అది ప్రభుత్వ అభిప్రాయమే
‘గుంటూరు-విజయవాడ మధ్యే రాజధాని’పై మంత్రి నారాయణ
సాక్షి, హైదరాబాద్: గుంటూరు-విజయవాడ నడుమ రాజధాని ఏర్పాటనేది ప్రభుత్వ అభిప్రాయం మాత్రమేనని, ఈ విషయాన్నే శివరామకృష్ణన్ కమిటీకి చెప్పినట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. రాష్ట్రానికి మధ్యలో ఉన్న ప్రాంతాలు కృష్ణా-గుంటూరు-పశ్చిమగోదావరి జిల్లాలేనన్నారు. శివరామకృష్ణన్ కమిటీతో రాష్ట్ర రాజధాని సలహా కమిటీ శనివారమిక్కడ సమావేశమైంది. భేటీ అనంతరం సచివాలయంలో నారాయణ విలేకరులతో మాట్లాడారు. దేశంలో నయా రాయ్పూర్, చండీగఢ్, గాంధీనగర్, భువనేశ్వర్, ఇతర దేశాల్లోని బ్రసీలియా(బ్రెజిల్), ఇస్లామాబాద్(పాకిస్తాన్), షాంఘై(చైనా), సింగపూర్, పుత్రజయ(మలేసియా)లను ఉత్తమ రాజధానులుగా గుర్తించామని, అధ్యయనానికి త్వరలో ఆ ప్రాంతాల్లో పర్యటిస్తామని తెలిపారు.
ఈ పర్యటనకయ్యే ఖర్చును సలహా కమిటీలో ఎవరికివారే భరించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రతి 15 రోజులకోసారి రాజధాని సలహా కమిటీ సమావేశమవుతుందన్నారు. రాజధాని అధ్యయనం మూడు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఈ విషయంలో 12 వారాలపాటు ఉచితంగా సేవలందించేందుకు మెకన్సీ కన్సల్టెన్సీ సంస్థ ముందుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు. భూమి, నీరు, సహజ వనరులు, రైలు, రోడ్డు, వాయు రవాణా అనుసంధానంతోపాటు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పురోగతి ఉండేలా సిఫార్సులు ఉంటాయన్నారు.