ఐఐటీల్లో ఫస్ట్‌ సెమిస్టర్‌ ఆన్‌లైన్‌లోనే! | IIT Directors Panel Suggests First Semester Classes Conducted On Online | Sakshi
Sakshi News home page

ఐఐటీల్లో ఫస్ట్‌ సెమిస్టర్‌ ఆన్‌లైన్‌లోనే!

Published Thu, Jun 25 2020 1:12 AM | Last Updated on Thu, Jun 25 2020 1:12 AM

IIT Directors Panel Suggests First Semester Classes Conducted On Online - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా సంక్షోభం నేపథ్యంలో ఐఐటీల్లో అన్ని కోర్సులకు సంబంధించిన ప్రథమ సెమిస్టర్‌ను ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని ఆరు ఐఐటీల డైరెక్టర్లతో కూడిన సబ్‌ కమిటీ సిఫారసు చేసింది. ఒకవేళ విద్యార్థులు వద్దనుకుంటే వారికి ఒక సెమిస్టర్‌ లేదా విద్యా సంవత్సరం ఆగిపోయేలా అవకాశమివ్వాలని పేర్కొంది. కరోనా తర్వాత ఐఐటీల్లో విద్యా కార్యక్రమాలు, పరీక్షలకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణపై అధ్యయనం చేసేందుకు ఐఐటీల కౌన్సిల్‌ స్టాడింగ్‌ కమిటీ ఏర్పాటు చేసిన ఈ సబ్‌ కమిటీ తమ నివేదికను అందజేసింది. దీనిపై త్వరలోనే ఐఐటీల కౌన్సిల్‌ స్టాడింగ్‌ కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటివరకు రెండేళ్లున్న పీజీ కోర్సులను 18 నెలలకు కుదించాలని పేర్కొంది. దానిని 3 రెగ్యులర్‌ సెమిస్టర్లకు లేదా ఇప్పుడున్న సెమిస్టర్ల పనిదినాలను కుదించి 4 సెమిస్టర్లుగా నిర్వహించాలని వెల్లడించింది.

ల్యాబ్‌ కార్యక్రమాలను అన్నింటిని ఇప్పుడు రద్దు చేసి, 2021 వేసవిలో రెండు, మూడు వారాల ఇంటెన్సివ్‌ ప్రోగ్రాం నిర్వహించాలని వివరించింది. ఇక పీజీ కోర్సుల్లో చేరే విద్యార్థులకు డిసెంబర్‌లో లేదా వచ్చే జనరిలోనే విద్యా కార్యక్రమాలను ప్రారంభించాలని పేర్కొంది. కేవలం పీహెచ్‌డీ విద్యార్థులకు మాత్రమే అదీ ఆన్‌లైన్‌ సదుపాయం లేని వారిని పరిమితంగా క్యాంపస్‌లకు అనుమతించాలని వెల్లడించింది. ఇక బీటెక్‌ వంటి అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో జేఈఈ షెడ్యూల్‌ ప్రకారం ప్రవేశాలు చేపట్టాలని పేర్కొంది. ప్రథమ, ద్వితీయ, తృతీయ సెమిస్టర్లలో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా బ్రాంచిని ఎంచుకునే అవకాశం కల్పించాలని తెలిపింది. 2019–20 విద్యా సంవత్సరపు రెండో సమిస్టర్‌ వారికి ఆన్‌లైన్‌లో పరీక్షలు ఇతరత్రా విద్యా కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొంది.  

ఇతర కోర్సుల్లోనూ ఫస్ట్‌ సెమిస్టర్‌ ఆన్‌లైన్‌లోనే! 
ఐఐటీలే కాకుండా ఇతర ఉన్నత విద్యా కోర్సుల్లోనూ ప్రవేశాలు, విద్యా కార్యక్రమాలు, పరీక్షలకు సంబంధించి యూనివర్సిటీ ఆఫ్‌ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) జారీ చేసిన మార్గదర్శకాలను మరోసారి పరిశీలించి తగిన సిఫారసులు చేయాలని బుధవారం యూజీసీకి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ నిశాంక్‌ పోఖ్రియాల్‌ ట్విట్టర్‌లో సూచించారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యమిచ్చేలా తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఇటు దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌లో తరగతుల నిర్వహణ ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అన్ని కోర్సులకు సంబంధించి ప్రథమ సెమిస్టర్‌ను ఆన్‌లైన్‌లోనే నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

నివేదికలోని ప్రధాన అంశాలు.. 

  • యూజీ ప్రథమ సెమిస్టర్‌ విద్యా కార్యక్రమాలు ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలి.  
  • ఆన్‌లైన్‌ క్విజ్‌లు, ఆన్‌లైన్‌ పరీక్షలు వైవాల ద్వారా మూల్యాంకనం చేయాలి. 
  • విద్యార్థులకు ఇష్టం లేకపోతే సెమిస్టర్, విద్యా సంవత్సరం ఆపేసుకోవచ్చు 
  • పీజీ ప్రవేశాలు ఇప్పుడు నిలిపేయాలి. 
  • ఆన్‌లైన్‌ సెలెక్షన్స్‌ ఉండవు. పీజీ అకడమిక్‌ ఇయర్‌ డిసెంబర్‌లో లేదా జనవరిలోనే ప్రారంభించాలి. 
  • రెండేళ్ల పీజీని 18 నెలలకు కుదించాలి. ఎంబీఏ, సంబంధిత ఇతర కోర్సుల ప్రథమ సెమిస్టర్ల బోధనను ఆన్‌లైన్‌లో చేపట్టాలి. 
  • బీటెక్, ఎంటెక్‌ ప్రాజెక్టులను థియరీ విధానంలో, ఆన్‌లైన్‌ ద్వారా చేపట్టాలి. 
  • అక్టోబర్‌లో పరిస్థితిని మరోసారి సమీక్షించి నిర్ణయం తీసుకోవాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement