పందేల జాతర | in the district of cock betting continued | Sakshi
Sakshi News home page

పందేల జాతర

Published Fri, Jan 17 2014 3:57 AM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM

in the district of cock betting continued

 సాక్షి, మచిలీపట్నం : సంక్రాంతి సమయంలో సంప్రదాయం ముసుగులో సాగుతున్న జూదక్రీడలో పోలీస్ పరువుకు కోళ్ల కత్తిగాట్లు తప్పడం లేదు. చివరి నిమిషం వరకు బెట్టుచేస్తున్న పోలీసులు పండగ మూడు రోజులు ఉన్నత స్థాయి ఒత్తిళ్లకు సెల్యూట్ చేయడంతో  ప్రజల్లో వారి ఇమేజ్ పలుచనవుతోంది. ఈసారి పోలీసులు పట్టుబిగించడంతో కాస్త ఆలస్యంగానే కోడిపందేలు మొదలైనా అనుమతి ముగిసిన తర్వాత కూడా కొనసాగడం శోచనీయం.

 మౌఖిక అనుమతితో పందేలు, పేకాటలు సాగాయి. బుధవారం సాయంత్రంతో పందేలు నిలిపివేయాలని పోలీసులు చెప్పినా గురువారం కూడా జూదాలు కొనసాగడం గమనార్హం. దీనివెనుక పోలీసుల లోపాయికారీ అనుమతి ఉందన్న ప్రచారం సాగింది. జిల్లాలో కొన్నిచోట్ల పందేలు నిలిపివేసిన పోలీసులు.. మరికొన్నచోట్ల మామూళ్లు తీసుకుని  అనుమతి ఇచ్చారన్న దుమారం రేగింది. ఒక మండలంలో ఎస్.ఐ., సి.ఐ.లకు మామూళ్లు ఇచ్చిన నిర్వాహకులు పెద్దఎత్తున కోడిపందేలు నిర్వహించడంతో డీఎస్పీ తన సిబ్బందితో వెళ్లి పందెపురాయుళ్లను చెదరగొట్టారు.

 దీంతో దిగువస్థాయి పోలీసు అధికారులకు మామూళ్లు ఇచ్చి ఆయనకు ఇవ్వలేదనే అక్కసుతో ఇలా కోడిపందాలను అడ్డుకున్నారని నిర్వాహకులే ప్రచారం చేశారు. గూడూరు మండలంలోని పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున కొనసాగిన పేకాటలను అడ్డుకోకుండా పోలీసులకు ముడుపులు ముట్టజెప్పినట్టు నిర్వాహకులే బాహాటంగా వ్యాఖ్యలు చేశారు.

 యథావిధిగా పందేలు..
 సరిహద్దున ఉన్న ఖమ్మం, పశ్చిమగోదావరి, గుంటూరు, నల్గొండ ప్రాంతాల్లో జరిగిన కోడిపందేలకు నిన్నటి వరకు వెళ్లిన జూదాల రాయుళ్లు గురువారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పందేలను కొనసాగించారు. గురువారం సాయంత్రం 6 గంటల వరకు  పందేల నిర్వహణకు అనుమతి ఉందన్న ప్రచారంతో జూదాలు జడలు విప్పాయి. చల్లపల్లి మండలం పాగోలు, మంగళాపురం గ్రామాల్లోను, ఘంటసాల మండలం శ్రీకాకుళం, మొవ్వ మండలం కారకంపాడు, భట్లపెనుమర్రు, పెడనసగల్లులోను పందేలు వేశారు. పామర్రు ప్రాంతంలోని నెలకూరులో పందేలపై పోలీసుల దాడులు జరిపారు.

పామర్రు మండలం బలిపర్రు, గుడివాడ మండలంలోని పలు ప్రాంతాల్లోను చాటుమాటుగా జూదాలు కొనసాగాయి. గూడూరు మండలం రామన్నపేట, పోసినవారిపాలెం, నిడుమోలు ప్రాంతాల్లో  జోరుగా సాగాయి. కాజ-రాయవరం పొలాల దిబ్బలపై పెద్దఎత్తున పేకాటలు నిర్వహించారు. జగ్గయ్యపేట ప్రాంతంలోని ముక్త్యాల, పెడన నియోజకవర్గంలో చాటుమాటుగా కోడిపందేలు జరిగాయి. బందరు మండలం పోలాటితిప్ప, చిన్నాపురం ప్రాంతాల్లోనూ పందేలు వేశారు.

 గూడూరు-బందరు మండలాల సరిహద్దుల్లో గంటలమ్మవారిపాలెంలో మూడు రోజులుగా పేకాట శిబిరం నిర్వహిస్తున్నారు. అటువైపు కన్నెత్తి చూడకుండా రోజుకు రూ.30వేలు చొప్పున పోలీసులకు మామూళ్లు ఇచ్చినట్టు చెబుతున్నారు. ఒకవేళ పోలీసులు వస్తే సమాచారం ఇచ్చేందుకు పొలాలు, రోడ్డు పక్కన ఇన్‌ఫార్మర్లను ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులు జూదాల జాతరను కొనసాగించారు.  

 ఒక్కోచోట ఒక్కో తీరు..
 జిల్లాలో పోలీసులు మరింత అభాసుపాలు కావడానికి వారి వ్యవహారశైలే కారణమని చెబుతున్నారు. సంక్రాంతి మూడు రోజులు అనుమతి ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది జిల్లా అంతటా ఒకే పద్ధతి అవలంభిస్తే వారికి కొంతైనా పరువు దక్కేది. విజయవాడ నగర పోలీసులు తమ పరిధిలో కోడి ఎగరకుండా హడావుడి చేశారు. తీరా జిల్లాలో పందేల విషయంలో ఒక్కోచోట ఒక్కో తీరుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలోని ఒకటి, రెండు నియోజకవర్గాల్లో అసలు పందేలు జరగకుండా పోలీసులు జాగ్రత్త పడితే, మిగిలిన చోట్ల గేట్లు ఎత్తేశారు.

 మరికొన్ని చోట్ల గురువారం కూడా కొనసాగడం మరింత విమర్శలకు కారణమైంది. మొవ్వ మండలంలో సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి బరిలో ఉండడంతో పోలీసులు అటువైపు చూసే సాహసం చేయలేకపోయారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement