ఆస్పత్రిని అప్పగించే వరకు పోరాటం ఆగదు
10వ రోజుకు చేరిన జూనియర్ డాక్టర్ల ఆందోళన
ఆపరేషన్లను అడ్డుకున్నారు
జీవోప్రతుల దగ్ధం, సంతకాల సేకరణ
తిరుపతి అర్బన్: ఎస్వీ మెడికల్ కాలేజీ పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి కోసం నిర్మించిన 300 పడకల గర్భిణీల ఆస్పత్రిని తిరిగి ఇచ్చేవరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని మెడికల్ కాలేజీ వైద్యులు, జూనియర్ డాక్టర్లు తెగేసి చెప్పారు. అందుకోసం భవన పరిరక్షణ జేఏసీ కన్వీనర్లు డాక్టర్ జీ.పార్థసారధిరెడ్డి, డాక్టర్ కిరీటి ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలు శుక్రవారం పదవ రోజుకు చేరాయి.
శుక్రవారం వరలక్ష్మీవ్రతం పర్వదినం అయినప్పటికీ రుయా-మెటర్నిటీ వైద్యులతో పాటు జూనియర్ డాక్టర్లు, హౌస్ సర్జన్లు ఉదయం 8 గంటలకే అన్ని ఆస్పత్రుల్లోని ఓపీలను నిలుపుదల చేయించారు. అలాగే రుయా పరిధిలో నిర్వహిస్తున్న ఆర్థో, పిడియాట్రిక్, ఆప్తమాలజీ, సర్జన్ విభాగాల్లో, మెటర్నిటీలోని గైనిక్ ఆపరేషన్ థియేట ర్లను బంద్ చేయించారు. మెడికల్ కాలేజీ నుంచి ర్యాలీ గా బయల్దేరిన జూనియర్ డాక్టర్లు, నర్సులు, వైద్య విద్యార్థులు మెటర్నిటీ హాస్పిటల్, రుయా చిన్నపిల్లల ఆస్పత్రి మీదుగా రుయా పరిపాలన భవనం, క్యాజు వాల్టీ మార్గంలో వెళ్లి మెడికల్ కాలేజీ సర్కిల్ వద్దకు చేరుకున్నారు.
కొంతసేపు ఆందోళన చేపట్టారు. అక్క డి నుంచి బయల్దేరి మెటర్నిటీ హాస్పిటల్ వద్దకు చేరుకుని తమకు వ్యతిరేకంగా వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన జీవో ప్రతులను దగ్ధం చేశారు. అలాగే ఆందోళనలకు మరింత ఊతం కలిగేలా సంతకాల సేకరణ చేపట్టారు. వీటిని ఈనెల 16న జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేయనున్నట్టు వైద్యులు, జేఏసీ నాయకులు పేర్కొన్నారు.
అనంతరం మెటర్నిటీ ఆస్పత్రి వద్ద జూనియర్ డాక్టర్స్(పీజీ) అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బీ.చంద్రశేఖ ర్, ఉపాధ్యక్షుడు డాక్టర్ గోపీకృష్ణ, కార్యదర్శి డాక్టర్ సురేష్ మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలతో పాటు కోస్తాలోని రెండు జిల్లాలకు చెందిన కోట్లాది మంది పేద ప్రజలకు దశాబ్దాల తరబడి వైద్యసేవలు అం దిస్తున్న తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్‌ను నిర్వీర్యం చేసేందుకు కొందరు కుట్రలు పన్నారని ధ్వజమెత్తారు. వారి కుట్రలు సాగనీయబోమని హెచ్చరించారు. 300 పడకల భవనాల నిర్వహణపై కూడా రాష్ట్ర ఉన్నతాధికారులు రోజుకో విధంగా మాట్లాడుతుండడం బాధాకరమన్నారు.
కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఎన్ఆర్హెచ్ఎం రూ.100 కోట్ల నిధులతో నిర్మించిన 300 పడకల భవనాలను ప్రజా ప్రభుత్వం లేని సమయంలో ఒకరి ద్దరు అధికారులు ఇలా కార్పొరేట్ సంస్థకు అప్పగిం చేందుకు జారీ చేసిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. చివరగా మెటర్నిటీ నుంచి బయల్దేరి అలిపిరి ప్రధాన రహదారిపై జూనియర్ డాక్టర్లు, జేఏసీ నాయకులు నినాదా లు చేస్తూ ర్యాలీని కొనసాగించారు.
నేడు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల రాక
వైద్యులు, జూనియర్ డాక్టర్లు నిర్వహిస్తున్న ఆందోళనలకు మద్దతుగా శనివారం పలువురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు రానున్నారు. వీరిలో చంద్రగిరి, నగరి ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆర్కే.రోజా, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పాల్గొని సంఘీభావం తెలపనున్నారు.