classess
-
తినడానికి తిండిలేక,చెన్నై రోడ్లపై భిక్షాటన..ఇన్‌స్టా వీడియోతో పాపులారిటీ
కూటికోసం కోటివిద్యలు అంటారు. ఈ విద్యే... ఎవరూ చూసేవారు లేక అనాథలా మారి, పదిమంది దగ్గర యాచిస్తూ కడుపు నింపుకొంటోన్న మెర్లిన్‌కు భోజన, వసతి సదుపాయాలు కల్పించి ఆదుకుంటోంది. ఎంతోమందికి మెర్లిన్ నేర్పిన విద్యాబుద్ధులే 81 ఏళ్ల వయసులో నిస్సహాయస్థితిలో ఉన్న ఆమెని ఆదుకుంటూ... అండగా నిలబడ్డాయి. బర్మాకు చెందిన మెర్లిన్ భారతీయ వ్యక్తిని పెళ్లిచేసుకుని చెన్నైలో స్థిరపడిపోయింది. ఇంగ్లీష్, లెక్కలు, తమిళం బోధిస్తూ, భర్తతో సంతోషంగా ఉండేది. సంవత్సరాలు గడిచే కొద్దీ తనవారిని ఒక్కొక్కరిగా పోగొట్టుకుంటూ ఒంటరిదైపోయింది. తినడానికి తిండిలేక, ఉండడానికి చోటులేక ఫుట్‌పాతే అన్నీ అయ్యి బతుకుతోంది. చెన్నై రోడ్లమీద తిరుగుతూ భిక్షమెత్తుకుని పొట్టనింపుకుంటోంది. దుస్తులు కొనివ్వండి బాబూ... ఒకరోజు ‘ఏబ్రోకాలేజ్కిడ్’అనే ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా సోషల్ సర్వీస్ చేస్తోన్న మొహమ్మద్ ఆషిక్ కంటపడింది మెర్లిన్. ఆమెను చూడగానే ఆమె మొదటినుంచి యాచకవృత్తిలో ఉన్న ఆమె కాదని గ్రహించాడు ఆషిక్. వెంటనే ‘‘ఎక్కడినుంచి వచ్చావు అమ్మా? నీకు ఎవరూ లేరా? వయసులో ఉన్నప్పుడు ఏం చేసేదానివి...’’ వంటి ప్రశ్నలు వేస్తూ మెర్లిన్ గురించిన వివరాలు తెలుసుకున్నాడు ఆషిక్. ‘‘భిక్షం అడిగి కడుపు నింపుకుంటున్నాను. కొన్ని రోజులు ఆహారం దొరుకుతుంది. మరికొన్ని రోజులు ఏమీ దొరకదు... నీళ్లు తాగి పడుకుంటాను. దేవుడు ఎంతవరకు ఇస్తే అంతే బాబు’’ అని మెర్లిన్ చెప్పింది. ‘‘నీకు ఏం కావాలమ్మా?’’ అని ఆషిక్ అడిగినప్పుడు...‘‘నా దుస్తులు చిరిగిపోయాయి. వీలయితే అవి కొనివ్వు బాబు... అది చాలు’’ అంది. యాచించ కూడదనీ... మెర్లిన్ పరిస్థితి చూసి చలించిపోయిన ఆషిక్ మెర్లిన్‌కు చీర కొనిచ్చాడు. తరువాత...‘‘అమ్మ నువ్వు ఇంగ్లీష్ క్లాసులు చెప్పు. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తాను. ఒక్కో వీడియోకు డబ్బులు ఇస్తాను అని చెప్పాడు’’. మెర్లిన్ ఇంగ్లీష్ క్లాసులు చెప్పడానికి ఒప్పుకోవడంతో ఆమె చెప్పే పాఠాలు వీడియోలు తీసి ‘ఇంగ్లీష్ విత్ మెర్లిన్’ పేరుమీద ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేసి పోస్టు చేస్తున్నాడు. ఒక్కో వీడియోకు డబ్బులు ఇస్తూ మెర్లిన్ ఎవరి దగ్గరా చేయి చాచకుండా... తన కష్టార్జితంతో బతికేలా ఏర్పాట్లుచేశాడు ఆషిక్. తన విద్యార్థులసాయంతో... ఆషిక్ పోస్టు చేసిన మెర్లిన్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. వాటిని చూసిన వారిలో కొంతమంది మెర్లిన్ దగ్గర చదువుకున్న విద్యార్థులు ఉన్నారు. తమ టీచర్ పరిస్థితి ఇంత దారుణంగా ఉందా అని బాధపడుతూ మెర్లిన్‌ను వెతుక్కుంటూ వచ్చారు. దగ్గర కూర్చుని, ఫలానా వాళ్లమని పరిచయం చేసుకుని, అప్పడు ఇలా చేశాం, అలా చేశాం, మీరు ఇలా ఉండేవారంటూ మాట్లాడి ఆమెలో ఉత్సాహం నింపారు. కొంతమంది ఆమెతో వీడియో కాల్ చేసి మాట్లాడారు. అంతా కలిసి మెర్లిన్‌కు కష్టం కలగకుండా ఉండేందుకు, నలుగురి మధ్యలో ఉండేలా వృద్ధాశ్రమంలో చేర్చారు. అక్కడ ఆమెకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మెర్లిన్ ఎనభై ఏళ్ల వయసులో ఇంగ్లీష్ క్లాసులు చెబుతూ ఐదు లక్షలకు పైగా ఫాలోవర్స్‌తో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. మనం చేసే మంచి ఎప్పటికైనా ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుందనడానికి మెర్లిన్ జీవితమే ఉదాహరణగా నిలుస్తోంది. View this post on Instagram A post shared by Merlin (@englishwithmerlin) View this post on Instagram A post shared by Merlin (@englishwithmerlin) -
‘స్మార్ట్‌ఫోన్ - ఆవు’ కథనంపై షావోమి స్పందన
సాక్షి, ముంబై: కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ప్రాచుర్యంలోకి వచ్చిన పిల్లల ఆన్లైన్ చదువుల కోసం కుటుంబ పోషణకు ఆధారణమైన ఆవును అమ్ముకున్న వైనంపై ప్రముఖ మొబైల్ తయారీదారు షావోమి ఇండియా ఎండీ మను కుమార్ జైన్ స్పందించారు. హృదయాన్ని కదిలించే అంశమంటూ ఆ కుటుంబానికి సాయం అందించేందుకు జైన్ ముందుకొచ్చారు. వివరాలు షేర్ చేయాల్సిందిగా ట్వీట్ చేశారు.వారి పిల్లల విద్యాభ్యాసానికి సాయం చేస్తామని కూడా ప్రకటించారు. ఈ సందర్బంగా స్మార్ట్‌ఫోన్ నిత్యావసరమైన వస్తువుగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. ఆన్లైన్ చదువులు, వర్క్ ఫ్రం హోం లాంటి వాటికి స్మార్ట్‌ఫోన్ చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు నెటిజన్లు స్పందించడంతో షావోమి టీం బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులను అందించిందని జైన్ తెలిపారు. అలాగే బిడ్డల చదువుకు ఎలా సాయం చేయాలనేదానిపై చర్చిస్తున్నట్టు తెలిపారు. కాగా ఈ కథనంపై బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కూడా స్పందించిన సంగతి తెలిసిందే. (ఆ కథనంపై చలించిన సోనూసూద్) After my morning tweet, many people helped us with the contact details of the man who sold his cow to buy a #smartphone. Happy to share that @XiaomiIndia team met him & we've donated ration for his family. We're discussing how best to support his kids' education. 🙏#Xiaomi ❤️ https://t.co/xzBXAuTAyw pic.twitter.com/7woqATnD1h — Manu Kumar Jain (@manukumarjain) July 24, 2020 -
ఐఐటీల్లో ఫస్ట్ సెమిస్టర్ ఆన్లైన్లోనే!
సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభం నేపథ్యంలో ఐఐటీల్లో అన్ని కోర్సులకు సంబంధించిన ప్రథమ సెమిస్టర్‌ను ఆన్లైన్లోనే నిర్వహించాలని ఆరు ఐఐటీల డైరెక్టర్లతో కూడిన సబ్ కమిటీ సిఫారసు చేసింది. ఒకవేళ విద్యార్థులు వద్దనుకుంటే వారికి ఒక సెమిస్టర్ లేదా విద్యా సంవత్సరం ఆగిపోయేలా అవకాశమివ్వాలని పేర్కొంది. కరోనా తర్వాత ఐఐటీల్లో విద్యా కార్యక్రమాలు, పరీక్షలకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణపై అధ్యయనం చేసేందుకు ఐఐటీల కౌన్సిల్ స్టాడింగ్ కమిటీ ఏర్పాటు చేసిన ఈ సబ్ కమిటీ తమ నివేదికను అందజేసింది. దీనిపై త్వరలోనే ఐఐటీల కౌన్సిల్ స్టాడింగ్ కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటివరకు రెండేళ్లున్న పీజీ కోర్సులను 18 నెలలకు కుదించాలని పేర్కొంది. దానిని 3 రెగ్యులర్ సెమిస్టర్లకు లేదా ఇప్పుడున్న సెమిస్టర్ల పనిదినాలను కుదించి 4 సెమిస్టర్లుగా నిర్వహించాలని వెల్లడించింది. ల్యాబ్ కార్యక్రమాలను అన్నింటిని ఇప్పుడు రద్దు చేసి, 2021 వేసవిలో రెండు, మూడు వారాల ఇంటెన్సివ్ ప్రోగ్రాం నిర్వహించాలని వివరించింది. ఇక పీజీ కోర్సుల్లో చేరే విద్యార్థులకు డిసెంబర్లో లేదా వచ్చే జనరిలోనే విద్యా కార్యక్రమాలను ప్రారంభించాలని పేర్కొంది. కేవలం పీహెచ్డీ విద్యార్థులకు మాత్రమే అదీ ఆన్లైన్ సదుపాయం లేని వారిని పరిమితంగా క్యాంపస్‌లకు అనుమతించాలని వెల్లడించింది. ఇక బీటెక్ వంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో జేఈఈ షెడ్యూల్ ప్రకారం ప్రవేశాలు చేపట్టాలని పేర్కొంది. ప్రథమ, ద్వితీయ, తృతీయ సెమిస్టర్లలో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా బ్రాంచిని ఎంచుకునే అవకాశం కల్పించాలని తెలిపింది. 2019–20 విద్యా సంవత్సరపు రెండో సమిస్టర్ వారికి ఆన్లైన్లో పరీక్షలు ఇతరత్రా విద్యా కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొంది. ఇతర కోర్సుల్లోనూ ఫస్ట్ సెమిస్టర్ ఆన్లైన్లోనే! ఐఐటీలే కాకుండా ఇతర ఉన్నత విద్యా కోర్సుల్లోనూ ప్రవేశాలు, విద్యా కార్యక్రమాలు, పరీక్షలకు సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) జారీ చేసిన మార్గదర్శకాలను మరోసారి పరిశీలించి తగిన సిఫారసులు చేయాలని బుధవారం యూజీసీకి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ నిశాంక్ పోఖ్రియాల్ ట్విట్టర్లో సూచించారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యమిచ్చేలా తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఇటు దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌లో తరగతుల నిర్వహణ ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అన్ని కోర్సులకు సంబంధించి ప్రథమ సెమిస్టర్‌ను ఆన్లైన్లోనే నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నివేదికలోని ప్రధాన అంశాలు.. యూజీ ప్రథమ సెమిస్టర్ విద్యా కార్యక్రమాలు ఆన్లైన్లోనే నిర్వహించాలి. ఆన్లైన్ క్విజ్లు, ఆన్లైన్ పరీక్షలు వైవాల ద్వారా మూల్యాంకనం చేయాలి. విద్యార్థులకు ఇష్టం లేకపోతే సెమిస్టర్, విద్యా సంవత్సరం ఆపేసుకోవచ్చు పీజీ ప్రవేశాలు ఇప్పుడు నిలిపేయాలి. ఆన్లైన్ సెలెక్షన్స్ ఉండవు. పీజీ అకడమిక్ ఇయర్ డిసెంబర్లో లేదా జనవరిలోనే ప్రారంభించాలి. రెండేళ్ల పీజీని 18 నెలలకు కుదించాలి. ఎంబీఏ, సంబంధిత ఇతర కోర్సుల ప్రథమ సెమిస్టర్ల బోధనను ఆన్లైన్లో చేపట్టాలి. బీటెక్, ఎంటెక్ ప్రాజెక్టులను థియరీ విధానంలో, ఆన్లైన్ ద్వారా చేపట్టాలి. అక్టోబర్‌లో పరిస్థితిని మరోసారి సమీక్షించి నిర్ణయం తీసుకోవాలి. -
అభ్యర్థులకు ఉచిత అవగాహన
సూర్యాపేటటౌన్ : కానిస్టేబుల్ రాత పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు విజేత కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 28న పట్టణంలో ఉచిత అవగాహన తరగతులను నిర్వహిస్తున్నట్టు డైరెక్టర్ కల్లెట్లపల్లి యాదగిరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉచిత అవగాహన తరగతుల్లో నూతనంగా చేర్చిన తెలంగాణ చరిత్ర, జాగ్రఫీ తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్టు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.