గోదా‘బరి’లో సిటీ పుంజులు | city cocks in godavari field | Sakshi
Sakshi News home page

గోదా‘బరి’లో సిటీ పుంజులు

Published Thu, Jan 16 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM

గోదా‘బరి’లో సిటీ పుంజులు

గోదా‘బరి’లో సిటీ పుంజులు

ఉభయ గోదావరి జిల్లాల నుంచి సాక్షి సిటీబ్యూరో ప్రతినిధి : సంక్రాంతి పండగ అంటే.. రంగవల్లికలు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులే కాదు.. కోడి పందేలు కూడా. అవునన్నా.. కాదన్నా.. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరినీ ఆకర్షించే పోటీలివి. పండగ సెలవుల నేపథ్యంలో జంట నగరాల్లోని అధిక శాతం వాహనాలు కోడి పందేలకు నెలవైన ఉభయ గోదావరి జిల్లాల వైపు పరుగులు తీశాయి.

అక్కడ ఏ బంకిణీ (కోడి పందేలు జరిగే స్థలం) పార్కింగ్‌లో చూసినా సిటీ, శివార్ల వాహనాలు ఇబ్బడిముబ్బడిగా కనిపించాయి. పోలీసులు ఎన్ని చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా... నగరానికి చెందిన పందెంరాయుళ్లు ‘పోర్టర్ల’ సాయంతో కోళ్లను పోలీసు కళ్ల నుంచి తప్పించి, బంకిణీల వద్దకు చేరుకున్నారు.

 ఆ ప్రాంతాల్లో ఇక్కడి వాహనాలే...
 సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఉభయ గోదావరి జిల్లాలోని అనేక ఎంపిక చేసిన ప్రాంతాల్లో కోడి పందేలు, జూదం నిర్వహించారు. కృష్ణా జిల్లా సరిహద్దుల్లో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఈసారి బంకిణీలు ఏర్పాటు చేశారు. అటు తూర్పుగోదావరి జిల్లాలోనూ ఇవి వెలిశాయి. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు సమీపంలో ఉన్న ఐ భీమవరం బంకిణీలో భారీ సందడి కనిపించింది.

 దీనికి సమీపంలో ఉన్న చెరుకుమిల్లితో పాటు గుడివాడ-భీమవరం మార్గంలో ఉన్న కాళ్ల, జువ్వలపాలెంల్లోనూ కొన్ని బంకిణీలు జనాలతో నిండిపోయాయి. వెంప, భీమవరం, కొప్పాడ, పత్తేపురం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, తాడేపల్లిగూడెంల్లోనూ జోరుగా కోడి పందేలు జరిగాయి. ఈ బంకిణీలకు కిలోమీటర్ల దూరం నుంచే రహదారికి ఇరుపక్కలా కార్లు, ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసి కనిపించాయి. దీని చుట్టుపక్కల ఉన్న పొలాలు, ఖాళీ స్థలాలు సైతం వెహికిల్స్‌తో నిండిపోయాయి. వీటిలో అత్యధికం ‘9, 10, 11, 28, 29’ రిజిస్ట్రేషన్లతో కూడినవే ఉన్నాయి.

జంట నగరాలతో పాటు రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారూ తమ వాహనాల్లో అత్యధికంగా వచ్చినట్లు దీన్నిబట్టి స్పష్టమైంది. ఈ వాహనాల్లో బీఎమ్‌డబ్ల్యూ, జైలో, వోక్స్‌వ్యాగన్ వంటి హైఎండ్ కార్లే ఎక్కువగా కనిపించాయి. కొందరు నగరవాసులు తమ కుటుంబాలతో సహా పయనమై ఉభయ గోదావరి జిల్లాల్లోని బంకిణీల వద్దకు చేరుకున్నారు. అక్కడ పురుషులు పందాల్లో మునిగిపోగా... మహిళలు, యువతులు ఆ ప్రాంతాలను ఆసక్తిగా గమనిస్తూ పందెంలో చనిపోయిన కోళ్లతో చేసిన పకోడీని ఆస్వాదించారు. ఈ పకోడి కోసం బంకిణీల్లో ప్రత్యేకంగా స్టాల్స్ కూడా వెలిశాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు బంకిణీల్లో నిరాటంకంగా పందాలు కొనసాగాయి.

 చెక్ పోస్టులకు దీటుగా ‘పోర్టర్లు’
 కోడి పందాలను అడ్డుకునే వ్యూహంలో భాగంగా కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన పోలీసులు ప్రధాన రహదారులతోపాటు బంకిణీలకు దారితీసే మార్గాల్లోనూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం నుంచి వాహనాలను తనిఖీ చేస్తూ కోడి పుంజులు, నగదుతో వెళ్తున్న వారిని అదుపులోకి తీసుకోవడం ప్రారంభించారు. అయితే వీరి తనిఖీలకు ఇతర ప్రాంతాల వారు చిక్కకుండా ఉండేందుకు స్థానికుల్లో కొందరు యువకులు ‘పోర్టర్ల’ అవతారం ఎత్తారు.

 ఒక్కో పుంజుకు రూ.200 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తూ దొడ్డిదారిన బంకిణీ వద్దకు చేర్చడం ప్రారంభించారు. చెక్ పాయింట్లకు కాస్త దూరంలో ప్రధాన రహదారిపై కాపు కాస్తున్న ఈ పోర్టర్లు ఆ దారిలో వస్తున్న వాహనాల్లో ఇతర ప్రాంతాలు, ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వాటిని గుర్తించడం మొదలెట్టారు. అందులోని వారికి చెక్‌పాయింట్ విషయం చెప్తూ అప్రమత్తం చేశారు. పుంజుతో వెళ్తే పోలీసులు పట్టుకుంటారని, దాన్ని తమకు అప్పగిస్తే అడ్డదారుల్లో బంకిణీ వద్దకు చేరుస్తామని చెప్పి నిర్ణీత మొత్తం డిమాండ్ చేశారు.

అంగీకరించిన వారి నుంచి నగదు, పుంజును తీసుకుని బంకిణీ వద్దకు వచ్చిన తరవాత ఫోన్‌తో సంప్రదించి వారికి అందించారు. ఈ రకంగా స్థానిక యువ త పోర్టర్లుగా మారి చెక్‌పోస్టులతో ఫలితం లేకుండా చేశారు. మొత్తానికి ఉభయ గోదావరి జిల్లాలోని పలు చోట్ల నగరవాసుల సందడి కనిపించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement