Cock fight betting
-
పండుగంటే భీమవరమే..
సాక్షి, అమరావతి: ట్వంటీ ట్వంటీ(2020) కోడి పందాలకు ఉభయ గోదావరి జిల్లాలు ‘బరి’ గీస్తున్నాయి. 2020 క్రికెట్ మ్యాచ్‌ను తలదన్నే రీతిలో ఉత్కంఠ రేపే ఈ పందాలకు జోరుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రత్యర్థి కోడిని గురి చూసి కొట్టేందుకు పందెంరాయుళ్లు తదేక దీక్షతో కసరత్తు చేస్తున్నారు. కోడి పందాలను అడ్డుకునేందుకు ప్రతి సంవత్సరం పోలీసులు గట్టి ప్రయత్నాలు చేయడం.. చివరికి చేతులెత్తేయడం పరిపాటిగా మారిపోయింది. ఈసారి పందాలను ఎలాగైనా అడ్డుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ముందస్తు బైండోవర్లు, హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ పందాల నిర్వాహకులు మాత్రం ధీమాగానే ఉన్నారు. తమ ఏర్పాట్లు తాము చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ సమయంలో మూడు రోజులపాటు జరిగే పందాలకు ఎప్పటిలాగే బరులు సిద్ధం చేస్తున్నారు. ఊరూవాడా దద్దరిల్లేలా.. సంక్రాంతికి నిర్వహించే కోడిపందాలే గోదావరి జిల్లాల్లో స్పెషల్ ఈవెంట్. గతంలో సరదా కోసం, సాంప్రదాయంగా కోళ్లను బరిలో దించేవారు. ఇప్పుడు బెట్టింగ్‌ల కోసం పందాలు నిర్వహించడం ఆనవాయితీగా మారిపోయింది. తొలినాళ్లలో సాంప్రదాయంగా మొదలైన కోడి పందాలు 1996 నుంచి రూపుమార్చుకున్నాయి. పెద్ద ఎత్తున బెట్టింగ్‌లకు తెరతీయడంతో ఏటా కోడి పందాల్లో రూ.కోట్లాది చేతులు మారుతున్నాయి. ఈసారి మరింత భారీగా పందాలు నిర్వహించేందుకు గోదావరి జిల్లాల్లో సన్నాహాలు చేస్తున్నారు. కోడి పందాలు చూడటానికి వచ్చిన ప్రజలు (ఫైల్) బంధుమిత్రులకు ప్రత్యేక ఏర్పాట్లు కోడి పందాలను చూసేందుకు బంధువులతోపాటు పొరుగు ప్రాంతాల్లోని మిత్రులు, ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు. ఇక్కడికి వచ్చే అతిథులు సైతం సంక్రాంతి ఎప్పుడొస్తుందా? అని ఉత్కంఠతో ఎదురు చూస్తుంటారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి రాజకీయ, సినీ ప్రముఖులతోపాటు పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. పండుగంటే భీమవరమే.. సంక్రాంతి సంబరాలు.. కోడి పందాలు అంటే వెంటనే గుర్తొచ్చేది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరమే. సంక్రాంతి సమయంలో రాజకీయ, పారిశ్రామిక రంగాలతోపాటు పలువురు ప్రముఖుల దృష్టి భీమవరంపైనే ఉంటుంది. ప్రతిఏటా పండుగకు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే అతిథుల్లో ఎక్కువ మంది భీమవరం వస్తుంటారు. కోడి పందాలు, సంక్రాంతి ప్రస్తావన వస్తే సినిమా, టీవీలతోపాటు పాటల్లోనూ భీమవరం ప్రస్తావన లేకుండా ఉండదంటే అతిశయోక్తి కాదు. మూడు రోజుల సంబరాలు.. ఖరీదైన కార్లు.. డబ్బుల మూటలు.. చంకలో కోడి పుంజులు.. పొలాల్లో షామియానాలు.. టెంట్లు.. కళ్లు మిరుమిట్లు గొలిపే ఫ్లడ్‌లైట్ల కాంతులు.. కత్తులు దూసే పందెం కోళ్లు.. బరుల చెంతనే పేకాట, గుండాట.. కోడి పకోడి, కోడి పలావ్‌లతో విందు.. విచ్చలవిడిగా మద్యం.. సేద తీరేందుకు ఘనమైన ఏర్పాట్లు. ఇదీ గోదావరి జిల్లాల్లో కనిపించే సంక్రాంతి సందడి. మూడు రోజులపాటు జరిగే ఈ సంబరాలకు ఏడాదంతా కసరత్తు జరుగుతుంది. ప్రత్యేకంగా పుంజులను ఎంపిక చేస్తారు. ఒక్కో పుంజు రూ.5 వేల నుంచి రూ.లక్షకుపైగా ధర పలుకుతుంది. పందెంలో గెలిచిన కోడి దర్జాగా యజమాని భుజం మీదకు చేరితే.. పోరాడి ఓడిన కోడి కూరగా మారిపోతుంది. పందెంలో ప్రాణాలు కోల్పోయిన కోడికి సైతం విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దీన్ని కూర వండి, బంధుమిత్రులకు పంపించడం గోదావరి జిల్లాల ప్రజలు స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు. -
కోడిపందెం శిబిరంపై పోలీసుల దాడి.. ఇద్దరు మృతి
సాక్షి, చిత్తపూరు : కృష్ణా జిల్లా చాట్రాయి మండలం చిత్తపూరు గొల్లగూడెంలో విషాదం చోటుచేసుకుంది. కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు కోడిపందెం శిబిరంపై దాడి చేశారు. పోలీసుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు నూతిలో పడిపోయి మృతిచెందారు. మృతులు చిట్టూరి శ్రీనివాసరావు(20), మేకల చెన్నకేశవరావు(26)గా గుర్తించారు. పండుగ రోజుల్లో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బరితెగింపు
యలమంచిలి, న్యూస్‌లైన్: శృతి మించి రాగాన పడుతోంది. పండగ సరదా పరాకాష్టకు చేరి పోలీసులపై దాడి వరకూ వెళ్తోంది. కోడి పందాల్లో రేగిన పౌరుషం మూకుమ్మడిగా గొడవ పడే స్థాయికి చేరుతోంది. పెద్ద పండగ వేళ, పందాలకు పగ్గాలు వేయాలన్న పోలీసులతో గ్రామస్తులు ఘర్షణ పడే వాతావరణం తలెత్తుతోంది. పరిస్థితి చేయి దాటకుండా గ్రామాల్లో పోలీసులను మోహరించాల్సి వస్తోంది. కోడిపందాలను అదుపు చేయాలన్న పోలీసుల ప్రయత్నాలకు ప్రతిఘటన ఎదురవుతోంది. కోడిపందాలరాయుళ్లు బరితెగిస్తూ ఉండడంతో వాతావరణం వేడెక్కుతోంది. పందాలు ఆపడానికి గ్రామాలకు వెళ్తున్న పోలీసులపై అక్కడివారు తిరగబడుతున్నారు. ఎదురుదాడులకు పాల్పడి పోలీసులనే హడలెత్తిస్తున్నారు. గురువారం యలమంచిలి మున్సిపాలిటీ పరిధి ఎర్రవరంలో ఇదే జరిగింది. ఎర్రవరాన్ని ఆనుకుని కొండకాలువ వద్ద కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో యలమంచిలి టౌన్ ఎస్ఐ చంద్రమౌళి, ట్రైనీ ఎస్ఐలు రామకృష్ణ, రవికుమార్, మరో నలుగురు హోంగార్డులు మఫ్టీలో వెళ్లారు. పోలీసులు నిక్కర్లు, లుంగీలు, తలపాగాలతో ఉండడంతో పందెంరాయుళ్లు కొద్దిసేపు వారిని గుర్తించలేదు. వెంటనే పోలీసులు దాడి చేశారు. దాంతో పందెంరాయుళ్లు చెల్లాచెదురయ్యారు. కొందరు గ్రామంలోకి పరుగులు తీశారు. పోలీసులు సంఘటన స్థలం వద్ద ఏడు కోళ్లను, నగదుతోపాటు నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు గ్రామంలోకి వెళ్లి వీడియో క్లిప్పింగ్ ఆధారంగా నడిగట్ల చిన్న అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు.అడ్డగించిన అతని భార్యను పోలీసులు నెట్టేయడంతో గ్రామస్తులు మూకుమ్మడిగా ఎదురుదాడికి దిగారు. దుర్భాషలాడారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామస్తుల దాడిలో పోలీసులకు స్వల్పగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న యలమంచిలి సీఐ మల్లేశ్వరరావు సమైక్యాంధ్ర విధుల్లో ఉన్న సాయుథ బలగాలను ఎర్రవరానికి పంపారు. పోలీసులు పెద్ద ఎత్తున రావడంతో గ్రామస్తులు చెల్లాచెదురయ్యారు. ఈ సంఘటనను టౌన్ ఎస్ఐ సెల్ఫోన్లో వీడియో తీశారు. ఆ చిత్రాల ఆధారంగా దాడిచేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామానికి చెందిన పొన్నాడ రమణ, సోరంగి చిన్నలను యలమంచిలి టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్ వద్ద జనం జరిగిన సంఘటనపై నర్సీపట్నం ఏఎస్పీ విశాల్ గున్ని టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సాయంత్రం విచారణ జరిపారు. ఈ సంఘటనకు సంబంధించి ముత్తు గోవిందు, నడిగట్ల దుర్గతోపాటు మరో 18 మందిని వీడియో క్లిప్పింగ్‌ల ఆధారంగా గుర్తించినట్టు సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. రమణ, చిన్నలను అరెస్టు చేశామని మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. గ్రామస్తుల దాడి సంఘటనపై ఎస్ఐలు రాతపూర్వకంగా యలమంచిలి సీఐకి ఫిర్యాదుచేశారు. దీంతో ఎర్రవరం గ్రామస్తులు పెద్ద ఎత్తున యలమంచిలి టౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. బుధ వారం రాంబిల్లి మండలం గజిరెడ్డిపాలెంలోనూ ఇలాగే జరిగింది. అక్కడ పోలీసులపై దాడిచేసిన 14 మందిపై కేసులు నమోదు చేశారు. కోడిపందాలు, పేకాటలు నియంత్రించడానికి నర్సీపట్నం ఏఎస్పీ విశాల్ గున్ని ముందస్తు వ్యూహంతో మూడురోజులుగా ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహించడం సత్ఫలితాలనిస్తోంది. యలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాల్లోనే మూడురోజుల్లో 239 మంది పందెంరాయుళ్లను అరెస్టు చేసి రూ.3 లక్షలవరకు నగదును స్వాధీనం చేసుకున్నారు. -
పందేల జాతర
సాక్షి, మచిలీపట్నం : సంక్రాంతి సమయంలో సంప్రదాయం ముసుగులో సాగుతున్న జూదక్రీడలో పోలీస్ పరువుకు కోళ్ల కత్తిగాట్లు తప్పడం లేదు. చివరి నిమిషం వరకు బెట్టుచేస్తున్న పోలీసులు పండగ మూడు రోజులు ఉన్నత స్థాయి ఒత్తిళ్లకు సెల్యూట్ చేయడంతో ప్రజల్లో వారి ఇమేజ్ పలుచనవుతోంది. ఈసారి పోలీసులు పట్టుబిగించడంతో కాస్త ఆలస్యంగానే కోడిపందేలు మొదలైనా అనుమతి ముగిసిన తర్వాత కూడా కొనసాగడం శోచనీయం. మౌఖిక అనుమతితో పందేలు, పేకాటలు సాగాయి. బుధవారం సాయంత్రంతో పందేలు నిలిపివేయాలని పోలీసులు చెప్పినా గురువారం కూడా జూదాలు కొనసాగడం గమనార్హం. దీనివెనుక పోలీసుల లోపాయికారీ అనుమతి ఉందన్న ప్రచారం సాగింది. జిల్లాలో కొన్నిచోట్ల పందేలు నిలిపివేసిన పోలీసులు.. మరికొన్నచోట్ల మామూళ్లు తీసుకుని అనుమతి ఇచ్చారన్న దుమారం రేగింది. ఒక మండలంలో ఎస్.ఐ., సి.ఐ.లకు మామూళ్లు ఇచ్చిన నిర్వాహకులు పెద్దఎత్తున కోడిపందేలు నిర్వహించడంతో డీఎస్పీ తన సిబ్బందితో వెళ్లి పందెపురాయుళ్లను చెదరగొట్టారు. దీంతో దిగువస్థాయి పోలీసు అధికారులకు మామూళ్లు ఇచ్చి ఆయనకు ఇవ్వలేదనే అక్కసుతో ఇలా కోడిపందాలను అడ్డుకున్నారని నిర్వాహకులే ప్రచారం చేశారు. గూడూరు మండలంలోని పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున కొనసాగిన పేకాటలను అడ్డుకోకుండా పోలీసులకు ముడుపులు ముట్టజెప్పినట్టు నిర్వాహకులే బాహాటంగా వ్యాఖ్యలు చేశారు. యథావిధిగా పందేలు.. సరిహద్దున ఉన్న ఖమ్మం, పశ్చిమగోదావరి, గుంటూరు, నల్గొండ ప్రాంతాల్లో జరిగిన కోడిపందేలకు నిన్నటి వరకు వెళ్లిన జూదాల రాయుళ్లు గురువారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పందేలను కొనసాగించారు. గురువారం సాయంత్రం 6 గంటల వరకు పందేల నిర్వహణకు అనుమతి ఉందన్న ప్రచారంతో జూదాలు జడలు విప్పాయి. చల్లపల్లి మండలం పాగోలు, మంగళాపురం గ్రామాల్లోను, ఘంటసాల మండలం శ్రీకాకుళం, మొవ్వ మండలం కారకంపాడు, భట్లపెనుమర్రు, పెడనసగల్లులోను పందేలు వేశారు. పామర్రు ప్రాంతంలోని నెలకూరులో పందేలపై పోలీసుల దాడులు జరిపారు. పామర్రు మండలం బలిపర్రు, గుడివాడ మండలంలోని పలు ప్రాంతాల్లోను చాటుమాటుగా జూదాలు కొనసాగాయి. గూడూరు మండలం రామన్నపేట, పోసినవారిపాలెం, నిడుమోలు ప్రాంతాల్లో జోరుగా సాగాయి. కాజ-రాయవరం పొలాల దిబ్బలపై పెద్దఎత్తున పేకాటలు నిర్వహించారు. జగ్గయ్యపేట ప్రాంతంలోని ముక్త్యాల, పెడన నియోజకవర్గంలో చాటుమాటుగా కోడిపందేలు జరిగాయి. బందరు మండలం పోలాటితిప్ప, చిన్నాపురం ప్రాంతాల్లోనూ పందేలు వేశారు. గూడూరు-బందరు మండలాల సరిహద్దుల్లో గంటలమ్మవారిపాలెంలో మూడు రోజులుగా పేకాట శిబిరం నిర్వహిస్తున్నారు. అటువైపు కన్నెత్తి చూడకుండా రోజుకు రూ.30వేలు చొప్పున పోలీసులకు మామూళ్లు ఇచ్చినట్టు చెబుతున్నారు. ఒకవేళ పోలీసులు వస్తే సమాచారం ఇచ్చేందుకు పొలాలు, రోడ్డు పక్కన ఇన్ఫార్మర్లను ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులు జూదాల జాతరను కొనసాగించారు. ఒక్కోచోట ఒక్కో తీరు.. జిల్లాలో పోలీసులు మరింత అభాసుపాలు కావడానికి వారి వ్యవహారశైలే కారణమని చెబుతున్నారు. సంక్రాంతి మూడు రోజులు అనుమతి ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది జిల్లా అంతటా ఒకే పద్ధతి అవలంభిస్తే వారికి కొంతైనా పరువు దక్కేది. విజయవాడ నగర పోలీసులు తమ పరిధిలో కోడి ఎగరకుండా హడావుడి చేశారు. తీరా జిల్లాలో పందేల విషయంలో ఒక్కోచోట ఒక్కో తీరుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలోని ఒకటి, రెండు నియోజకవర్గాల్లో అసలు పందేలు జరగకుండా పోలీసులు జాగ్రత్త పడితే, మిగిలిన చోట్ల గేట్లు ఎత్తేశారు. మరికొన్ని చోట్ల గురువారం కూడా కొనసాగడం మరింత విమర్శలకు కారణమైంది. మొవ్వ మండలంలో సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి బరిలో ఉండడంతో పోలీసులు అటువైపు చూసే సాహసం చేయలేకపోయారు. -
అయ్యయ్యో.. డబ్బులు మొత్తం పోయెనె!
భీమవరం, న్యూస్‌లైన్ :సంక్రాంతి సంప్రదాయం ముసుగులో సాగిన కోడిపందాల బరుల్లో జూదం పడగవిప్పింది. కోట్లాది రూపాయలను తన్నుకుపోయింది. పండగ మూడురోజులూ ముక్కలాట, గుండాట, కోతాట వంటి జూదాలను పెద్దఎత్తున నిర్వహించారు. వీటి బారినపడి వేలాదిమంది ఇల్లు గుల్ల చేసుకున్నారు. భీమవరం పరిసర ప్రాంతాల్లో రూ.100 కోట్లకు పైగా జూదక్రీడలు తన్నుకుపోయూయి. బహిరంగంగా నిర్వహిం చిన గుండాట, కోతాట, ముక్కలాటల్లో ఎక్కువ శాతం మంది యువకులు పాల్గొన్నారు. అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వ్యక్తిగతంగా ఎవరికి వారు వేలాది రూపాయలను పణంగా పెట్టి నష్టపోయూరు. డెల్టాతోపాటు మెట్ట ప్రాంతంలోనూ జూదాల జోరు కనిపించింది. మరోవైపు భీమవరం పట్టణంలోని లాడ్జిలు, క్లబ్బులు, ప్రైవేటు అతిథి గృహాలు, అపార్ట్మెంట్లు, గ్రామాల్లోని చేపల చెరువుల వద్ద గల ఫామ్ హౌస్‌లు పేకాట, ఇతర జూద క్రీడలకు వేదికగా మారారుు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం నుంచి వచ్చిన ఒక బృందం భీమవరం ప్రాంతంలో కోతాట ఆడి మూడు రోజుల్లో రూ.1.20 కోట్లను చేజార్చుకున్నట్టు తెలిపింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక వ్యాపారవేత్త పేకాటలో రూ.70 లక్షలు సమర్పించుకుని వెళ్లినట్టు సమాచారం. భీమవరం సమీపంలోని ఒక గ్రామంలో చేపల చెరువు వద్ద గల అతిథి గృహంలో సాగిన పేకాటలో హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ ఎన్ఆర్ఐ రూ.30 లక్షలను పోగొట్టుకుని రాత్రికి రాత్రే తిరుగు ముఖం పట్టారు. -
గోదా‘బరి’లో సిటీ పుంజులు
ఉభయ గోదావరి జిల్లాల నుంచి సాక్షి సిటీబ్యూరో ప్రతినిధి : సంక్రాంతి పండగ అంటే.. రంగవల్లికలు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులే కాదు.. కోడి పందేలు కూడా. అవునన్నా.. కాదన్నా.. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరినీ ఆకర్షించే పోటీలివి. పండగ సెలవుల నేపథ్యంలో జంట నగరాల్లోని అధిక శాతం వాహనాలు కోడి పందేలకు నెలవైన ఉభయ గోదావరి జిల్లాల వైపు పరుగులు తీశాయి. అక్కడ ఏ బంకిణీ (కోడి పందేలు జరిగే స్థలం) పార్కింగ్‌లో చూసినా సిటీ, శివార్ల వాహనాలు ఇబ్బడిముబ్బడిగా కనిపించాయి. పోలీసులు ఎన్ని చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా... నగరానికి చెందిన పందెంరాయుళ్లు ‘పోర్టర్ల’ సాయంతో కోళ్లను పోలీసు కళ్ల నుంచి తప్పించి, బంకిణీల వద్దకు చేరుకున్నారు. ఆ ప్రాంతాల్లో ఇక్కడి వాహనాలే... సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఉభయ గోదావరి జిల్లాలోని అనేక ఎంపిక చేసిన ప్రాంతాల్లో కోడి పందేలు, జూదం నిర్వహించారు. కృష్ణా జిల్లా సరిహద్దుల్లో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఈసారి బంకిణీలు ఏర్పాటు చేశారు. అటు తూర్పుగోదావరి జిల్లాలోనూ ఇవి వెలిశాయి. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు సమీపంలో ఉన్న ఐ భీమవరం బంకిణీలో భారీ సందడి కనిపించింది. దీనికి సమీపంలో ఉన్న చెరుకుమిల్లితో పాటు గుడివాడ-భీమవరం మార్గంలో ఉన్న కాళ్ల, జువ్వలపాలెంల్లోనూ కొన్ని బంకిణీలు జనాలతో నిండిపోయాయి. వెంప, భీమవరం, కొప్పాడ, పత్తేపురం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, తాడేపల్లిగూడెంల్లోనూ జోరుగా కోడి పందేలు జరిగాయి. ఈ బంకిణీలకు కిలోమీటర్ల దూరం నుంచే రహదారికి ఇరుపక్కలా కార్లు, ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసి కనిపించాయి. దీని చుట్టుపక్కల ఉన్న పొలాలు, ఖాళీ స్థలాలు సైతం వెహికిల్స్‌తో నిండిపోయాయి. వీటిలో అత్యధికం ‘9, 10, 11, 28, 29’ రిజిస్ట్రేషన్లతో కూడినవే ఉన్నాయి. జంట నగరాలతో పాటు రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారూ తమ వాహనాల్లో అత్యధికంగా వచ్చినట్లు దీన్నిబట్టి స్పష్టమైంది. ఈ వాహనాల్లో బీఎమ్‌డబ్ల్యూ, జైలో, వోక్స్వ్యాగన్ వంటి హైఎండ్ కార్లే ఎక్కువగా కనిపించాయి. కొందరు నగరవాసులు తమ కుటుంబాలతో సహా పయనమై ఉభయ గోదావరి జిల్లాల్లోని బంకిణీల వద్దకు చేరుకున్నారు. అక్కడ పురుషులు పందాల్లో మునిగిపోగా... మహిళలు, యువతులు ఆ ప్రాంతాలను ఆసక్తిగా గమనిస్తూ పందెంలో చనిపోయిన కోళ్లతో చేసిన పకోడీని ఆస్వాదించారు. ఈ పకోడి కోసం బంకిణీల్లో ప్రత్యేకంగా స్టాల్స్ కూడా వెలిశాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు బంకిణీల్లో నిరాటంకంగా పందాలు కొనసాగాయి. చెక్ పోస్టులకు దీటుగా ‘పోర్టర్లు’ కోడి పందాలను అడ్డుకునే వ్యూహంలో భాగంగా కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన పోలీసులు ప్రధాన రహదారులతోపాటు బంకిణీలకు దారితీసే మార్గాల్లోనూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం నుంచి వాహనాలను తనిఖీ చేస్తూ కోడి పుంజులు, నగదుతో వెళ్తున్న వారిని అదుపులోకి తీసుకోవడం ప్రారంభించారు. అయితే వీరి తనిఖీలకు ఇతర ప్రాంతాల వారు చిక్కకుండా ఉండేందుకు స్థానికుల్లో కొందరు యువకులు ‘పోర్టర్ల’ అవతారం ఎత్తారు. ఒక్కో పుంజుకు రూ.200 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తూ దొడ్డిదారిన బంకిణీ వద్దకు చేర్చడం ప్రారంభించారు. చెక్ పాయింట్లకు కాస్త దూరంలో ప్రధాన రహదారిపై కాపు కాస్తున్న ఈ పోర్టర్లు ఆ దారిలో వస్తున్న వాహనాల్లో ఇతర ప్రాంతాలు, ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వాటిని గుర్తించడం మొదలెట్టారు. అందులోని వారికి చెక్‌పాయింట్ విషయం చెప్తూ అప్రమత్తం చేశారు. పుంజుతో వెళ్తే పోలీసులు పట్టుకుంటారని, దాన్ని తమకు అప్పగిస్తే అడ్డదారుల్లో బంకిణీ వద్దకు చేరుస్తామని చెప్పి నిర్ణీత మొత్తం డిమాండ్ చేశారు. అంగీకరించిన వారి నుంచి నగదు, పుంజును తీసుకుని బంకిణీ వద్దకు వచ్చిన తరవాత ఫోన్‌తో సంప్రదించి వారికి అందించారు. ఈ రకంగా స్థానిక యువ త పోర్టర్లుగా మారి చెక్‌పోస్టులతో ఫలితం లేకుండా చేశారు. మొత్తానికి ఉభయ గోదావరి జిల్లాలోని పలు చోట్ల నగరవాసుల సందడి కనిపించింది.