ఉచ్చు బిగించాకే..!
రేవంత్‌ను విచారించిన తర్వాతే చంద్రబాబుకు నోటీసులు
♦ సూత్రధారిగా మరిన్ని ఆధారాల సేకరణకు ఏసీబీ యత్నాలు
♦ అన్ని కోణాల్లో నిందితులను ప్రశ్నించేందుకు సంసిద్ధం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముడుపుల కేసులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నోటీసులు జారీ చేయాలని అవినీతి నిరోధక శాఖ భావిస్తోంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఫోన్లో మాట్లాడినట్లు దర్యాప్తులో తేలినప్పటికీ, స్టీఫెన్‌కు రేవంత్ ఇవ్వజూపిన రూ.50 లక్షల సొమ్ముకు సంబంధించిన వ్యవహారంలో పురోగతి ఉన్న దృష్ట్యా కొద్ది రోజులు వేచి చూడాలన్న వైఖరితో ఏసీబీ ఉన్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని విచారణకు రప్పించడానికి అవసరమైన ప్రాథమిక ఆధారాలు ఇప్పటికే ఉన్నప్పటికీ, మరిన్ని వివరాల సేకరణకు దర్యాప్తు సంస్థ ప్రయత్నిస్తోంది. రేవంత్, మరో ఇద్దరు నిందితులను ఐదు రోజుల కస్టడీకి కోర్డు అప్పగిస్తే కేసులో మరింత పురోగతి ఉంటుందని భావిస్తోంది.
ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు సమీపంలోని ఓ బ్యాంక్ నుంచి డ్రా చేసిన డబ్బు ఎవరి ఖాతాలోనిది, ఆ ఖాతాదారునికి టీడీపీతో ఉన్న సంబంధం, ఆ డబ్బును ఓ సినీ నిర్మాత ఇంటికి ఎందుకు చేర్చారు? బ్యాంక్ నుంచి డ్రా చేసిన రూ.2.5 కోట్లలో మిగిలిన రూ.2 కోట్ల సొమ్ము ఎక్కడుంది వంటి వివరాల సేకరణలో ఏసీబీ నిమగ్నమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలులో భాగంగా ఐదుగురు ఎమ్మెల్యేలకు అడ్వాన్ప్‌గా రూ.50 లక్షల చొప్పున ఇచ్చేందుకే ఆ డబ్బును డ్రా చేసినట్లు అధికారులు భావిస్తున్నారు.
సీఎంకు వివరించిన ఖాన్
అవినీతి నిరోధక శాఖ డెరైక్టర్ జనరల్ ఎ.కె.ఖాన్, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి గురువారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో ఆయన అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. రేవంత్ కేసు పురోగతిని సీఎంకు వివరించారు. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రేవంత్ సంభాషణలను ఒకచోట కూర్చి తయారు చేసిన నివేదికను కూడా అందజేసినట్లు తెలిసింది. బాస్ పంపితే వచ్చానని రేవంత్ పదే పదే ప్రస్తావించిన నేపథ్యంలో ఆ బాస్ చంద్రబాబేనని ధ్రువీకరించేందుకు ఆధారాలను కూడా ఏసీబీ సేకరించింది.
ఇటీవలే ఓ న్యూస్ చానల్ అధినేతకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ పదేపదే చంద్రబాబును బాస్‌గా సంభోదించారు. బాస్ ఫలానా పని అప్పగించారని రేవంత్ అనడం, బాస్ చంద్రబాబునాయుడు అంటూ యాంకర్ ఉచ్చరించడం వంటి అంశాలతో కూడిన సీడీని ఏసీబీ సంపాదించింది. రేవంత్ బాస్ అని సంభోదించినప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్న చానల్ యాంకర్ చంద్రబాబు అని ఉచ్చరించడం ఆ సీడీలో చాలాచోట్ల స్పష్టంగా ఉంది. ఇది తమకు సాక్ష్యంగా ఉపయోగపడుతుందని ఏసీబీ భావిస్తోంది.
కస్టడీకిస్తే ప్రశ్నల పరంపర
రేవంత్‌రెడ్డిని కోర్టు కస్టడీకి అప్పగిస్తే ఆయన్ని ప్రశ్నించడానికి ఏసీబీ ప్రశ్నావళిని రూపొందించింది. వాటికి రేవంత్ సమాధానం సంతృప్తికరంగా లేకపోతే, ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేసేం దుకు అవసరమైన ఆధారాలను కూడా సిద్ధం చేసుకుంది. ఈ కేసులో పరారీలో ఉన్నట్లు చెబుతున్న నాలుగో నిందితుడు మత్తయ్యను కూడా అరెస్టు చేసి మిగతా నిందితులతో కలిపి విచారించే అవకాశముంది.
మత్తయ్యకు సంబంధించిన కీలక ఆధారాలను ఏసీబీ ఇప్పటికే సేకరించినట్లు తెలిసింది. కాగా, రేవంత్ కస్టడీ గడువు ముగిసిన తర్వాతే చంద్రబాబును విచారించవచ్చని ఏసీబీ వర్గాలు చె బుతున్నాయి. ‘ప్రస్తుతమున్న ప్రాథమిక ఆధారాల ను పరిగణనలోకి తీసుకుని చట్టబద్ధంగా ఏపీ ముఖ్యమంత్రికి నోటీసులివ్వడం సమస్య కానేకాదు. రేవంత్‌ను కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశమున్నం దున వ్యూహాత్మకంగానే ఆచితూచి వ్యవహరిస్తున్నామ’ని ఏసీబీ వర్గాలు పేర్కొన్నాయి.