యలమంచిలి, న్యూస్‌లైన్: శృతి మించి రాగాన పడుతోంది. పండగ సరదా పరాకాష్టకు చేరి పోలీసులపై దాడి వరకూ వెళ్తోంది. కోడి పందాల్లో రేగిన పౌరుషం మూకుమ్మడిగా గొడవ పడే స్థాయికి చేరుతోంది. పెద్ద పండగ వేళ, పందాలకు పగ్గాలు వేయాలన్న పోలీసులతో గ్రామస్తులు ఘర్షణ పడే వాతావరణం తలెత్తుతోంది.
పరిస్థితి చేయి దాటకుండా గ్రామాల్లో పోలీసులను మోహరించాల్సి వస్తోంది. కోడిపందాలను అదుపు చేయాలన్న పోలీసుల ప్రయత్నాలకు ప్రతిఘటన ఎదురవుతోంది. కోడిపందాలరాయుళ్లు బరితెగిస్తూ ఉండడంతో వాతావరణం వేడెక్కుతోంది. పందాలు ఆపడానికి గ్రామాలకు వెళ్తున్న పోలీసులపై అక్కడివారు తిరగబడుతున్నారు. ఎదురుదాడులకు పాల్పడి పోలీసులనే హడలెత్తిస్తున్నారు. గురువారం యలమంచిలి మున్సిపాలిటీ పరిధి ఎర్రవరంలో ఇదే జరిగింది.
ఎర్రవరాన్ని ఆనుకుని కొండకాలువ వద్ద కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో యలమంచిలి టౌన్ ఎస్‌ఐ చంద్రమౌళి, ట్రైనీ ఎస్‌ఐలు రామకృష్ణ, రవికుమార్, మరో నలుగురు హోంగార్డులు మఫ్టీలో వెళ్లారు. పోలీసులు నిక్కర్లు, లుంగీలు, తలపాగాలతో ఉండడంతో పందెంరాయుళ్లు కొద్దిసేపు వారిని గుర్తించలేదు. వెంటనే పోలీసులు దాడి చేశారు. దాంతో పందెంరాయుళ్లు చెల్లాచెదురయ్యారు. కొందరు గ్రామంలోకి పరుగులు తీశారు.
పోలీసులు సంఘటన స్థలం వద్ద ఏడు కోళ్లను, నగదుతోపాటు నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు గ్రామంలోకి వెళ్లి వీడియో క్లిప్పింగ్ ఆధారంగా నడిగట్ల చిన్న అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు.అడ్డగించిన అతని భార్యను పోలీసులు నెట్టేయడంతో గ్రామస్తులు మూకుమ్మడిగా ఎదురుదాడికి దిగారు. దుర్భాషలాడారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామస్తుల దాడిలో పోలీసులకు స్వల్పగాయాలయ్యాయి.
సమాచారం తెలుసుకున్న యలమంచిలి సీఐ మల్లేశ్వరరావు సమైక్యాంధ్ర విధుల్లో ఉన్న సాయుథ బలగాలను ఎర్రవరానికి పంపారు. పోలీసులు పెద్ద ఎత్తున రావడంతో గ్రామస్తులు చెల్లాచెదురయ్యారు. ఈ సంఘటనను టౌన్ ఎస్‌ఐ సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. ఆ చిత్రాల ఆధారంగా దాడిచేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామానికి చెందిన పొన్నాడ రమణ, సోరంగి చిన్నలను యలమంచిలి టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
పోలీస్ స్టేషన్ వద్ద జనం
జరిగిన సంఘటనపై నర్సీపట్నం ఏఎస్పీ విశాల్ గున్ని టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సాయంత్రం విచారణ జరిపారు. ఈ సంఘటనకు సంబంధించి ముత్తు గోవిందు, నడిగట్ల దుర్గతోపాటు మరో 18 మందిని వీడియో క్లిప్పింగ్‌ల ఆధారంగా గుర్తించినట్టు సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. రమణ, చిన్నలను అరెస్టు చేశామని మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. గ్రామస్తుల దాడి సంఘటనపై ఎస్‌ఐలు రాతపూర్వకంగా యలమంచిలి సీఐకి ఫిర్యాదుచేశారు.
దీంతో ఎర్రవరం గ్రామస్తులు పెద్ద ఎత్తున యలమంచిలి టౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. బుధ వారం రాంబిల్లి మండలం గజిరెడ్డిపాలెంలోనూ ఇలాగే జరిగింది. అక్కడ పోలీసులపై దాడిచేసిన 14 మందిపై కేసులు నమోదు చేశారు. కోడిపందాలు, పేకాటలు నియంత్రించడానికి నర్సీపట్నం ఏఎస్పీ విశాల్ గున్ని ముందస్తు వ్యూహంతో మూడురోజులుగా ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహించడం సత్ఫలితాలనిస్తోంది. యలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాల్లోనే మూడురోజుల్లో 239 మంది పందెంరాయుళ్లను అరెస్టు చేసి రూ.3 లక్షలవరకు నగదును స్వాధీనం చేసుకున్నారు.
బరితెగింపు
Published Fri, Jan 17 2014 4:23 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM
Advertisement
Advertisement