clean bold
-
Border-Gavaskar Trophy: ‘జడ్డూ’ తిప్పేశాడు...
న్యూఢిల్లీ: భారత్‌కు అచ్చొచ్చిన ఢిల్లీ వికెట్‌పై పర్యాటక జట్టే స్పిన్‌తో అల్లాడిస్తే... ఆతిథ్య జట్టు అంతకుమించే చేయాలి కదా! సరిగ్గా... టీమిండియా కూడా అదే చేసింది. ఒక్క సెషన్ అయినా పూర్తిగా ఆడనివ్వకుండానే ఆస్ట్రేలియాను ఆలౌట్ చేసింది. రవీంద్ర జడేజా (7/42) బిగించిన ఉచ్చులో ఆస్ట్రేలియా క్లీన్‌బౌల్డయింది. 31.1 ఓవర్లలోనే 113 పరుగులకే ఆ జట్టు కుప్పకూలింది. ఇందులో 12 ఓవర్లు, 61 పరుగులు క్రితం రోజువే కాగా... మూడో రోజు ఆసీస్ ఆడింది 19.1 ఓవర్లే! చేసింది కూడా 52 పరుగులే! అంటే సగటున ప్రతి రెండు ఓవర్లకు ఓ వికెట్‌ను సమర్పించుకుంది. అంతలా ప్రపంచ నంబర్‌వన్ టెస్టు జట్టు జడుసుకుంది. ‘జడ్డూ’ ఏకంగా ఐదుగురు బ్యాటర్లను బౌల్డ్ చేశాడు. అనంతరం 115 పరుగుల సులువైన లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 26.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసి గెలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో రెండు జట్ల బౌలర్లు ఎక్స్‌ట్రాలు ఇవ్వకపోవడం విశేషం. మ్యాచ్ మొత్తం లో పది వికెట్లు తీయడంతోపాటు కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన జడేజాకు వరుసగా రెండోసారీ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 2–0తో ఉన్న భారత్ ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ని తమ వద్దే అట్టిపెటుకుంది. క్రితంసారి కూడా భారతే గెలిచింది. ఇక ఈ సిరీస్‌లో మూడో టెస్టు మార్చి 1 నుంచి ఇండోర్‌లో జరుగుతుంది. ఇండోర్ టెస్టులోనూ భారత్ గెలిస్తే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా అర్హత సాధిస్తుంది. ఇలా మొదలై... అలా కూలింది! ఓవర్‌నైట్ స్కోరు 61/1తో ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా పతనం తొలి ఓవర్ నుంచే మొదలైంది. ఓపెనర్ హెడ్ (46 బంతుల్లో 43; 6 ఫోర్లు, 1 సిక్స్) అశ్విన్ బౌలింగ్‌లో ఒక బౌండరీ కొట్టి ఆఖరి బంతికి అవుటయ్యాడు. కాసేపటికే సీనియర్ బ్యాటర్ స్మిత్ (19 బంతుల్లో 9; 1 ఫోర్) కూడా అతని బౌలింగ్‌లోనే వికెట్ల ముందు దొరికాడు. తర్వాత జడేజా మాయాజాలం మొదలవడంతో కొత్తగా ఇంకెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. ఓవర్‌నైట్ బ్యాటర్ లబుషేన్ (50 బంతుల్లో 35; 5 ఫోర్లు) సహా స్వల్ప వ్యవధిలో క్యారీ (7), కమిన్స్ (0), లయన్ (8), కున్మన్ (0)లను జడేజా క్లీన్‌బౌల్డ్ చేశాడు. కచ్చితత్వం లేని స్వీప్ షాట్లు, అనవసరమైన రివర్స్ స్వీప్ షాట్లు ఆస్ట్రేలియన్ల కొంపముంచాయి. ప్రపంచంలో ఎక్కడైనా పేస్ బంతులు బ్యాటర్లను బెంబేలెత్తిస్తాయి. కానీ ఇక్కడ స్లో డెలివరీలకే విలవిలలాడారు. దీంతో ఆదివారం ఆటలో 9 వికెట్లు చేతిలో ఉన్న ఆసీస్ కనీసం 20 ఓవర్లయినా ఆడలేకపోయింది. అశ్విన్‌కు 3 వికెట్లు దక్కాయి. స్పిన్ తిరగడంతో భారత ప్రధాన సీమర్ మొహమ్మద్ సిరాజ్‌కు బంతిని అప్పగించాల్సిన అవసరమే రాలేదు. లంచ్ బ్రేక్ అనంతరం సులువైన లక్ష్యఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాధన్ ఆడాడు. కానీ కేఎల్ రాహుల్ (1) తన వైఫల్యం కొనసాగించాడు. 100వ టెస్టు ఆడుతున్న పుజారా (74 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు) కుదురుగా ఆడగా, మధ్యలో విరాట్ కోహ్లి (31 బంతుల్లో 20; 3 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (12)ల వికెట్లు కూలాయి. అప్పటికే టీమిండియా విజయతీరానికి దగ్గరవగా మిగతా లాంఛనాన్ని కోన శ్రీకర్ భరత్ (22 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి పుజారా పూర్తి చేశాడు. 27వ ఓవర్ వేసిన మర్పీ బౌలింగ్‌లో నాలుగో బంతిని పుజారా మిడ్ వికెట్ మీదుగా బౌండరీకి తరలించి భారత్‌ను గెలిపించాడు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 263; భారత్ తొలి ఇన్నింగ్స్: 262; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: ఉస్మాన్ ఖాజా (సి) శ్రేయస్ అయ్యర్ (బి) జడేజా 6; ట్రవిస్ హెడ్ (సి) శ్రీకర్ భరత్ (బి) అశ్విన్ 43; లబుషేన్ (బి) జడేజా 35; స్మిత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 9; రెన్షా (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 2; హ్యాండ్స్కాంబ్ (సి) కోహ్లి (బి) జడేజా 0; క్యారీ (బి) జడేజా 7; కమిన్స్ (బి) జడేజా 0; లయన్ (బి) జడేజా 8; మర్ఫీ (నాటౌట్) 3; కున్మన్ (బి) రవీంద్ర జడేజా 0; మొత్తం (31.1 ఓవర్లలో ఆలౌట్) 113. వికెట్ల పతనం: 1–23, 2–65, 3–85, 4–95, 5–95, 6–95, 7–95, 8–110, 9–113, 10–113. బౌలింగ్: అశ్విన్ 16–3–59–3, మొహమ్మద్ షమీ 2–0–10–0, రవీంద్ర జడేజా 12.1–1–42–7, అక్షర్ పటేల్ 1–0–2–0. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (రనౌట్) 31; కేఎల్ రాహుల్ (సి) అలెక్స్ క్యారీ (బి) లయన్ 1; చతేశ్వర్ పుజారా (నాటౌట్) 31; విరాట్ కోహ్లి (స్టంప్డ్) క్యారీ (బి) మర్ఫీ 20; శ్రేయస్ అయ్యర్ (సి) మర్ఫీ (బి) నాథన్ లయన్ 12; శ్రీకర్ భరత్ (నాటౌట్) 23; మొత్తం (26.4 ఓవర్లలో 4 వికెట్లకు) 118. వికెట్ల పతనం: 1–6, 2–39, 3–69, 4–88. బౌలింగ్: కున్మన్ 7–0–38–0, నాథన్ లయన్ 12–3–49–2, టాడ్ మర్ఫీ 6.4–2–22–1, ట్రవిస్ హెడ్ 1–0–9–0. 100: అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి ఆస్ట్రేలియాపై భారత్‌కిది 100వ విజయం. మూడు ఫార్మాట్లలో రెండు జట్ల మధ్య 273 మ్యాచ్‌లు జరిగాయి. ఆసీస్‌తో 104 టెస్టులు ఆడిన భారత్ 32 విజయాలు అందుకొని, 43 పరాజయాలు చవిచూసింది. ఒక మ్యాచ్ ‘టై’కాగా, 28 ‘డ్రా’గా ముగిశాయి. 143 వన్డేల్లో టీమిండియా 53 మ్యాచ్‌ల్లో గెలిచి, 80 మ్యాచ్‌ల్లో ఓడింది. 10 మ్యాచ్‌లు రద్దయ్యాయి. 26 టి20 మ్యాచ్‌ల్లో భారత్ 15 విజయాలు సాధించి, 10 మ్యాచ్‌ల్లో ఓడింది. ఒక మ్యాచ్ రద్దయింది. 25012: అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్ (టెస్టు, వన్డే, టి20)లలో కలిపి కోహ్లి సాధించిన పరుగులు (492 మ్యాచ్‌లు). సచిన్ (664 మ్యాచ్‌ల్లో 34, 357 పరుగులు) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయ క్రికెటర్ కోహ్లి కాగా... 25 వేల పరుగులు సాధించిన క్రికెటర్ల జాబితా లో కోహ్లి ఆరో స్థానంలో ఉన్నాడు. 8: సొంతగడ్డపై టెస్టుల్లో జడేజాకిది ఎనిమిదో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు. భారత్ తరఫున అనిల్ కుంబ్లే (9 సార్లు) ‘టాప్’లో ఉండగా, సచిన్ (8 సార్లు) సరసన జడేజా నిలిచాడు. సిరాజ్, కోహ్లి, భరత్, జడేజా, అక్షర్ పటేల్ -
అదరగొట్టిన చహర్: 4–1–13–4
టి20 మ్యాచ్‌ల్లో బౌలర్లు అదరగొట్టే సందర్భాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అయితే తాజా ఐపీఎల్ సీజన్లో మాత్రం బౌలర్ల హవా నడుస్తోంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ప్రధాన పేసర్ దీపక్ చహర్ తన వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో కేవలం 13 పరుగులిచ్చిన అతడు నాలుగు వికెట్లు తీశాడు. ఇందులో ఒక మెయిడెన్ కూడా ఉండటం విశేషం. అయితే ఈ నాలుగు వికెట్లను కూడా నాలుగు ప్రత్యేకమైన బంతులతో చహర్ దక్కించుకోవడం విశేషం. ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను ఇన్నింగ్స్ తొలి ఓవర్ నాలుగో బంతికి ఒక అద్భుతమైన అవుట్ స్వింగర్‌తో క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ రెండో బంతికి నకుల్ బాల్‌తో గేల్‌ను బోల్తా కొట్టించాడు. ఆ మరుసటి బంతికే పూరన్‌ను షార్ట్‌పిచ్ బాల్‌తో పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో చహర్ హ్యాట్రిక్ తీసేట్లు కనిపించాడు. నాలుగో బంతిని ఇన్‌స్వింగర్ వేయగా... అదికాస్తా షారుఖ్ ఖాన్ ప్యాడ్లను తాకింది. అవుట్ కోసం చహర్ అప్పీల్ చేయగా అంపైర్ తిరస్కరించాడు. దాంతో సీజన్లో తొలి హ్యాట్రిక్‌ను తీసే చాన్స్‌ను చహర్ మిస్ చేసుకున్నాడు. హాక్ఐలో బంతి వికెట్లపై నుంచి వెళ్తున్నట్లు కనిపించింది. ఆరో ఓవర్ రెండో బంతిని ఆఫ్‌స్టంప్ ఆవల ఊరిస్తూ వేయగా డ్రైవ్ చేసిన దీపక్ హుడా మిడాఫ్‌లో డు ప్లెసిస్ చేతికి చిక్కాడు. దాంతో చహర్ ఖాతాలో నాలుగో వికెట్ చేరింది. ఇక్కడ చదవండి: సూపర్ జడ్డూ.. ఇటు రనౌట్.. అటు స్టన్నింగ్ క్యాచ్ ఆర్సీబీ వదిలేసుకున్న ప్లేయర్.. ఇప్పుడు ఇరగదీస్తున్నాడు -
దీదీ నందిగ్రామ్‌లో క్లీన్‌బౌల్డ్: మోదీ
బర్ధమాన్: పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇన్నింగ్స్ ముగిసిందని బీజేపీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో సోమవారం ఆయన క్రికెట్ పరిభాషలో కాసేపు మాట్లాడారు. గడచిన నాలుగు విడతల ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు ఫోర్లు, సిక్సులు కొట్టారని, బీజేపీ సెంచరీ కొట్టేసిందని వ్యాఖ్యానించారు. సగం మ్యాచ్‌లోనే టీఎంసీని ప్రజలు ఊడ్చేశారన్నారు. ‘ఓటర్లు దీదీని నందిగ్రామ్‌లో క్లీన్‌బౌల్డ్ చేశారు. బెంగాల్లో ఆమె ఇన్నింగ్స్ ముగిసింది. ఆమె మొత్తం టీమ్‌ను కూడా గ్రౌండ్ నుంచి వెళ్లిపోవాలని ప్రజలు తేల్చేశారు’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఒక టీఎంసీ నాయకురాలు దళితులను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలతో బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల వారిని భిక్షగాళ్లు అని ఇటీవల టీఎంసీ మహిళానేత, ఆ పార్టీ తరఫున అభ్యర్థిగా ఉన్న సుజాత మోండల్ వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ‘దీదీ తనను తాను రాయల్ బెంగాల్ టైగర్ అని చెప్పుకుంటారు. ఆలాంటి టైగర్ అనుమతి లేకుండా పార్టీ నేత ఆ వ్యాఖ్యలు చేయగలరా? అలాంటి మాటలతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తుంది. మమత బెనర్జీ కనీసం ఆ వ్యాఖ్యలను ఖండించలేదు. క్షమాపణ చెప్పలేదు’ అన్నారు. దళితులను అవమానించి మమత పెద్ద తప్పు చేశారన్నారు. బంగ్లాదేశ్‌లో తాను మథువా సామాజిక వర్గానికి చెందిన సంస్కర్త హరిచంద్ ఠాకూర్ జన్మస్థలాన్ని సందర్శించడాన్ని మమత తప్పుబట్టారని మథువా వర్గం బలంగా ఉన్న కల్యానిలో జరిగిన సభలో ప్రధాని పేర్కొన్నారు. ఒక్కసారి అధికారం కోల్పోతే తిరిగి రాలేనన్న విషయం మమతకు అర్థమైందని వ్యాఖ్యానించారు. -
ఒకేరోజు 381 పరుగులు.. సాధ్యమయ్యేనా!
సాక్షి క్రీడా విభాగం: నాలుగో రోజు లీచ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్... ‘చెపాక్’ పిచ్ ఎలా ఉందో, ఎలా ఉండబోతోందో అనేదానికి ఇదో సూచిక! దాదాపు లెగ్‌స్టంప్‌పై పడిన బంతి అనూహ్యంగా టర్న్ తీసుకొని ఆఫ్‌స్టంప్‌ను తాకింది. రోహిత్ తన కాలును ముందుకు జరిపి డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఇప్పుడు ఇంగ్లండ్ తమ బౌలర్లకంటే కూడా పిచ్‌నే ఎక్కువగా నమ్ముకొని గెలుపుపై ఆశలు పెంచుకుంటోంది. ఇలాంటి స్థితిలో భారత జట్టు ఆఖరి రోజు ఎలాంటి వ్యూహం అనుసరించబోతోందో చూడాలి. ఒక్క రోజులో, అదీ టెస్టు మ్యాచ్ చివరి రోజు 381 పరుగులు చేయడం సాధ్యమేనా? ఓవర్‌కు 4.2 పరుగుల వేగంతో అదీ అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్‌పై చేయగలరా అనేదే ఆసక్తికరం. బ్రిస్బేన్ విజయం తర్వాత టీమిండియాలో ఆత్మవిశ్వాసం ఎంతో పెరిగిందనడంలో సందేహం లేదు. ఎలాంటి లక్ష్యం ముందున్నా బెదరకుండా సానుకూల దృక్పథంతో ఆడగలమనే నమ్మకాన్ని ఆ మ్యాచ్ కలిగించింది. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ పరిస్థితి మాత్రం అందుకు భిన్నం. అయితే ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ టెస్టులో భారత్ లక్ష్యం 328 పరుగులు. చివరి రోజు 324 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో పది వికెట్లూ ఉన్నాయి. సొంత మైదానం కాకపోయినా ఆ సమయానికి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. మంచి బౌన్స్‌తో షాట్లు ఆడేందుకు తగిన అవకాశం కూడా కనిపించింది. అన్నింటికి మించి పోరాడితే పోయేదేమీ లేదు అన్నట్లుగా రహానే బృందం సాహసం చేయగా, పంత్ ప్రత్యేక ఇన్నింగ్స్ జట్టును గెలిపించింది. ఇక్కడ మాత్రం ఇంగ్లండ్ చేతిలో ఓడితే అది అవమానకరంగా భావించే పరిస్థితి కాబట్టి రిస్క్ చేయడం కష్టం. దీనిని ‘డ్రా’గా ముగిస్తే చాలు, తర్వాతి మూడు టెస్టుల్లో చూసుకోవచ్చనే ఆలోచన సహజం. మరికొందరు తాజా పరిస్థితిని 2008లో ఇదే చెన్నైలో ఇంగ్లండ్‌పై భారత్ గెలిచిన టెస్టుతో పోలుస్తున్నారు. నాటి మ్యాచ్‌లో భారత్ విజయలక్ష్యం 387 పరుగులు కాగా... నాలుగో రోజే సెహ్వాగ్ (68 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 83) మెరుపులతో భారత్ 131 పరుగులు చేసేసింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై ఆఖరి రోజు మరో 256 పరుగులే అవసరమయ్యాయి కాబట్టి సచిన్ తదితరుల పని సులువైంది. కాబట్టి దానితో ఈ మ్యాచ్‌కు పోలికే లేదు. తాజాగా బంగ్లాదేశ్‌పై కైల్ మేయర్స్ అద్భుత బ్యాటింగ్‌తో వెస్టిండీస్ గెలిచిన టెస్టులో కూడా చివరి రోజు విండీస్ విజయానికి 285 పరుగులు చేయాల్సిన స్థితిలో ఆట మొదలు పెట్టింది. ఇలా చూస్తే ఒకే రోజు 381 పరుగులు దాదాపు అసాధ్యమే! అయితే సంకల్పానికి, పట్టుదలకు అడ్డంకి ఏముంటుంది. భారత్ కూడా తొలి బంతి నుంచి ‘డ్రా’ కోసం ప్రయత్నించకపోవచ్చు. బ్రిస్బేన్ తరహాలోనే ఒక ఎండ్‌ను పుజారా రక్షిస్తుంటే మరో ఎండ్‌లో వచ్చిన ప్రతీ బ్యాట్స్‌మన్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేయవచ్చు. ముఖ్యంగా పంత్ క్రీజ్‌లో ఉన్నంత వరకైనా గెలుపే లక్ష్యంగా టీమిండియా ముందుకు వెళుతుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా లేదు కాబట్టి పరుగులు ధారాళంగా రాకపోతే తమ డిఫెన్స్‌ను నమ్ముకొని ‘డ్రా’పై దృష్టి పెట్టగల శక్తిసామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయనేది వాస్తవం. ఇంగ్లండ్ కూడా ‘బ్రిస్బేన్’ భయంతోనే గెలుపు కాకపోయినా, ఓడకపోతే చాలనే స్థితిలోకి వెళ్లింది. భారత్‌కు ఎక్కువ ఓవర్లు అందుబాటులో ఉంచకుండా పరుగులు పెద్దగా రాకపోయినా రెండో ఇన్నింగ్స్‌ను సాగదీసింది. -
ఆహా ఏమి రుచి!
కోల్‌కతా: మైదానంలో పరుగుల సునామీ సృష్టించే విండీస్ ఓపెనర్ క్రిస్ గేల్... భారతీయ వంటకాల రుచికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ‘చింగిడి మచర్ మలై కరీ (కొబ్బరి నీళ్లతో చేసిన రొయ్యల కూర)తో విందు ఆరగించిన అతను మిస్తీ డోయ్, రసగుల్లా తిని ఫిదా అయిపోయాడు. రెండో టెస్టు కోసం ముంబై బయలుదేరే ముందు సాల్ట్‌లేక్ రెస్టారెంట్‌కు భోజనానికి వచ్చిన గేల్‌కు ప్రఖ్యాత బెంగాలీ వంటకాలను రుచి చూపెట్టారు. ప్రత్యేకంగా తయారు చేసిన రొయ్యల కూరను ఫోర్క్, కత్తితో తినడానికి ప్రయత్నించి విఫలమైన ఈ ఆల్‌రౌండర్ తర్వాత చేత్తో సుష్టుగా ఆరగించాడు. ‘భారత్‌లో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇక్కడి ప్రజలు తింటున్నట్లు మనం కూడా ప్రయత్నించాలి’ అని సరదాగా వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్ దిగ్గజం సచిన్‌కు కూడా చింగిడి మచర్ మలై కరీ అంటే చచ్చేంత ఇష్టం! -
సచిన్ (బి) మోహిత్ 5
లాహ్లి (రోహ్టక్): మొదటి మూడు బంతులు... పరుగులేమీ రాలేదు. నాలుగో బంతికి తన ట్రేడ్‌మార్క్ షాట్ స్ట్రెయిట్ డ్రైవ్‌తో ఫోర్... తర్వాతి రెండు బంతుల్లో మరో సింగిల్... ఏడో బంతికి క్లీన్‌బౌల్డ్!... ఇదీ తన ఆఖరి రంజీ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ ఇన్నింగ్స్ సాగిన తీరు. హర్యానా బౌలర్ మోహిత్ శర్మ ఆఫ్ స్టంప్‌పై వేసిన గుడ్ లెంగ్త్ బంతిని సచిన్ ముందుకొచ్చి డిఫెన్స్ ఆడబోయాడు. అయితే అనూహ్యంగా ఎక్కువ ఎత్తులో లేచిన బంతి బ్యాట్‌ను దాటి మాస్టర్ మోచేతికి తగులుతూ వికెట్లపై పడింది. అంతే... ఒక్కసారిగా లాహ్లి మైదానంలో నిశ్శబ్దం. క్రికెట్ దిగ్గజం ఆటను ప్రత్యక్షంగా చూద్దామని గత వారం రోజులుగా ఉత్సుకతతో ఎదురు చూసిన అభిమానులను సచిన్ ప్రదర్శన తీవ్రంగా నిరాశ పరచింది. ఆఖరి రంజీ మ్యాచ్ అంటూ భారీ స్థాయిలో హడావిడి జరిగినా సచిన్ తన ఆటతో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. రాణించిన మోహిత్‌శర్మ ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఫీల్డింగ్ ఎంచుకోగా, హర్యానా తమ తొలి ఇన్నింగ్స్‌లో 35.3 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. అభిషేక్ నాయర్ (4/38), జావేద్ ఖాన్ (2/12) ధాటికి జట్టు కుప్పకూలింది. పదో స్థానంలో బరిలోకి దిగిన మోహిత్ శర్మ (62 బంతుల్లో 49; 9 ఫోర్లు) ఒక్కడే పోరాడటంతో హర్యానా ఈ మాత్రం స్కోరు సాధించింది. అనంతరం ఆట ముగిసే సరికి ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 44 ఓవర్లలో 4 వికెట్లకు 100 పరుగులు చేసింది. 38/3 స్కోరుతో ఉన్న జట్టును రహానే (96 బంతుల్లో 44 బ్యాటింగ్; 8 ఫోర్లు) ఆదుకున్నాడు. మోహిత్‌కు 2 వికెట్లు దక్కాయి. గౌరవ వందనం.... మ్యాచ్ ప్రారంభానికి ముందు సచిన్‌కు ఘన సత్కారం జరిగింది. ఇక్కడి చౌదరి బన్సీలాల్ స్టేడియంలో రెండు జట్ల ఆటగాళ్లు ఇరు వైపులా నిలబడి మాస్టర్‌కు మైదానంలోకి స్వాగతం పలికారు. దాదాపు 8 వేల మంది అభిమానులు సచిన్ నామస్మరణతో ఈ చిన్న మైదానాన్ని హోరెత్తించారు. ఈ సందర్భంగా సచిన్‌కు హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ జ్ఞాపిక అందజేశారు. కపిల్‌దేవ్ సారధ్యంలో 1991లో ముంబైని ఓడించి రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన హర్యానా జట్టులోని అనేక మంది సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ‘రంజీ ప్రదర్శన ఒక్కటే సరిపోదు’ మరోవైపు... భారత జట్టుకు ఎంపికయ్యేందుకు రంజీ ట్రోఫీ ప్రదర్శన ఒక్కటే సరిపోదని సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. ‘రంజీలో బాగా ఆడితే ఒక ఆటగాడిపై అందరి దృష్టి పడవచ్చు. అయితే భారత జట్టుకు ఎంపికయ్యేందుకు అదొక్కటే ప్రామాణికం కాదు. జట్టు అవసరాలకు అనుగుణంగా అతను సరిపోతాడా అనేది కూడా ముఖ్యం’ అని మాస్టర్ వ్యాఖ్యానించాడు. రంజీ ప్రమాణాలను పెంచేందుకు నిరంతరం ప్రయత్నాలు కొనసాగాలని అతను అన్నాడు. 15 ఏళ్ల వయసులోనే తొలి రంజీ మ్యాచ్ ఆడిన సచిన్, అప్పటి బాంబే జట్టులో ఎనిమిది మంది టెస్టు క్రికెటర్లు ఉండటంతో తాను చాలా విషయాలు నేర్చుకోగలిగానని చెప్పాడు. 2000లో తమిళనాడుపై (సెమీఫైనల్లో) డబుల్ సెంచరీ చేసిన మ్యాచే తన రంజీ కెరీర్లో అత్యుత్తమని అతను చెప్పాడు. ‘చివర్లో రెండు వికెట్లు చేతిలో ఉండగా 42 పరుగులు చేయాల్సి ఉంది. ఆ 42 పరుగులు నేనొక్కడినే చేయడం ఇంకా గుర్తుంది’ అని మాస్టర్ గుర్తు చేసుకున్నాడు.