సచిన్ (బి) మోహిత్ 5 | Sachin Tendulkar scores 5 runs in his last ranji match | Sakshi
Sakshi News home page

సచిన్ (బి) మోహిత్ 5

Published Mon, Oct 28 2013 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM

సచిన్ (బి) మోహిత్ 5

సచిన్ (బి) మోహిత్ 5

లాహ్లి (రోహ్‌టక్): మొదటి మూడు బంతులు... పరుగులేమీ రాలేదు. నాలుగో బంతికి తన ట్రేడ్‌మార్క్ షాట్ స్ట్రెయిట్ డ్రైవ్‌తో ఫోర్... తర్వాతి రెండు బంతుల్లో మరో సింగిల్... ఏడో బంతికి క్లీన్‌బౌల్డ్!... ఇదీ తన ఆఖరి రంజీ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ ఇన్నింగ్స్ సాగిన తీరు. హర్యానా బౌలర్ మోహిత్ శర్మ  ఆఫ్ స్టంప్‌పై వేసిన గుడ్ లెంగ్త్ బంతిని సచిన్ ముందుకొచ్చి డిఫెన్స్ ఆడబోయాడు. అయితే అనూహ్యంగా ఎక్కువ ఎత్తులో లేచిన బంతి బ్యాట్‌ను దాటి మాస్టర్ మోచేతికి తగులుతూ వికెట్లపై పడింది. అంతే... ఒక్కసారిగా లాహ్లి మైదానంలో నిశ్శబ్దం. క్రికెట్ దిగ్గజం ఆటను ప్రత్యక్షంగా చూద్దామని గత వారం రోజులుగా ఉత్సుకతతో ఎదురు చూసిన అభిమానులను సచిన్ ప్రదర్శన తీవ్రంగా నిరాశ పరచింది. ఆఖరి రంజీ మ్యాచ్ అంటూ భారీ స్థాయిలో హడావిడి జరిగినా సచిన్ తన ఆటతో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.
 
 రాణించిన మోహిత్‌శర్మ
 ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఫీల్డింగ్ ఎంచుకోగా, హర్యానా తమ తొలి ఇన్నింగ్స్‌లో 35.3 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. అభిషేక్ నాయర్ (4/38), జావేద్ ఖాన్ (2/12) ధాటికి జట్టు కుప్పకూలింది. పదో స్థానంలో బరిలోకి దిగిన మోహిత్ శర్మ (62 బంతుల్లో 49; 9 ఫోర్లు) ఒక్కడే పోరాడటంతో హర్యానా ఈ మాత్రం స్కోరు సాధించింది. అనంతరం ఆట ముగిసే సరికి ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 44 ఓవర్లలో 4 వికెట్లకు 100 పరుగులు చేసింది. 38/3 స్కోరుతో ఉన్న జట్టును రహానే (96 బంతుల్లో 44 బ్యాటింగ్; 8 ఫోర్లు) ఆదుకున్నాడు. మోహిత్‌కు 2 వికెట్లు దక్కాయి.
 
 గౌరవ వందనం....
 మ్యాచ్ ప్రారంభానికి ముందు సచిన్‌కు ఘన సత్కారం జరిగింది. ఇక్కడి చౌదరి బన్సీలాల్ స్టేడియంలో రెండు జట్ల ఆటగాళ్లు ఇరు వైపులా నిలబడి మాస్టర్‌కు మైదానంలోకి స్వాగతం పలికారు. దాదాపు 8 వేల మంది అభిమానులు సచిన్ నామస్మరణతో ఈ చిన్న మైదానాన్ని హోరెత్తించారు. ఈ సందర్భంగా సచిన్‌కు హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ జ్ఞాపిక అందజేశారు. కపిల్‌దేవ్ సారధ్యంలో 1991లో ముంబైని ఓడించి రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన హర్యానా జట్టులోని అనేక మంది సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
 
 ‘రంజీ ప్రదర్శన ఒక్కటే సరిపోదు’
 మరోవైపు... భారత జట్టుకు ఎంపికయ్యేందుకు రంజీ ట్రోఫీ ప్రదర్శన ఒక్కటే సరిపోదని సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. ‘రంజీలో బాగా ఆడితే ఒక ఆటగాడిపై అందరి దృష్టి పడవచ్చు. అయితే భారత జట్టుకు ఎంపికయ్యేందుకు అదొక్కటే ప్రామాణికం కాదు. జట్టు అవసరాలకు అనుగుణంగా అతను సరిపోతాడా అనేది కూడా ముఖ్యం’ అని మాస్టర్ వ్యాఖ్యానించాడు.
 
 రంజీ ప్రమాణాలను పెంచేందుకు నిరంతరం ప్రయత్నాలు కొనసాగాలని అతను అన్నాడు. 15 ఏళ్ల వయసులోనే తొలి రంజీ మ్యాచ్ ఆడిన సచిన్, అప్పటి బాంబే జట్టులో ఎనిమిది మంది టెస్టు క్రికెటర్లు ఉండటంతో తాను చాలా విషయాలు నేర్చుకోగలిగానని చెప్పాడు. 2000లో తమిళనాడుపై (సెమీఫైనల్లో) డబుల్ సెంచరీ చేసిన మ్యాచే తన రంజీ కెరీర్‌లో అత్యుత్తమని అతను చెప్పాడు. ‘చివర్లో రెండు వికెట్లు చేతిలో ఉండగా 42 పరుగులు చేయాల్సి ఉంది. ఆ 42 పరుగులు నేనొక్కడినే చేయడం ఇంకా గుర్తుంది’ అని మాస్టర్ గుర్తు చేసుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement