుకోరకంగా ఉంటాడెందుకు? తాతయ్యా! చందమామ దగ్గరకు ఏ విమానంలో వెళ్లాలి? రాకెట్లో వెళ్తే నిజంగా... చందమామను తాకవచ్చా! బాల్యానికి ఇలాంటి సందేహాలెన్నో! నేను రాకెట్లో చందమామ దగ్గరకు వెళ్తా. ఇలాంటి తీర్మానాలు మరెన్నో!! ఆ తీర్మానాన్ని నిజం చేస్తానంటోంది కైవల్య. ఆ బాటలో ఇప్పటికే కొన్ని అడుగులు వేసింది. ఇస్రో స్పేస్ క్విజ్‌లో విజేతగా నిలిచింది. అంతరిక్షాన్ని ఔపోశన పడుతోంది ఈ చుక్కల్లో చంద్రిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లాలో ఓ పట్టణం నిడదవోలు. ఆ పట్టణంలో పదో తరగతి విద్యార్థిని కైవల్య. వరల్డ్ స్పేస్ వీక్ సందర్భంగా ఇస్రో గత ఏడాది తణుకు పట్టణంలో నిర్వహించిన స్పేస్ క్విజ్, వృక్తృత్వం, సైన్స్ ఫేర్లలో పాల్గొన్నది. ఆశ్చర్యంగా మూడింటిలోనూ ప్రథమ స్థానమే. ఈ ఏడాది ఇస్రో –నాసాలకు అనుబంధంగా ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న స్పేస్ పోర్ట్ ఇండియా ఫౌండేషన్ ఆస్టరాయిడ్ డే (జూన్ 30) సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతినిధిగా హాజరైంది. అనేక విభాగాల పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచింది. వచ్చే ఏడాది జరిగే నాసా ఒలింపియాడ్ పరీక్షలకు అర్హత సాధించింది. ఆస్టరాయిడ్‌ను గుర్తించి ‘స్పేస్ పోర్ట్ ఇండియా ఫౌండేషన్’ అంబాసిడర్స్ బృందంలో సభ్యత్వాన్ని సాధించింది. తనకు అంతరిక్షం పట్ల ఆసక్తి రేకెత్తడం, అమ్మానాన్నలు తనకు అవసరమైన వనరులను సమకూర్చడం గురించిన అనుభవాలను సాక్షితో పంచుకుంది కైవల్య. ‘‘మా నాన్న శ్రీనివాసరెడ్డి, అమ్మ విజయలక్ష్మి. నాన్న పంచాయితీ ఈవో. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ నడుపుతోంది. అమ్మకు సామాజిక దృక్పథం ఎక్కువ. దాంతో చిన్నప్పటి నుంచి చాలా ప్రత్యేకంగా పెంచిందనే చెప్పాలి. థర్డ్ క్లాస్‌లో ఉన్నప్పుడు నాకు తొలిసారిగా ఆస్ట్రానమీ గురించి ఆసక్తి కలిగింది. నా ప్రశ్నలకు సమాధానం చెప్తూనే ఉండేది అమ్మ. ఖగోళశాస్త్రం మీద నా ఆసక్తి గమనించిన అమ్మ నా కోసం ఎన్సైక్లోపీడియా బుక్స్ తెచ్చింది. ఫోర్త్ క్లాస్ హాలిడేస్‌లో వాటిని చదివాను. ఫిఫ్త్ క్లాస్ నుంచి ఈ రంగం మీద బాగా ఫోకస్ పెట్టాను. జనరల్ నాలెడ్జ్ బుక్స్ ఆరు పుస్తకాలు కంఠతా పట్టినట్లు స్టడీ చేశాను. ఆ బుక్స్‌లో చాలా రకాల టాపిక్స్ ఉంటాయి. కానీ ఆస్ట్రానమీ సబ్జెక్ట్ నన్ను కట్టిపడేసేది. చదివేకొద్దీ ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటివరకు ఎంతోమంది ఖగోళాన్ని అధ్యయనం చేశారు. విశ్వంలో ఏమేమి ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేశారు. వాళ్లు తెలుసుకున్న విషయాలన్నింటినీ పుస్తకాల్లో రాశారు. వేలాది పేజీల్లో ఉన్న సమాచారం అంతా కూడా విశ్వంలో మనం తెలుసుకోవలసిన విషయాల్లో ఒక్క శాతం ఉంటుందేమో! పోటీలే పాఠాలు! మనకు మనంగా చదువుతూ ఉంటే మనకు అంతా తెలిసిపోయిందనుకుంటాం. పోటీల్లో పాల్గొంటే కొత్త విషయాలు తెలుస్తాయి. ఈ రంగంలో ఇంకా ఏయే పుస్తకాలున్నాయో తెలుస్తుంది. ఎన్ని వెబ్సైట్లలో ఈ సమాచారం లభిస్తుందో తెలుస్తుంది. ఇందుకోసమే రూపొందిన సాఫ్ట్వేర్లు తెలుస్తాయి. నేను ఇప్పటివరకు 30కి పైగా కాంపిటీషన్లలో పాల్గొన్నాను. నా కెరీర్ కూడా ఇందులోనే అని నిర్ణయించేసుకున్నాను కూడా. ఇంటర్లో ఎంపీసీ తీసుకుని ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ ఖగోళశాస్త్రంలోనే చేయాలనుకుంటున్నాను. ఐఐటీ ఖరగ్‌పూర్, ఎమ్ఐటీ చెన్నై, బెంగుళూరు– స్పేస్ సైన్స్ ఇన్స్టిట్యూట్ వంటి వాటిల్లో సీటు తెచ్చుకోవాలనేది నా లక్ష్యం. డాన్స్‌కు ఇక దూరమే! నాకు పెయింటింగ్, పియానో ప్లే చేయడంతోపాటు కరాటే, క్లాసికల్ డాన్స్ కూడా ఇష్టం. స్టడీస్‌కి ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి డాన్స్ ప్రాక్టీస్ చేయడం కుదరదు. మిగిలినవన్నీ కంటిన్యూ చేస్తాను. స్పేస్ పోర్ట్ ఫౌండేషన్ అంబాసిడర్ టీమ్‌లో మెంబర్‌గా స్కూళ్లకు వెళ్లి అవగాహన తరగతుల్లో స్పేస్ గురించి వివరిస్తున్నాను. అమ్మాయిలకు నేను చెప్పేది ఒక్కటే. ‘మనం అమ్మాయిలం కదా, ఈ ఫీల్డ్ ఎలా’ అనే సందేహాలు వద్దు. ఆసక్తి ముఖ్యం. సాధించాలనే కోరిక, చేయగలమనే నమ్మకం ఉంటే మనం చేసి తీరుతాం. అయితే ఇలాంటి రంగంలో ఎదగాలంటే పేరెంట్స్, టీచర్స్ సహకారం చాలా ఉండాలి. మా పేరెంట్స్‌కి, టీచర్స్‌కి ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అని చెప్పింది కైవల్య. అంతరిక్ష అధ్యయనం: కుంచాల కైవల్యారెడ్డి, నిడదవోలు ఆస్టరాయిడ్ డిస్కవరీలో ఒక ఆస్టరాయిడ్ని గుర్తించాను. అంతరిక్షాన్ని పాన్స్టర్ టెలిస్కోప్‌తో పరిశీలిస్తూ, మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి ఫొటోలను పంపిస్తారు. ఇందుకోసం ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ ఫొటోలను స్టడీ చేసి కదలికలను గుర్తించడమే ఈ డిస్కవరీ. జర్మనీ– కెనడాల్లోని అంతరిక్ష పరిశోధక సంస్థలు నిర్వహించాయి. నేను ఒక ఆస్టరాయిడ్‌ను గుర్తించాను. గుర్తించిన వెంటనే ‘ఎస్ఐఎఫ్ జీరో వన్ వన్...’ ఇలా ఒక టెంపరరీ నేమ్ ఇస్తాం. ఇలాంటి డిస్కవరీలన్నింటినీ క్రోడీకరించేటప్పుడు సీనియర్ సైంటిస్టులు ఒక పేరును ఖరారు చేస్తారు. ఆ ఆస్టరాయిడ్‌ను గుర్తించిన వారిలో నా పేరు రికార్డ్స్‌లో ఎప్పటికీ ఉంటుంది. జూలై 25వ తేదీన వరŠుచ్యవల్ మీటింగ్‌లో సర్టిఫికేట్ ప్రదానం చేశారు. ఆ కాంపిటీషన్లో ఎనభైకి పైగా దేశాల నుంచి పార్టిసిపేషన్ ఉంది. వారిలో యూఎస్, యూకేలకు చెందిన కొందరు టీచర్స్‌తో టచ్‌లో ఉన్నాను. వారితో సంభాషణ నాలెడ్జ్ షేరింగ్‌కి బాగా ఉపయోగపడుతోంది. – గాడి శేఖర్‌బాబు, సాక్షి, నిడదవోలు -
డస్టర్ లొల్లి ప్రాణం తీసింది
క్లాస్‌రూంలో తోటి స్నేహితుడిని మెడపై గుద్దిన విద్యార్థి కిందపడి అక్కడికక్కడే ప్రాణాలొదిలిన పదో తరగతి విద్యార్థి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ జెడ్పీ హైస్కూల్లో ఘటన చండ్రుగొండ (అశ్వారావుపేట): వారిద్దరూ ఫ్రెండ్స్.. ఒకే క్లాస్.. రోజూ కలిసే బడికి వస్తారు.. శుక్రవారం అలాగే వచ్చారు.. తరగతి గదిలో డస్టర్ కోసం ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం మొదలైంది.. తోటి స్నేహితుడిని నిలువరించే క్రమంలో మెడపై గుద్దాడు రెండోవాడు.. అంతే.. అతడు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలొదిలాడు! భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చండ్రుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. తాను కావాలని కొట్టలేదని, స్నేహితుడు చనిపోతాడని అనుకోలేదంటూ రెండో విద్యార్థి కన్నీరుమున్నీరయ్యాడు. ఇన్చార్జి హెడ్మాస్టర్ ఫిర్యాదు మేరకు ఆ విద్యార్థిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గొడవ మొదలైందిలా.. చండ్రుగొండ మండల కేంద్రంలోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన భానుప్రకాశ్(16) పదో తరగతి చదువుతున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన మరో విద్యార్థి, ఇతడు స్నేహితులు. శుక్రవారం ఇద్దరూ స్కూలుకు వెళ్లారు. ఉదయం ఫస్ట్ పీరియడ్ ఇంగ్లిష్ క్లాస్ జరిగింది. సెకండ్ పీరియడ్ మొదలవగానే.. స్కూల్‌డే సందర్భంగా జరిగే క్రీడలకు ఎంపికలు నిర్వహించడానికి విద్యార్థులను గ్రౌండ్‌కు పిలిచారు. తర్వాత ఒక్కొక్కరుగా తరగతి గదులకు చేరుకుంటున్నారు. థర్డ్ పీరియడ్ తెలుగు సబ్జెక్ట్ బోధించాల్సి ఉండగా.. క్లాస్ బోర్డుపై ఇంగ్లిష్ పాఠం అని రాశారు. దీన్ని డస్టర్‌తో తుడిచేందుకు భానుప్రకాశ్ స్నేహితుడు యత్నించాడు. ఇదే సమయంలో భానుప్రకాశ్.. అతడి నుంచి డస్టర్ తీసుకోబోయాడు. దీంతో ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. భానుప్రకాశ్‌ను వారిస్తూ అతడి మెడపై బలంగా గుద్దాడు అతడి స్నేహితుడు. దీంతో భానుప్రకాశ్ విద్యార్థులు కూర్చునే బల్లపై పడిపోయాడు. మెడపై బలమైన దెబ్బ తగలడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. విద్యార్థులంతా గట్టిగా కేకలు వేయడంతో ఉపాధ్యాయులు క్లాస్‌రూంకు చేరుకున్నారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న భానుప్రకాశ్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. జాతీయ రహదారిపై రాస్తారోకో విద్యార్థి మృతికి ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ విజయవాడ – జగదల్పూర్ జాతీయ రహదారిపై మృతుడి బంధువులు, వివిధ పార్టీల నేతలు, దళిత సంఘాల నాయకులు రాస్తారోకో చేశారు. నాలుగు గంటల పాటు ఆందోళన జరిపారు. భానుప్రకాశ్ మృతికి బాధ్యులను చేస్తూ ప్రధానోపాధ్యాయురాలు బీపీఆర్ఎల్ కుమారి, పీడీ సృజనలను సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో హయగ్రీవాచారి చెప్పారు. అనంతరం ఈ ఘటన విషయాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుకు ఫోన్లో వివరించారు. భానుప్రకాశ్ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయంతో పాటు కుటుంబంలో ఒకరికి అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. చనిపోతాడనుకోలేదు ‘‘నా చేతిలో ఉన్న డస్టర్‌ను భాను ప్రకాశ్ లాక్కోబోయాడు. నేను వారించినా మళ్లీ అదే ప్రయత్నం చేశాడు. దీంతో కోపం వచ్చి కొట్టాను. చనిపోతాడనుకోలేదు.. నేను, భాను రోజూ ఇంటి నుంచి కలిసే బడికి వస్తాం. ఇలా జరుగుతుం దని అనుకోలేదు..’’అంటూ భానును కొట్టిన రెండో విద్యార్థి విలపించాడు. కాగా, అతడిపై పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం శివరామకృష్ణ ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడిపై హత్య కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. -
పనిమీద వెళ్లిన అమ్మాయిపై దారుణం
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా కకాదేవ్ ప్రాంతంలో పదో తరగతి విద్యార్థిని (16)పై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం రాత్రి ఈ అమ్మాయి ఇంట్లో నుంచి పనిమీద బయటకు వెళ్లింది. ఇంటి పక్కన ఉండే గొలు అనే యువకుడు ఆ సమయంలో మరో నలుగురు యువకులతో కలసి బాలికను తన ఇంట్లోకి బలవంతంగా లాక్కెళ్లాడు. ఆమెకు మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చి లైంగికదాడికి పాల్పడ్డారు. బాలిక ఇంటికి రాకపోయేసరికి ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమె సెల్‌ఫోన్‌కు ఫోన్ చేయగా బదులు ఇవ్వలేదు. కాగా ఫోన్ రింగ్ టోన్ సౌండ్ పక్క ఇంటి నుంచి వస్తున్నట్టు గుర్తించారు. గొలు ఇంట్లోకి వెళ్లి చూడగా బాధితురాలు అపస్మారక స్థితిలో ఉన్నట్టు గుర్తించారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. గొలుతో పాటు చింటు, ఛోటు, ఆకాశ్, శుభమ్ తనపై అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు చెప్పింది. కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్పారు. -
విద్యార్థి ఫెయిలైతే.. బాధ్యత హెచ్‌ఎందే!
‘పది’ కసరత్తులో భాగంగా డీఈవో స్పష్టీకరణ డివిజన్ల వారీగా సమావేశాల నిర్వహణ గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో వెనుకబడ్డ జిల్లా దిద్దుబాటు చర్యలో జిల్లా విద్యాశాఖ వ్యక్తిత్వ వికాస నిపుణులతో సదస్సులు పరీక్షలకు హాజరుకానున్న 54 వేల మంది విద్యార్థులు వచ్చే ఏడాది మార్చి 26 నుంచి పరీక్షలు ‘పదోతరగతి విద్యార్థి పరీక్షల్లో ఫెయిలైతే దానికి ప్రధానోపాధ్యాయులే బాధ్యులు..’ ఇవీ గుడివాడలో బుధవారం జరిగిన డివిజన్ స్థాయి ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె.నాగేశ్వరరావు చెప్పిన మాటలు. ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలపై దృష్టిపెట్టిన జిల్లా విద్యాశాఖ ఇందుకోసం కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఆయన విద్యాశాఖ అధికారులు, హెచ్ఎంలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ : జిల్లా విద్యాశాఖ పదోతరగతి పరీక్షల కసరత్తు మొదలైంది. ఇటు విద్యార్థులతో పాటు అటు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు కూడా ఈ పరీక్షలు సవాలుగా మారాయి. ఈ క్రమంలో ప్రణాళికాబద్ధంగా విద్యాబోధనతో పాటు ప్రత్యేక తరగతుల నిర్వహణ, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ప్రత్యేక సదస్సులు, పలు కార్యక్రమాలతో జిల్లా విద్యాశాఖ షెడ్యూల్ సిద్ధం చేసి కసరత్తు మొదలుపెట్టింది. ఫలితాల్లో వెనుకబాటు... చదువుల రాజధానిగా పేరొందిన జిల్లా పదోతరగతి పరీక్షా ఫలితాల్లో వెనుకబడింది. వరుసగా గత మూడేళ్లూ రాష్ట్రంలో మొదటి మూడు స్థానాలకు దూరంగా ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర విభజన జరగడంతో జిల్లాలోని విజయవాడ నగరం రాష్ట్ర రాజధాని అయింది. దీంతో పదోతరగతి పరీక్షలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొదటి మూడు స్థానాల్లో నిలవడానికి అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. విద్యాశాఖ కమిషనర్ కూడా పదో తరగతి పరీక్షలపై జిల్లా విద్యాశాఖ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం విద్యాశాఖ మొత్తం పదోతరగతి పైనే దృష్టి నిలిపింది. జిల్లాలో ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులు 54 వేల మంది ఉన్నారు. వీరు కాకుండా ప్రైవేట్‌గా పరీక్షలు రాసే విద్యార్థులు ఆరువేల మంది ఉన్నారు. 54 వేల మంది విద్యార్థుల్లో 20 వేల మంది ప్రెవేట్ పాఠశాలల విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో 850 పాఠశాలలు ఉన్నాయి. గత ఏడాది పదోతరగతి పరీక్షల్లో జిల్లా తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఐదేళ్ల కిత్రం వరకు జిల్లా మొదటి మూడు స్థానాల్లో ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ క్రమంలో జిల్లా విద్యాశాఖ నాలుగు నెలలకు ముందే కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెల ఒకటి నుంచి ప్రత్యేక తరగతులు... పదోతరగతి పరీక్షలకు మరో నాలుగు నెలల సమయం ఉన్న క్రమంలో విద్యాశాఖ ఈనెల ఒకటి నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రోజుకు 45 నిమిషాల పాటు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటివరకు పూర్తయిన సిలబస్‌పై రివిజన్తో పాటు సబ్జెక్ట్‌ల వారీగా పరీక్షలకు సిద్ధమయ్యేలా తరగతులు నిర్వహిస్తున్నారు. మరోవైపు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. దీనికిగాను రెండు రోజుల క్రితం మచిలీపట్నంలో 25 పాఠశాలలకు చెందిన 300 మంది విద్యార్థులకు తరగతులు నిర్వహించారు. డివిజన్ల వారీగా సమావేశాలు... మరోవైపు టీచర్లను కూడా పరీక్షలకు సమాయత్తం చేసేందుకు జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం డివిజన్ల వారీగా మండల విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి ఆ తర్వాత టీచర్లతో కూడా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు మచిలీపట్నం, నూజివీడు, గుడివాడలో సమావేశాలు నిర్వహించారు. బుధవారం నందిగామలో మండల విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి నూరుశాతం ఫలితాలు సాధించే దిశగా అందరూ సమష్టిగా కష్టపడాలని సూచించారు. మరో వారం వ్యవధిలో విజయవాడ డివిజన్లో సమావేశం నిర్వహించి ఆ తర్వాత టీచర్లతో సమావేశాలు, పదోతరగతి విద్యార్థులకు బోధించే టీచర్లకు ఒరియంటేషన్ తరగతులు నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. మార్చి 26 నుంచి పరీక్షలు... వచ్చే ఏడాది మార్చి 26 నుంచి పదోతరగతి పరీక్షలు మొదలవుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం షెడ్యూల్ ప్రకటించారు. 26న మొదలై ఏప్రిల్ 11 వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఈ క్రమంలో జనవరిలో అర్థసంవత్సర పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల సమయం మరికొంత పెంచే అవకాశం ఉంది. ఈ విద్యాసంవత్సంలో నూరు శాతం ఫలితాలు రాబట్టి జిల్లాను మొదటి మూడు స్థానాల్లో ఉంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని డీఈవో నాగేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు.