అయ్యయ్యో.. డబ్బులు మొత్తం పోయెనె!
Published Thu, Jan 16 2014 2:56 AM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM
భీమవరం, న్యూస్‌లైన్ :సంక్రాంతి సంప్రదాయం ముసుగులో సాగిన కోడిపందాల బరుల్లో జూదం పడగవిప్పింది. కోట్లాది రూపాయలను తన్నుకుపోయింది. పండగ మూడురోజులూ ముక్కలాట, గుండాట, కోతాట వంటి జూదాలను పెద్దఎత్తున నిర్వహించారు. వీటి బారినపడి వేలాదిమంది ఇల్లు గుల్ల చేసుకున్నారు. భీమవరం పరిసర ప్రాంతాల్లో రూ.100 కోట్లకు పైగా జూదక్రీడలు తన్నుకుపోయూయి. బహిరంగంగా నిర్వహిం చిన గుండాట, కోతాట, ముక్కలాటల్లో ఎక్కువ శాతం మంది యువకులు పాల్గొన్నారు. అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వ్యక్తిగతంగా ఎవరికి వారు వేలాది రూపాయలను పణంగా పెట్టి నష్టపోయూరు. డెల్టాతోపాటు మెట్ట ప్రాంతంలోనూ జూదాల జోరు కనిపించింది.
మరోవైపు భీమవరం పట్టణంలోని లాడ్జిలు, క్లబ్బులు, ప్రైవేటు అతిథి గృహాలు, అపార్ట్‌మెంట్లు, గ్రామాల్లోని చేపల చెరువుల వద్ద గల ఫామ్ హౌస్‌లు పేకాట, ఇతర జూద క్రీడలకు వేదికగా మారారుు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం నుంచి వచ్చిన ఒక బృందం భీమవరం ప్రాంతంలో కోతాట ఆడి మూడు రోజుల్లో రూ.1.20 కోట్లను చేజార్చుకున్నట్టు తెలిపింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక వ్యాపారవేత్త పేకాటలో రూ.70 లక్షలు సమర్పించుకుని వెళ్లినట్టు సమాచారం. భీమవరం సమీపంలోని ఒక గ్రామంలో చేపల చెరువు వద్ద గల అతిథి గృహంలో సాగిన పేకాటలో హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ ఎన్‌ఆర్‌ఐ రూ.30 లక్షలను పోగొట్టుకుని రాత్రికి రాత్రే తిరుగు ముఖం పట్టారు.
Advertisement