పండుగంటే భీమవరమే..  | Arrangements in the Godavari districts for the sankranti Cock Fighting Bets | Sakshi
Sakshi News home page

బరి గీసి.. గురి చూసి

Published Sun, Jan 12 2020 5:45 AM | Last Updated on Sun, Jan 12 2020 4:13 PM

Arrangements in the Godavari districts for the sankranti Cock Fighting Bets - Sakshi

బరిలో కోడి పుంజులు (ఫైల్‌)

సాక్షి, అమరావతి: ట్వంటీ ట్వంటీ(2020) కోడి పందాలకు ఉభయ గోదావరి జిల్లాలు ‘బరి’ గీస్తున్నాయి. 2020 క్రికెట్‌ మ్యాచ్‌ను తలదన్నే రీతిలో ఉత్కంఠ రేపే ఈ పందాలకు జోరుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రత్యర్థి కోడిని గురి చూసి కొట్టేందుకు పందెంరాయుళ్లు తదేక దీక్షతో కసరత్తు చేస్తున్నారు. కోడి పందాలను అడ్డుకునేందుకు ప్రతి సంవత్సరం పోలీసులు గట్టి ప్రయత్నాలు చేయడం.. చివరికి చేతులెత్తేయడం పరిపాటిగా మారిపోయింది. ఈసారి పందాలను ఎలాగైనా అడ్డుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ముందస్తు బైండోవర్లు, హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ పందాల నిర్వాహకులు మాత్రం ధీమాగానే ఉన్నారు. తమ ఏర్పాట్లు తాము చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ సమయంలో మూడు రోజులపాటు జరిగే పందాలకు ఎప్పటిలాగే బరులు సిద్ధం చేస్తున్నారు. 

ఊరూవాడా దద్దరిల్లేలా.. 
సంక్రాంతికి నిర్వహించే కోడిపందాలే గోదావరి జిల్లాల్లో స్పెషల్‌ ఈవెంట్‌. గతంలో సరదా కోసం, సాంప్రదాయంగా కోళ్లను బరిలో దించేవారు. ఇప్పుడు బెట్టింగ్‌ల కోసం పందాలు నిర్వహించడం ఆనవాయితీగా మారిపోయింది. తొలినాళ్లలో సాంప్రదాయంగా మొదలైన కోడి పందాలు 1996 నుంచి రూపుమార్చుకున్నాయి. పెద్ద ఎత్తున బెట్టింగ్‌లకు తెరతీయడంతో ఏటా కోడి పందాల్లో రూ.కోట్లాది చేతులు మారుతున్నాయి. ఈసారి మరింత భారీగా పందాలు నిర్వహించేందుకు గోదావరి జిల్లాల్లో సన్నాహాలు చేస్తున్నారు.
కోడి పందాలు చూడటానికి వచ్చిన ప్రజలు (ఫైల్‌) 

బంధుమిత్రులకు ప్రత్యేక ఏర్పాట్లు 
కోడి పందాలను చూసేందుకు బంధువులతోపాటు పొరుగు ప్రాంతాల్లోని మిత్రులు, ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు. ఇక్కడికి వచ్చే అతిథులు సైతం సంక్రాంతి ఎప్పుడొస్తుందా? అని ఉత్కంఠతో ఎదురు చూస్తుంటారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి రాజకీయ, సినీ ప్రముఖులతోపాటు పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. 

పండుగంటే భీమవరమే.. 
సంక్రాంతి సంబరాలు.. కోడి పందాలు అంటే వెంటనే గుర్తొచ్చేది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరమే. సంక్రాంతి సమయంలో రాజకీయ, పారిశ్రామిక రంగాలతోపాటు పలువురు ప్రముఖుల దృష్టి భీమవరంపైనే ఉంటుంది. ప్రతిఏటా పండుగకు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే అతిథుల్లో ఎక్కువ మంది భీమవరం వస్తుంటారు. కోడి పందాలు, సంక్రాంతి ప్రస్తావన వస్తే సినిమా, టీవీలతోపాటు పాటల్లోనూ భీమవరం ప్రస్తావన లేకుండా ఉండదంటే అతిశయోక్తి కాదు.   

మూడు రోజుల సంబరాలు.. 
ఖరీదైన కార్లు.. డబ్బుల మూటలు.. చంకలో కోడి పుంజులు.. పొలాల్లో షామియానాలు.. టెంట్లు.. కళ్లు మిరుమిట్లు గొలిపే ఫ్లడ్‌లైట్ల కాంతులు.. కత్తులు దూసే పందెం కోళ్లు.. బరుల చెంతనే పేకాట, గుండాట.. కోడి పకోడి, కోడి పలావ్‌లతో విందు.. విచ్చలవిడిగా మద్యం.. సేద తీరేందుకు ఘనమైన ఏర్పాట్లు. ఇదీ గోదావరి జిల్లాల్లో కనిపించే సంక్రాంతి సందడి. మూడు రోజులపాటు జరిగే ఈ సంబరాలకు ఏడాదంతా కసరత్తు జరుగుతుంది. ప్రత్యేకంగా పుంజులను ఎంపిక చేస్తారు. ఒక్కో పుంజు రూ.5 వేల నుంచి రూ.లక్షకుపైగా ధర పలుకుతుంది. పందెంలో గెలిచిన కోడి దర్జాగా యజమాని భుజం మీదకు చేరితే.. పోరాడి ఓడిన కోడి కూరగా మారిపోతుంది. పందెంలో ప్రాణాలు కోల్పోయిన కోడికి సైతం విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. దీన్ని కూర వండి, బంధుమిత్రులకు పంపించడం గోదావరి జిల్లాల ప్రజలు స్టేటస్‌ సింబల్‌గా భావిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement