కత్తులు కట్టేద్దాం.. ’డింకీ’ కొట్టిద్దా
కత్తులు కట్టేద్దాం.. ’డింకీ’ కొట్టిద్దా
Published Tue, Jan 10 2017 9:37 PM | Last Updated on Fri, Jul 6 2018 3:36 PM
కోడి పందేలరాయుళ్ల వ్యూహం
బరిలోకి టీడీపీ నేతలు
ఆటల పోటీల పేరుతో డెల్టాలో బరులు సిద్ధం
భీమవరం :
’కోర్టు ఆదేశాలు.. లోకాయుక్త ఉత్తర్వులు.. పోలీసుల ఆంక్షలు ఇవన్నీ మామూలే. పండగ ముందు వరకూ ఆ మాత్రం హడావుడి ఉంటుంది. భోగి రోజున మొదలెట్టి ముక్కనుమ రోజైన సోమవారం వరకు పందేలు వేసుకోండి. ఏమైనా ఇబ్బందులొస్తే మేం చూసుకుంటాం’ డెల్టాకు చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి పందేల రాయుళ్లకు ఇచ్చిన భరోసా ఇది. ఆ నేత ఒక్కరే కారు.. డెల్టా ప్రాంతంలో టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులంతా పందేల నిర్వాహకులకు ఇదేవిధంగా వత్తాసు పలుకుతున్నారు. ప్రభుత్వ పెద్దలకు ఇవ్వాలంటూ.. ఎప్పటిలా తమకు ముట్టజెప్పాల్సిన మొత్తాన్ని ముందే ఇచ్చేయాలని కోరుతున్నారు. నేతల భరోసాతో సంక్రాంతి కోడి పందేలకు భీమవరం పరిసర ప్రాంతాల్లో బరులు సిద్ధమవుతున్నాయి. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడంతో టీడీపీ నేతలు ఎక్కడికక్కడ పందేల నిర్వహణకు భారీగా సన్నాహాలు చేస్తున్నారు. గతంలో భీమవరంలోని ప్రకృతి ఆశ్రమ ప్రాంతం, వెంప, ఐ.భీమవరం, మహదేవపట్నం, పెదఅమిరం, చెరుకువాడ, కొణితివాడ తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున పందేలు నిర్వహించారు. రాష్ట్రం నలుమూలలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులతోపాటు మహిళలు సైతం పందేలు తిలకించడానికి తరలివచ్చారు. ప్రధానంగా ఒక సామాజిక వర్గానికి చెందిన వారే భారీ స్థాయిలో పందేలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా అదే స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.
’కత్తులు కట్టకుండా’ అంటూ..
కోడి పుంజులకు కత్తులు కట్టకుండా డింకీ పందేలు వేస్తామని.. ఇలా చేయడం నేరం కాదని నిర్వాహకులు చెబుతున్నారు. పైకి డింకీ పందేలు వేస్తామని చెబుతున్నా.. బరిలోకి దిగాక ఎప్పటిలా పందేలు నిర్వహించేందుకు కత్తులు నూరుతున్నారు. ఇప్పటికే కొందరు రాజకీయ నేతల భరోసాతో బరులను సిద్ధం చేయగా.. కొందరు మాత్రం కబడ్డీ, వాలీబాల్ పోటీల పేరుతో తెరవెనుక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చివరి క్షణంలో పందేలకు ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుందని.. ఆ వెంటనే క్రీడల పోటీలకు బదులు కోడి పందేలు వేయొచ్చనే ఉద్దేశంతో ఉన్నారు.
లాడ్జిలు ఫుల్..
జిల్లాలో దాదాపు అన్నిచోట్లా కోడి పందేలు వేయడం పరిపాటే అయినా.. భీమవరం పరిసర ప్రాంతాల్లో నిర్వహించే పందేలకు జనం పెద్దఎత్తున వస్తుంటారు. ఇక్కడ పండగ మూడు రోజుల్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతుంటాయి. ఇక్కడి పందేలను చూసేందుకు వచ్చేవారి కోసం భీమవరం పట్టణంలోని అన్ని లాడ్జిల్లో గదులన్నీ ఇప్పటికే బుక్ అయిపోయాయి. పట్టణంలో పేరుమోసిన హోటల్స్, లాడ్జిలు 20 వరకు ఉండగా ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ముందుగానే రూమ్‌లను బుక్ చేసుకున్నారు.
రెస్టారెంట్లలో ’సముద్ర’ వంటకాలు
భీమవరం పట్టణానికి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అతిథులు వచ్చే అవకాశం ఉండటంతో పట్టణంలోని పేరెన్నికగన్న రెస్టారెంట్లల్లో సరికొత్త వంటకాలను సిద్ధం చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రధానంగా సముద్ర చేపలతో ఎక్కువ రకాలను తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. జిల్లాలోని తీరంతోపాటు కాకినాడ, విశాఖపట్నం వంటి నగరాల నుంచి సముద్ర చేపల్ని పెద్దఎత్తున కొనుగోలు చేసి నిల్వ ఉంచుతున్నారు.
Advertisement
Advertisement